‘స్మార్ట్‌’ గైడ్‌.. ఒక్క క్లిక్‌తో ఎక్కడెక్కడికో.. అధ్యయనంలో ఆసక్తికర విషయాలు

22 Nov, 2022 04:55 IST|Sakshi

ప్రపంచంలో 71 శాతం మందికి ప్రయాణ మార్గదర్శిగా స్మార్ట్‌ ఫోన్‌  

మన దేశంలో ఫోన్‌ సాయంతోనే 87 శాతం మంది టూర్‌ ప్లాన్‌

సాక్షి, అమరావతి: ప్రపంచవ్యాప్తంగా ‘స్మార్ట్‌ ట్రావెలింగ్‌’ కొత్తపుంతలు తొక్కుతోంది. ప్రయాణికులు స్మార్ట్‌ ఫోన్‌ను ట్రావెల్‌ టూల్‌గా ఉపయోగిస్తూ దేశ, విదేశాలను చుట్టేస్తున్నారు. మధ్యవర్తులు, టూర్‌ ఆపరేటర్లు లేకుండానే ఒక్క క్లిక్‌తో అరచేతిలో సమాచారాన్ని వీక్షిస్తూ ప్రయాణాలకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. అంతర్జాతీయంగా 18 నుంచి 64 ఏళ్ల వయసు గల ప్రయాణికుల్లో 71% మంది తమ పర్యటనల కోసం స్మార్ట్‌ ఫోన్‌లపై ఆధారపడుతున్నారు.

భారతదేశంలో అత్యధికంగా 87% మంది ప్రయాణికులు స్మార్ట్‌ ఫోన్‌ సాయంతోనే తమ ప్రయాణాలు చేస్తున్నట్లు గూగుల్, ఫోకస్‌ రైట్‌ సంస్థల అధ్యయనంలో వెల్లడైంది.  ఫోన్‌ ద్వారా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ)లోని వాయిస్‌ మోడ్‌లో సూచనలు, టికెట్‌ బుకింగ్‌లో డిజిటల్‌ అసిస్టెంట్‌ సేవలు సులభంగా లభిస్తున్నాయి. పర్యాటకులు ఎంపిక చేసుకున్న ప్రదేశాలకు నావిగేషన్‌ సాయంతో తేలికగా చేరుకుంటున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ట్రావెల్‌ కంపెనీలు కూడా కస్టమర్‌ జర్నీకి అనుగుణంగా ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐవోటీ) సేవలను ప్రవేశపెడుతున్నాయి.    

పర్యాటక రంగానికి ఊతం... 
భారతదేశం నుంచి 2024 నాటికి సుమారు 8 కోట్ల మంది విదేశీ పర్యటనలు చేస్తారని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆసియా పసిఫిక్‌ డెస్టినేషన్‌ ఫోర్‌కాస్ట్‌–2022–24 రిపోర్టు ప్రకారం రానున్న రెండేళ్లలో 1.34 కోట్ల మంది విదేశీయులు భారతదేశాన్ని సందర్శిస్తారని అంచనా. దీనివల్ల కోవిడ్‌ వల్ల దెబ్బతిన్న పర్యాటక రంగానికి ఊతం లభిస్తుందని భావిస్తున్నారు.   

ప్రచారంలో డిజిటల్‌ పోటీ... 
కేరళ, మధ్యప్రదేశ్, గోవా, రాజస్థాన్‌ వంటి రాష్ట్రాలు దేశ, విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా ఆన్‌లైన్‌ వేదికగా విస్తృత ప్రచారం చేస్తున్నాయి. ఇప్పటికే కేరళ ప్రభుత్వం వర్చువల్‌ ట్రావెల్‌ గైడ్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది. క్యూఆర్‌ కోడ్‌ ద్వారా టూరిజం లొకేషన్లను సులభంగా తెలుసుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, బస్‌ స్టాండ్‌లలో వాటిని విరివిగా ప్రదర్శిస్తోంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌ టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీటీడీసీ) కూడా సాంకేతిక వ్యవస్థను మెరుగుపరుస్తోంది. జియోగ్రాఫిక్‌ ఇన్‌ఫర్మేషన్‌ సిస్టం (జీఐఎస్‌)ను అభివృద్ధి చేస్తోంది. తద్వారా పర్యాటకులు కచ్చితత్వంతో తమ ప్రయాణాలను ఎంపిక చేసుకునేలా సేవలు అందించనుంది. స్థానిక కళలు, చేతివృత్తులను ప్రోత్సహించేలా పర్యాటక రంగానికి అనుసంధానిస్తూ జీఐఎస్‌ వెబ్‌సైట్‌ను రూపొందిస్తున్నారు. 

మరిన్ని వార్తలు