‘స్మార్ట్‌ టౌన్ల’కు యమా క్రేజ్

7 Apr, 2021 03:14 IST|Sakshi

ఎంఐజీ ప్లాట్ల కొనుగోలుకు పట్టణ వాసుల అమితాసక్తి  

లాభాపేక్ష లేకుండా సరసమైన ధరలకు అందించనున్న ప్రభుత్వం 

ఇప్పటికే 50 వేల ప్లాట్లకు డిమాండ్‌ 

మరో పదివేల ప్లాట్ల వరకు డిమాండ్‌ వస్తుందని అంచనా 

5వేల ఎకరాలు అవసరమవుతాయని పురపాలక శాఖ ప్రాథమిక అంచనా  

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్న స్మార్ట్‌ టౌన్ల ప్రాజెక్టుకు పట్టణ ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. నగరాలు, పట్టణాల్లో అన్ని వసతులతో అభివృద్ధి చేసిన లేఅవుట్లను లాభాపేక్ష లేకుండా సరసమైన ధరలకు అందిస్తామన్న ప్రభుత్వ ప్రకటన పట్ల సర్వత్రా సానుకూలత వ్యక్తమవుతోంది. మిడిల్‌ ఇన్‌కం గ్రూప్‌(ఎంఐజీ) కేటగిరీలో 150 చదరపు గజాలు, 200 చదరపు గజాలు, 240 చదరపు గజాల విస్తీర్ణంలో ప్లాట్లను విక్రయించనున్న లే అవుట్లపట్ల పట్టణ ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకునేందుకు పురపాలక శాఖ సర్వే చేపట్టింది. వార్డు సచివాలయాలను యూనిట్‌గా తీసుకుని అన్ని మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో ఈ సర్వే నిర్వహిస్తున్నారు. అందుకోసం ప్రత్యేక ప్రొఫార్మా రూపొందించి ఈ నెల 10లోగా సర్వే పూర్తి చేయాలని పేర్కొంది. ఇప్పటికే చాలావరకు పూర్తయిన సర్వేలో ప్రజల అభిప్రాయం ప్రస్ఫుటమైంది. మాకు ప్లాట్లు కావాలి అంటే మాకు కావాలంటూ ప్రజలు ఉత్సాహం చూపిస్తున్నారు. ప్రస్తుతమున్న డిమాండ్‌కు అనుగుణంగా దాదాపు ఐదువేల ఎకరాల్లో లేఅవుట్లు వేయాల్సి ఉంటుందని పురపాలక శాఖ ప్రాథమికంగా అంచనాకు వచ్చింది. 
 
డిమాండే డిమాండ్‌
స్మార్ట్‌ టౌన్ల ప్రాజెక్టుపై ప్రస్తుతం మునిసిపల్‌ కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లో సర్వే కొనసాగుతోంది. ఇప్పటివరకు 50 వేల కుటుంబాలు ఎంఐజీ ప్లాట్లు కొనుగోలుకు తమ సంసిద్ధతను తెలిపాయి. ఇందులో 150 చ.గజాల ప్లాట్లు కావాలని 16,200 కుటుంబాలు, 200 చ.గజాల ప్లాట్లు కోసం 14,200 కుటుంబాలు, 240 చ.గజాల ప్లాట్లు కావాలని 19,600 కుటుంబాలు కోరాయి. ఏప్రిల్‌ పది నాటికి ఈ సర్వే పూర్తి కానుండగా.. మరో పదివేల ప్లాట్ల వరకు డిమాండ్‌ వస్తుందని పురపాలక శాఖ అధికారులు భావిస్తున్నారు.

ఐదువేల ఎకరాలు అవసరం..
ఇంతవరకు నిర్వహించిన సర్వే ప్రకారం 50 వేల ప్లాట్లకు కనీసం 4,100 ఎకరాలు అవసరమవుతాయని పురపాలక శాఖ అధికారులు నిర్ధారించారు. ఏప్రిల్‌ 10 నాటికి మొత్తం పట్టణ స్థానిక సంస్థల్లో సర్వే పూర్తి చేసేసరికి దాదాపు 60 వేల ప్లాట్ల వరకు డిమాండ్‌ లెక్క తేలుతుందని భావిస్తున్నారు. ఆ ప్రకారమైతే ఐదువేల ఎకరాలు అవసరమవుతాయని భావిస్తున్నారు. నిబంధనలను పాటిస్తూ అన్ని వసతులతో లేఅవుట్లు వేయనున్న సంగతి తెలిసిందే. విశాలమైన రోడ్లు, పార్కులు, వాకింగ్‌ ట్రాక్‌లు, భూగర్భ డ్రైనేజీ, భూగర్భ విద్యుత్‌ కేబుళ్లు, గ్రీనరీ మొదలైన అన్ని వసతులు కల్పిస్తారు. సర్వే పూర్తయ్యాక మునిసిపల్‌ కార్పొరేషన్లు, మునిసిపాలిటీల వారీగా అవసరమైన భూసేకరణపై దృష్టి సారిస్తారు. దీనికోసం ఇప్పటికే జాయింట్‌ కలెక్టర్‌(రైతు భరోసా, రెవెన్యూ) అధ్యక్షతన జిల్లాస్థాయి కమిటీలను కూడా నియమించారు. 

ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది
స్మార్ట్‌ టౌన్ల ప్రాజెక్టులో ప్లాట్ల కొనుగోలుకు పట్టణ ప్రజలు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. లిటిగేషన్లు లేకుండా అన్ని వసతులతో ప్రభుత్వం లే అవుట్లు వేసి లాభాపేక్ష లేకుండా సరసమైన ధరలకు విక్రయించనుండటమే అందుకు కారణం. సర్వే పూర్తయ్యాక భూసేకరణ అంశంపై కార్యాచరణ చేపడతాం.
–వి.రాముడు, డైరెక్టర్, రాష్ట్ర పట్టణ ప్రణాళిక విభాగం, పురపాలక శాఖ  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు