Snakes: పాములు పగబడతాయా.. అందులో నిజమెంత..?

25 Mar, 2022 08:48 IST|Sakshi

ఇటీవల ఆదిలాబాద్‌ జిల్లాలో ఒక విద్యార్థిని పాముకాటుకు బలై చనిపోయింది. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలో ఒక కుటుంబం లోని అందరినీ గత రెండు మూడు నెలల నుండి పాము కరుస్తూ వస్తోందని భయపడుతున్నారు. అలాగే కీసరలోని ఒక హాస్టల్లో విద్యార్థి పాము కాటుకి గురై చనిపోయాడు. ఈ సందర్భంగా పాముల గురించి కొన్ని విషయాలు తెలుసుకోవటం అవసరం.

అన్ని పాములూ విషం కలిగి ఉండవు. కేవలం నాలుగయిదు రకాల పాములు మాత్రమే ఎక్కువ ప్రమాదకరమైనవి. అవి కరిచిన వెంటనే వైద్యం చేయించాలి. అన్నిచోట్లా డాక్టర్లు ఉండరు కాబట్టి కరిచినా విషం శరీరం మొత్తానికి వెళ్లకుండా పైభాగంలో గట్టిగా కట్టుకట్టాలి. ఆ తరువాత వైద్యుని వద్దకి తీసుకెళ్ళాలి. తగిన సమయంలో ఇంజెక్షన్‌ ఇస్తే విషం వల్ల ప్రమాదం తప్పుతుంది.

పాము కరిచిన  తర్వాత భయానికి లోనవ్వడం వల్లనే ఎక్కువ మరణాలు సంభవిస్తాయి. ఆ పాము మనిషిని కరవక ముందు, ఏదైనా జంతు వును కరచినట్లయితే, ఆ తరువాత మనిషిని కరచినా కూడా ప్రమాద ముండదు. ఎందుకంటే ముందుగా జంతువుని కరచింది కనుక వెంటనే మనిషి చనిపోయేంత విషం కోరల్లో ఉండదు. ఇది తెలియక కూడా భయపడతాం.

కొంతమంది తమపై పాము పగబట్టిందనీ, అందుకే కాటేసిందనీ లేదా కరవడానికి ప్రయత్నిస్తున్నదనీ భయపడుతుంటారు. పాము పగ బట్టడం అబద్ధం. మనకి పాముని చూస్తే, ఎలా భయమేస్తుందో, పాముకి కూడా మనిషిని చూస్తే అంతే భయం. అందువల్ల అవి మనల్ని చూడగానే పారిపోతాయి. హాని కలుగుతుందనుకుంటేనే  కాటు వేస్తాయి. అప్పుడు డాక్టర్‌ చేత వైద్యం చేయించుకోవాలే కానీ మంత్రం వేయించుకోవడానికి మంత్రగాడి దగ్గరికి వెళ్లకూడదు. మంత్రాలు అబద్ధాలు. ఈ వాస్తవాలను తెలుసుకుంటే పాముకాటుకు గురైనా బతికి బట్టగట్టడానికి అవకాశం ఉంటుంది.
– నార్నె వెంకటసుబ్బయ్య, అధ్యక్షుడు, ఏపీ హేతువాద సంఘం 

మరిన్ని వార్తలు