సర్పాలతో మేలే.. ఏపీలో విషపూరిత సర్ప జాతులు నాలుగే

14 Jun, 2022 08:22 IST|Sakshi

పర్యావరణ పరిరక్షణలో పాములది ప్రధాన భూమిక 

కీటకాలు, ఎలుకలను భక్షించి రైతులకు మేలు చేస్తున్న సర్పాలు 

రాష్ట్రంలో విషపూరిత సర్ప జాతులు నాలుగే 

నల్లమల అభయారణ్యంలోని సర్పాలపై ప్రత్యేక డాక్యుమెంటరీ 

నల్లమల అభయారణ్యం ఎన్నో జీవజాతులకు ఆలవాలం. వందల రకాల పక్షులు, జంతువులతో పాటు పాములు కూడా ఎక్కువగా  సంచరిస్తుంటాయి. విషపూరితమైన వాటితో పాటు విష రహిత పాములూ ఎక్కువే. ఈ నేపథ్యంలో సర్పాలపై ప్రత్యేకంగా డాక్యుమెంటరీ తయారు చేసి రైతులకు అవగాహన కల్పించేందుకు అటవీ శాఖ చర్యలు చేపడుతోంది. 

పెద్దదోర్నాల: సర్పాలంటే ప్రతి ఒక్కరికీ అంతు లేని భయం. విష పూరితమైన సర్పాలంటే గుండెల్లో దడ. పాము కనబడగానే దాన్ని మట్టుబెట్టడమో లేదా దానిని పట్టుకోవటానికి శిక్షణ పొందిన వారిని ప్రేరేపించటమో చేస్తుంటాం. అయితే మనకు ఎదురు పడిన పాములన్నీ మానవాళికి కీడు చేసేవి కావన్న నిజాన్ని గ్రహించాలని జీవశాస్త్ర నిపుణులు పేర్కొంటున్నారు.  పాములలో ఎన్నో రకాల జాతులు విషం లేనివే. వాటికి కోరలే ఉండవు. కాటు వేస్తే గాయమవడమే తప్ప ప్రాణాలకు ఎటువంటి ముప్పు ఉండదు. దీంతో పాటు కొన్ని పాముల వల్ల మానవాళికి ఎన్నో ఉపయోగాలు ఉంటాయి.

పాము కాటుకు విరుగుడుగా ఉపయోగపడే యాంటీ వీనమ్‌ను తయారు చేయాలంటే దానికి పాము విషమే కావాలి. పర్యావరణ పరిరక్షణలో ఎన్నో రకాల సర్పాలు ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. రైతులకు పరోక్షంగా సర్పరాజులు చేసే మేలు అంతా ఇంతా కాదు. వరి, గోధుమ లాంటి పంటలను నాశనం చేయటంలో మూషికాలదే ప్రధాన పాత్ర. అటువంటి మూషికాలను పాములు వేటాడి, వెంటాడి భక్షించటం వల్లనే పంటలకు మేలు జరుగుతుంది. దేశ వ్యాప్తంగా సుమారు 300 రకాలకు పైగా సర్పాలుంటే, వాటిలో కొన్ని రకాల పాములు మాత్రమే ప్రమాదభరితమైనవిగా గుర్తించినట్లు శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. వాటిల్లో కూడా ఎక్కువగా సముద్ర జలాల్లోనే జీవిస్తుంటాయి. 

చదవండి: (AP: అర్ధరాత్రి వరకు హోటళ్లు, రెస్టారెంట్లకు అనుమతి)

విషపూరితమైన పాములతో అప్రమత్తంగా ఉండాలి   
నల్లమలలో సంచరించే విషపూరితమైన పాముల్లో ప్రధానంగా చెప్పుకునే సర్పజాతులు నాలుగు రకాలు ఉన్నాయి. వాటిలో నాగుపాము, రక్త పింజర, కట్లపాము, చిన్న పింజర పాములు ఉన్నాయి. నాగుపాము పడగ విప్పుకొని మనుషులను భయపెట్టేందుకు ప్రయత్నిస్తుంది. నాగుపాములకు ఎలుకలు మంచి ఆహారం. ఎలుకల కోసమే నాగుపాములు పొలాల్లో ఎక్కువగా సంచరిస్తుంటాయి. దీంతో పాటు ఆకారంలో ఎంతో చిన్నదిగా ఉండేవి చిన్న పింజర పాములు. ఎంత ఆకారంలో చిన్నదైనా దీని విషం మాత్రం చాలా భయంకరమైంది. అది మనుషులపై మెరుపు వేగంతో దాడి చేస్తుంది.

ఖాళీ ప్రాంతాలు, బీడు ప్రాంతాల్లో ఎక్కువగా ఇది కనబడుతుంది. గడ్డి లోపల, కాలిన ఆకుల మధ్య ఎక్కువగా ఉంటుంది. కట్లపాము రాత్రి పూట మాత్రమే ఆహారాన్ని వెతికే పనిలో ఉంటుంది. ఈ క్రమంలో నేల మీద పడుకుని ఉన్న వారిని కాటు వేసే ప్రమాదం ఉంది. రాత్రి వేళల్లో తిరిగేటప్పుడు ఎక్కువగా దీని వల్ల ప్రమాదాలు చోటు చేసుకుంటాయి. దాని పెద్ద ఆకారం, పెద్ద కోరలు, భయంకరమైన విషం. పాము కాట్ల మరణాలకు ఎక్కువ కారణం రక్తపింజరే. రాలిపోయిన ఆకుల మధ్య ఎక్కువగా దాక్కుని ఉంటుంది. 

చదవండి: (టీఎస్‌ఆర్టీసీ చార్జీల పెంపు.. ఏపీఎస్‌ఆర్టీసీకి రాబడి)

విషరహితమైన పాములతో ప్రమాదమే లేదు 
నల్లమల అభయారణ్యంలో సంచరించే విషరహిత పాముల్లో పసిరిక పాము, జెర్రిపోతు, రెండు తలల పాములు, మట్టిపాములు లాంటివి ఎక్కువగా ఉంటాయి. వాటిలో చెట్లపై ఉండే పసిరిక పాములు ఆకుల రంగులో ఉండి పక్షుల గుడ్లు, చిన్న చిన్న పురుగులను తిని జీవిస్తుంటాయి. జెర్రిపోతు పాములకు భయం ఎక్కువగా ఉంటుంది. మానవాళికి వీటి వల్ల ఎటువంటి ప్రమాదం లేదు. భూమి లోపల ఉండే పాముల్లో రెండు తలల పాములు ఒకటి. దాని వల్ల ఏ ప్రమాదం ఉండదు. అవి వేగంగా పరిగెత్తలేవు. దగ్గరలో ఉన్న బొరియల్లో ఎక్కువగా ఉంటాయి. మరో పాము మట్టిపాము. దీని వల్ల కూడా ఎవరికీ ప్రమాదం ఉండదు. ఇవి ఎక్కువగా ఎలుకలను తిని జీవిస్తుంటాయి.   

మరిన్ని వార్తలు