Smart Policing: స్మార్ట్ పోలీసింగ్‌లో సర్వేలో ఏపీ అరుదైన రికార్డు..

24 Nov, 2021 16:00 IST|Sakshi

సాక్షి, అమరావతి: జాతీయ స్ధాయిలో ఘనతను చాటిన ఏపీ పోలీస్‌ శాఖను సీఎం వైఎస్‌ జగన్ అభినందించారు. ప్రజలకు ఉత్తమమైన సేవలు అందించినందుకు ఏపీ పోలీసుశాఖను సీఎం మనస్పూర్తిగా అభినందించారు. ఇదేరీతిలో ప్రజలకు మరిన్నిసేవలను నిర్ణీతత సమయంలో అందించాలని సీఎం జగన్‌ ఆకాంక్షించారు. కాగా, ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌, పోలీసు ఉన్నతాధికారులు సచివాలయంలో సీఎంని కలిశారు.

ఆ తర్వాత.. స్మార్ట్‌ పోలీసింగ్‌ సర్వే వివరాలను సీఎం జగన్‌కి వెల్లడించారు. ఇండియన్‌ పోలీస్‌ ఫౌండేషన్‌ స్మార్ట్‌ పోలీసింగ్‌ సర్వేలో.. ఏపీ పోలీసింగ్‌ నెంబర్‌వన్‌ ర్యాంక్‌ సాధించిందని తెలిపారు. దేశవ్యాప్తంగా సర్వే నిర్వహించిన ఈ ఫౌండేషన్‌.. తొమ్మిది ప్రామాణిక అంశాల్లో ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ విధానాలలో సర్వే చేపట్టిందని డీజీపీ తెలిపారు. 2014లో డీజీపీల సదస్సులో ప్రధాని మోదీ పిలుపు మేరకు స్మార్ట్‌ పోలీసింగ్‌ పద్ధతులను పాటించామని తెలిపారు.

ఆయా రాష్ట్రాలలో పోలీస్‌ ఫౌండేషన్‌ ఏడేళ్లుగా సర్వే నిర్వహిస్తుందన్నారు. ఈ ఏడాది ఏపీ తొలిసారిగా మొదటి ర్యాంకు సాధించిందని డీజీపీ వివరించారు. ఏపీ పోలీస్‌ శాఖ.. ప్రజల పట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై ఐపిఎఫ్‌ఐపిఎఫ్‌ అధ్యయనం చేస్తుందని అన్నారు. దీనిలో రిటైర్డు డీజీలు,ఐపీఎస్‌లు,ఐఏఎస్‌లు, ఐఐటీ ప్రొఫెసర్లు, పౌరసమాజ ప్రముఖులు సభ్యులుగా ఉన్నారని తెలిపారు.

పౌరులపట్ల నిష్పక్షపాతంగా వ్యవహరించడం, జవాబుదారితనం, ప్రజల నమ్మకం విభాగాల్లో ఏపీ నెంబర్‌ వన్ స్థానం సాధించిందని అన్నారు. సెన్సిటివిటీ, పోలీసుల ప్రవర్తన, అందుబాటులు పోలీస్‌ వ్యవస్థ, టెక్నాలజీ ఉపయోగం విభాగాల్లో అత్యుత్తమ ర్యాంకింగ్‌ కనబర్చిందని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ తెలిపారు.

ఈ కార్యక్రమంలో లా అండ్‌ ఆర్డర్‌ అడిషనల్‌ డీజీ రవిశంకర్‌ అయ్యన్నార్‌, అడిషనల్‌ డీజీ (బెటాలియన్స్‌) శంకభ్రత బాగ్చి, డీఐజీ (టెక్నికల్‌ సర్వీసెస్‌) పాలరాజు, గుంటూరు రేంజ్‌ డీఐజీ త్రివిక్రమ్‌ వర్మ, గుంటూరు రూరల్‌ ఎస్పీ విశాల్‌ గున్నీ హజరయ్యారు. 

>
మరిన్ని వార్తలు