ఒకేసారి రెండు పాములు.. విద్యార్థినిని కాటేసి..

16 Jul, 2022 13:25 IST|Sakshi
చాకలి మల్లేశ్వరి (ఫైల్‌)

నంద్యాల (నందవరం): ఒకేసారి రెండు పాములు కాటేసి ఓ విద్యార్ధిని ప్రాణాలు తీశాయి. నందవరం మండలం  నదికైరవాడి గ్రామం యానంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. చాకలి నాగరాజు, నరసమ్మ దంపతుల మూడవ కుమార్తె మల్లేశ్వరి (15)మంత్రాలయంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతుంది. గత మంగళవారం రాత్రి   కుటుంబసభ్యులతో కలిసి  రేకుల కొట్టంలో పడుకుంది.  సుమారు 11 గంటల సమయంలో తన చేతికి, కాలికి ఏదో కరిచిందని  మల్లేశ్వరి నిద్రలేచి తండ్రికి చెప్పింది. 

అతను  లైట్లు వేసి చూడగా   మల్లేశ్వరి చేతి వద్ద ఓ పాము, కాలు వద్ద మరో పాము కనపడ్డాయి.  వాటిని  చంపి వెంటనే  కుమార్తెను ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అక్కడి నుంచి అంబులెన్స్‌లో మెరుగైన చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించగా కోలుకోలేక  గురువారం రాత్రి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు శుక్రవారం పోస్టుమార్టం నిర్వహించి మృత దేహాన్ని   తల్లిదండ్రులకు అప్పగించారు. చదువుతున్న కూతురు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.    

మరిన్ని వార్తలు