అంగన్‌వాడీల్లో ఇక స్మార్ట్‌ సేవలు

11 Oct, 2022 10:20 IST|Sakshi

అంగన్వాడీ కార్యకర్తలు, సూపర్‌వైజర్లకు సెల్‌ఫోన్లు

అక్రమాలకు చెక్‌ పెట్టేందుకు పెద్దపీట

జిల్లాకు 2445 సెల్‌ఫోన్లు మంజూరు

త్వరలో అధికారికంగా  ప్రారంభించేందుకు సన్నాహాలు

కడప కోటిరెడ్డిసర్కిల్‌ : పూర్వ ప్రాథమిక విద్యను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా అంగన్వాడీ కేంద్రాలలో స్మార్ట్‌ సేవలకు శ్రీకారం చుట్టేందుకు స్త్రీ శిశు సంక్షేమశాఖ ఏర్పాట్లు చేస్తోంది. జిల్లాలోని అన్ని అంగన్వాడీ కార్యకర్తలు, సూపర్‌వైజర్లకు సెల్‌ఫోన్లను అందిస్తున్నారు. అయితే త్వరలో అధికారికంగా స్మార్ట్‌ ఫోన్ల సేవల కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ స్మార్ట్‌ సేవలతో అంగన్వాడీ కేంద్రాలలో అక్రమాలకు చెక్‌ పెట్టడంతోపాటు పారదర్శకంగా సేవలు అందించేలా ప్రణాళికను సిద్ధం చేశారు.  

1.57 లక్షల మందికి పౌష్టికాహారం 
జిల్లాలో 11 ఐసీడీఎస్‌ ప్రాజెక్టులు ఉండగా అందులో అంగన్వాడీ కేంద్రాలు, మెయిన్‌ అంగన్వాడీ కేంద్రాలు 2212, మినీ అంగన్వాడీ కేంద్రాలు 177 కలిసి మొత్తం 2389 కేంద్రాలు ఉన్నాయి. ఇందులో 1,57,015 లక్షల మందికి పైగా చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు రోజూ పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. మధ్యాహ్న భోజనంతోపాటు కోడిగుడ్లు, ఇతర పౌష్టికాహారాన్ని పంపిణీ చేసి పేద, మధ్య తరగతి చిన్నారులు, మహిళల్లో రక్తహీనత తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఇందుకోసం ప్రతి బడ్జెట్‌లో కోట్లాది రూపాయలు కూడా కేటాయిస్తున్నారు.  

అంగన్వాడీ కేంద్రాలకు ఫోన్ల పంపిణీ
అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు అందిస్తున్న పౌష్టికాహారం పంపిణీలో అవకతవకలు అరికట్టేందుకు ప్రభుత్వం స్మార్ట్‌ ఫోన్లకు శ్రీకారం చుడుతోంది. అంగన్వాడీ కార్యకర్తలు, వారిని పర్యవేక్షించే సూపర్‌వైజర్లకు కూడా కొత్తగా స్మార్ట్‌ ఫోన్లను మంజూరు చేశారు. జిల్లాకు 2445 సెల్‌ఫోన్లు మంజూరయ్యాయి. వీటిని అంగన్వాడీ కార్యకర్తలు, సూపర్‌వైజర్లకు పంపిణీ చేస్తున్నారు. ఇప్పటికే ఈ పంపిణీ ప్రక్రియ కొనసాగుతోంది.

2445 స్మార్ట్‌ఫోన్లు 
జిల్లాలోని 11 ప్రాజెక్టులలో 2389 మంది కార్యకర్తలకు, 56 మంది సూపర్‌వైజర్లకు రాష్ట్ర ప్రభుత్వం విధుల నిర్వహణ నిమిత్తం 2445 స్మార్ట్‌ ఫోన్లను మంజూరు చేసింది. వీటి ద్వారా ఆయా సిబ్బంది అంగన్వాడీ కేంద్రాల్లో అందిస్తున్న వివిధ సమాచారాన్ని ఫీడ్‌ చేసి ఉన్నతాధికారులకు పంపాల్సి ఉంటుంది.  

పక్కాగా పౌష్టికాహారం పంపిణీ 
జిల్లాలో అంగన్వాడీ కార్యకర్తలు ప్రతిరోజు చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు అందించే పౌష్టికాహారాన్ని వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ ట్రాక్‌ యాప్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. లబ్ధిదారులు హాజరు, గృహ సందర్శన కార్యక్రమాల ద్వారా గర్భిణులు, బాలింతలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఐరన్‌మాత్రల వినియోగంపై అవగాహన కల్పించాల్సి ఉంటుంది. అలాగే అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే పౌష్టికాహారంతోపాటు అదనంగా తీసుకోవాల్సిన ఆహారంపై కూడా అవగాహన కల్పించాలి.

అలాగే పిల్లల బరువు, ఎత్తు ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో పొందుపరచాల్సి ఉంటుంది. ఇలా అంగన్వాడీ కేంద్రాలు అందించే ప్రతి కార్యక్రమాన్ని ఆన్‌లైన్‌లో నమోదు చేయడం ద్వారా అక్రమాలకు చెక్‌ పెట్టడంతోపాటు పారదర్శకమైన సేవలు అందించేందుకు మార్గం సుగమమవుతోంది. అంతేకాకుండా రక్తహీనతతో బాధపడుతున్న చిన్నారులు, గర్భిణులు, బాలింతల ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ఇది ఎంతగానో దోహదపడుతుంది. 

పారదర్శకమైన సేవలు 
జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో పారదర్శకమైన సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇందులో భాగంగా అంగన్వాడీ కార్యకర్తలు, సూపర్‌వైజర్లకు స్మార్ట్‌ ఫోన్లను అందిస్తోంది. ఈ స్మార్ట్‌ సేవలతో అక్రమాలకు చెక్‌ పెట్టినట్లవుతుంది. అంగన్వాడీ కేంద్రాలలో అందిస్తున్న పౌష్టికాహారంతోపాటు అనేక సేవా కార్యక్రమాలను పొందుపరచాల్సి ఉంటుంది. 
-ఎంఎన్‌ రాణి, ప్రాజెక్టు డైరెక్టర్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ, కడప

మరిన్ని వార్తలు