బీసీ కార్పొరేషన్లతో సామాజిక విప్లవం

25 Oct, 2020 03:41 IST|Sakshi

సీఎం జగన్‌ ఆంధ్రప్రదేశ్‌ సామాజిక న్యాయ సంరక్షకుడు

తమిళనాడుకు చెందిన పీఎంకే నేత రామదాస్‌ ప్రశంస

బిరుదును ప్రదానం చేస్తున్నానంటూ ముఖ్యమంత్రి జగన్‌కు లేఖ

బీసీలకు 56 కార్పొరేషన్ల ఏర్పాటుతో నిజమైన సామాజిక విప్లవానికి అంకురార్పణ

మహిళలకు 29 చైర్మన్‌ పదవులు,50% డైరెక్టర్‌ పదవులు అభినందనీయం 

మీరు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారు

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి 56 బీసీ కార్పొరేషన్ల ఏర్పాటు ద్వారా నిజమైన సామాజిక విప్లవానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అంకురార్పణ చేశారని తమిళనాడుకు చెందిన పట్టలి మక్కల్‌ కచ్చి (పీఎంకే) వ్యవస్థాపక నేత ఎస్‌ రామదాస్‌ ప్రశంసించారు. 56 కార్పొరేషన్లలో 29 కార్పొరేషన్లకు మహిళలను చైర్మన్లుగా నియమించడంతో పాటు, 50% డైరెక్టర్‌ పదవులను మహిళలకు కేటాయించడం అభినందనీయమని అన్నారు. ఈ నేపథ్యంలో సీఎం వైఎస్‌ జగన్‌కు ‘ఆంధ్రప్రదేశ్‌ సామాజిక న్యాయ సంరక్షకుడు’ అనే బిరుదును తాను ప్రదానం చేస్తున్నానని రామదాస్‌ తెలిపారు.

ఈ మేరకు సీఎంకు శనివారం ఆయన ఒక లేఖ రాశారు. ‘మీరు తీసుకుంటున్న చర్యలు బీసీ వర్గాలకు ఎంతగానో ఉపయోగపడతాయి. సామాజికాభివృద్ధి సాధించే దిశగా సామాజిక న్యాయాన్ని నిలబెట్టేందుకు మీరు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారు. ప్రగతిశీల ఆలోచనల పేరుతో సమాజంలో నకిలీ రాజకీయ మర్యాదల సంస్కృతి, వాతావరణం నెలకొన్న నేపథ్యంలో కొందరు కులాన్ని ఒక తిరోగమన సంకేతంగా చూస్తున్నారు. కానీ మీరు.. కులాన్ని సామాజిక న్యాయ సాధనకు పునాదిగా చూస్తున్నారు. కులాభివృద్ధిని రాష్ట్రాభివృద్ధికి ఒక సూచికగా మీరు పరిగణిస్తున్నారు. నిజమైన విప్లవం అంటే ఇదే. ఈ చర్య ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో ‘సామాజిక న్యాయ సంరక్షకుడు’ స్థాయికి మీరు ఎదిగారు. ఈ సందర్భంగా మీకు (సీఎం వైఎస్‌ జగన్‌కు) ‘ఆంధ్రప్రదేశ్‌ సామాజిక న్యాయ సంరక్షకుడు’ అనే బిరుదును ప్రదానం చేస్తున్నందుకు ఎంతగానో గర్విస్తున్నాను.. ఆనందిస్తున్నాను.’ అని రామదాస్‌ తన లేఖలో పేర్కొన్నారు.  

పేదరికం నుంచి బీసీ వర్గాలకు విముక్తి...
‘ఉన్నతమైన ఆలోచనలు రాజును ఉన్నతుడిగా చేస్తాయి’ అనే తమిళ రచయిత్రి అవ్వయార్‌ కవితను ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను. మీరు ఆమె ఆశయాలను ఆచరణలో పెడుతున్నారని నేను విశ్వసిస్తున్నాను. 30 వేల జనాభా గల కులాల వారికి సైతం ఒక కార్పొరేషన్‌ ఏర్పాటు చేయడం.. అంత తక్కువ సంఖ్యలో ఉన్నవారి అవసరాలను కూడా గుర్తించి పరిష్కరించడం కోసమేనన్నది స్పష్టమవుతోంది. ఐదేళ్లలో ఈ కార్పొరేషన్లకు రూ.75,000 కోట్లు ప్రభుత్వం నుంచి అందడం అంటే ఇది కేవలం వారి సంక్షేమానికి తీసుకుంటున్న చర్యలు మాత్రమే కాదు, వారి ఆర్థిక వికాసం కోసం తీసుకుంటున్న చర్యలని చెప్పాలి. అంతేకాదు 45 ఏళ్లు దాటిన బీసీ మహిళలకు కూడా మీరు ఇస్తున్న రూ.18,750ల సాయం వారిని ఆర్థిక స్వావలంబన దిశగా అభివృద్ధి చేస్తాయి. అలాగే 2024 నాటికి ఏపీని మద్య రహిత రాష్ట్రంగా చేసేందుకు మీరు తీసుకుంటున్న చర్యలు కూడా అద్భుతంగా ఉన్నాయి. మీరు చేపట్టిన ఇలాంటి చర్యల వల్ల మరి కొన్నేళ్లలో రాష్ట్రంలోని బీసీ వర్గాలు పేదరికం నుంచి, రుణాల ఊబి నుంచి బయట పడతాయని మేం విశ్వసిస్తున్నాం. వివిధ కులాల వారీగా కార్పొరేషన్ల ఏర్పాటు మీ ముందు చూపునకు నిదర్శనంగా భావిస్తున్నాం..’ అని రామదాస్‌ తెలిపారు.    

మరిన్ని వార్తలు