ఏపీ.. ఎంతో హ్యాపీ 'సొంతూళ్లలో సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు'

2 May, 2022 03:30 IST|Sakshi
ఏలూరులోని బిజ్‌రాక్‌ సాఫ్ట్‌వేర్‌ సంస్థలో పని చేస్తున్న ఉద్యోగినులు.(ఇన్‌సెట్‌లో) కాకినాడ సిద్ధార్థనగర్‌లో ఐటీ కంపెనీలో విధుల్లో యువత

చిన్న చిన్న ఊళ్లలో వెలుస్తున్న ఐటీ కంపెనీలు

ఉన్న ఊళ్లోనే ఐటీ జాబ్‌తో ఎంతో మంది యువత కల సాకారం

సరికొత్త ఆలోచనలతో దిగువ స్థాయికీ విస్తరిస్తున్న ‘ఐటీ’

మామూలు డిగ్రీ చదివిన వారికీ అవకాశాలు విస్తృతం

రానున్న రోజుల్లో ఈ ట్రెండ్‌కు మరింత జోరు

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలంటే అమెరికానో, ఆస్ట్రేలియానో వెళ్లాలి.. అక్కడి సంస్థల్లో ఉద్యోగాలు పొందితే రూ.లక్షల్లో జీతాలు సంపాదించొచ్చు.. అలా కాకుండా మన దేశంలోనే ఉద్యోగం చేయాలంటే ఏ బెంగళూరో, చెన్నై, హైదరాబాద్‌లోనో అయితే చెప్పుకోదగ్గ జీతాలు వస్తాయి.. లేదంటే విశాఖపట్నం లేదా విజయవాడల్లోని కంపెనీల్లో ఉద్యోగం చూసుకోవాలి. కానీ పట్టణాలు, నగరాలే ఎందుకు? సొంతూరిలోనే సాఫ్ట్‌వేర్‌ కంపెనీ పెడితే పోలా.. పుట్టిన ఊళ్లో ఉండొచ్చు. మరికొంత మందికి ఉపాధి కల్పించ వచ్చు. ఈ ఆలోచనతో కొందరు కుర్రాళ్లు ముందడుగేశారు. ఉద్యోగాలు చేసే స్థాయి నుంచి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదిగారు. ఆ విజయగాథలు మీరే చూడండి.      
– సాక్షి నెట్‌వర్క్‌ 

సంకల్పం సిద్ధించింది
ఏలూరుకు చెందిన రియాజ్‌ ఆలీఖాన్‌ హైదరాబాద్‌ జేఎన్‌టీయూలో ఎంసీఏ పూర్తి చేశాక అక్కడే ఒక సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం పొందారు. అక్కడ ఉద్యోగం చేస్తున్నా ఏదో తెలియని అసంతృప్తి వెన్నాడుతూ ఉండేది. తన ప్రాంతానికి ఏమైనా చేయాలనే ఆలోచన మదిని తొలిచేది. దీంతో చేస్తున్న ఉద్యోగాన్ని వదిలి ఏలూరు చేరుకున్నారు. ముందుగా తాను ఒక్కడే కొంత మంది క్లయింట్లకు సాఫ్ట్‌వేర్‌ సేవలు అందిస్తూ వారిని ఆకట్టుకున్నారు. ఆయన పనితీరు నచ్చి అక్కడి నుంచి ఇతర క్లయింట్లు ఆయనకు అవకాశాలు ఇవ్వడం ప్రారంభించారు. దీంతో 2012లో 20 మంది ఉద్యోగులతో ‘స్పార్క్‌ ఐటీ సాఫ్ట్‌వెబ్‌ సొల్యూషన్స్‌’ను ప్రారంభించారు. తొలుత అనుభవ రాహిత్యం వల్ల కొంత నష్టాలను చవి చూసిందా సంస్థ. పట్టుదలతో ముందుకు సాగుతూ 2016లో ‘బిజ్‌రాక్‌ వెబ్‌ సొల్యూషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ పేరిట రిజిస్ట్రేషన్‌ చేయించి తన ఐటీ సేవలను కొనసాగించారు. గత అనుభవ పాఠాలతో తప్పటడుగులూ వేయకుండా సంస్థ నేడు 50 మందికి ఉపాధి కల్పిస్తోంది.

విదేశీ క్లయింట్లకు ఐటీ సేవలు 
ప్రస్తుతం బిజ్‌రాక్‌ వెబ్‌ సొల్యూషన్స్‌ సంస్థ అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా, ఫ్రాన్స్‌ దేశాలకు చెందిన క్లయింట్లకు తన సేవలను అందిస్తోంది. ఈ సంస్థ అందించే సేవల్లో వెబ్‌ డెవలప్‌మెంట్, డిజిటల్‌ మార్కెటింగ్, రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ప్రధానమైనవి. సంస్థలో పని చేసే ఉద్యోగులకు వారి అర్హత, నైపుణ్యం బట్టి రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకూ జీతాలు చెల్లిస్తున్నారు. ఉన్న ఊరిలో అర్హతకు తగ్గ ఉద్యోగం లభించడం, ప్రతిఫలం దక్కుతుండడంతో సంస్థను వీడి వెళ్లే ఆలోచనే రావడం లేదని ఉద్యోగులు స్పష్టం చేస్తున్నారు. 

పేదవారిలో కష్టపడే తత్వం 
పేదవారిలో కష్టపడే తత్వం అధికంగా ఉంటుంది. అది పేద కుటుంబాల నుంచి వచ్చే మహిళలకు మరికాస్త ఎక్కువగా ఉంటుంది. వారి సాధికారికత కోసం మా సంస్థలో 90 శాతం ఉద్యోగాలు అటువంటి వారికే ఇస్తున్నాం. స్థానికులకే ప్రాధాన్యత. 
    – రియాజ్‌ ఆలీ ఖాన్, సీఈఓ, బిజ్‌ రాక్‌ వెబ్‌ సొల్యూషన్స్‌

ఆఫీసే ఒక కుటుంబంలా..
మా నాన్న సుధాకర్‌ క్యాటరింగ్‌ చేస్తారు. నేను బీఎస్సీ ఎలక్ట్రానిక్స్‌ పూర్తి చేశాను. నేను పదవ తరగతి చదువుతున్నప్పుడే ఈ సంస్థ గురించి విన్నాను. ఇటువంటి సంస్థలో పని చేయడం నా కల. ఈ ఆఫీసులో అందరూ కుటుంబ సభ్యుల్లా కలిసిమెలిసి పని చేస్తారు.
– తాళ్లూరి సుమాంజలి, ఉద్యోగి, బిజ్‌ రాక్‌ వెబ్‌ సొల్యూషన్స్‌

స్థానికంగానే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం 
మా నాన్న పౌల్ట్రీ ఫాంలో పని చేస్తారు. బీటెక్‌ పూర్తయ్యాక ఈ సంస్థలో ఉద్యోగం వచ్చింది. 2016 నుంచి ఇక్కడే పని చేస్తున్నాను. నా భర్త ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో సూపర్‌వైజర్‌గా పని చేస్తున్నారు. ఏలూరులోనే ఉద్యోగం చేయటానికి దీన్ని అవకాశంగా భావిస్తున్నా. 
    – ఎన్‌.తేజస్వి, బిజ్‌ రాక్‌ వెబ్‌ ఉద్యోగి

ఉద్యోగుల వద్దకే కంపెనీ 
కాకినాడ ప్రాంతానికి చెందిన కిరణ్‌కుమార్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేసిన అనుభవంతో 2015లో హైదరాబాద్‌ హైటెక్‌ సిటీలో క్లౌడ్‌ సీడ్‌ టెక్నాలజీస్‌ సంస్థను ప్రారంభించారు. కోవిడ్‌ కారణంగా 2019లో ఉద్యోగులకు వర్క్‌ ఫ్రం హోమ్‌ సదుపాయం కల్పించాల్సి వచ్చింది. ఆ క్రమంలో కంపెనీనే ఉద్యోగుల చెంతకు తీసుకెళితే.. అన్న ఆలోచన వచ్చింది. దాన్ని ఆచరణలో పెడుతూ కాకినాడ కార్పొరేషన్‌లోని సిద్ధార్ధనగర్‌కు ఆ సంస్థ 2019 నవంబర్‌లో తరలి వచ్చింది. ఒక ఉద్యోగితో ప్రారంభమైన సంస్థలో నేడు 50 మంది యువతీ యువకులు పని చేస్తున్నారు. 

స్థానికులకే ఉద్యోగాలు 
మా సంస్థలో కాకినాడ, పరిసర ప్రాంత గ్రామాలకు చెందిన వారు ఎక్కువగా పని చేస్తున్నారు. ఇద్దరు మాత్రం స్థానికేతరులు ఉన్నారు. బీటెక్, బీఎస్సీ కంప్యూటర్స్‌ చేసిన వారితో పాటు ఇతర డిగ్రీలు చదివిన వారు, కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉన్న వారికి జాబ్‌ ఇస్తున్నాం. విధుల్లోకి ఫ్రెషర్స్‌గా చేరుతున్నందున అనుభవం వచ్చేలా తర్ఫీదు ఇస్తున్నాం. వేతనం రూ.15 వేల నుంచి అనుభవాన్ని బట్టి రూ.1.70 లక్షల వరకు ఉంది. ఎక్కువగా బ్యాంకింగ్‌ రంగానికి సేవలు అందిస్తున్నాం. 400 మందికి జాబ్‌ అవకాశం ఉంది.     
– వి.వి.వి.కిరణ్‌కుమార్, క్లౌడ్‌ సీడ్‌ టెక్నాలజీస్‌ సంస్థ సీటీవో, కాకినాడ

ఏడాదిలో రూ.7 వేలు ఇంక్రిమెంటు
మాది కాకినాడలోని జగన్నాధపురం. నేను ఎంసీఏ చేశాను. 2021లో కాకినాడలో ఐటీ కంపెనీలో పని చేసేందుకు ఎంపికయ్యాను. ఈ సంస్థలో రూ.15 వేల జీతానికి చేరి, ఏడాదిలో రూ.22 వేల వేతనానికి చేరుకున్నాను. స్థానికంగానే ఐటీ కొలువు రావడంతో మా కుటుంబం సంతోషంగా ఉంది. 
    – కుంచె సాయి సంతోషి, ఐటీ ఉద్యోగి, క్లౌడ్‌ సీడ్‌ టెక్నాలజీస్‌  

ఇక్కడా ‘స్మార్ట్‌’గా ఎదగడమే లక్ష్యం
బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న స్మార్ట్‌ డీవీ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌.. చిత్తూరు జిల్లాలో ఐటీ కంపెనీ ఏర్పాటు చేయనుంది. ఏప్రిల్‌ 14న ఎస్‌ఆర్‌ పురం మండలం కొట్టార్లపల్లె సమీపంలో భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. ఏడాదిలో నిర్మాణం పూర్తి చేసి 3000 మందికి ఉద్యోగాలు కల్పించాలన్నది లక్ష్యం. గ్రూప్‌ ఛైర్మన్‌ దీపక్‌ కుమార్‌ తల్లిదండ్రులు ఈ ప్రాంతానికి చెందిన వారే. తండ్రి డీఎస్పీగా రిటైర్‌ అయ్యారు. తిరుచ్చి ఎన్‌ఐటీలో గోల్డ్‌ మెడలిస్ట్‌ అయిన దీపక్‌ కుమార్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా కొంతకాలం పనిచేసి, 2007లో బెంగళూరులో డివీ గ్రూప్‌ ఐటీ కంపెనీని ప్రారంభించారు. 2010లో ప్రైవేట్‌ లిమిటెడ్‌గా, 2015లో మల్టీ నేషనల్‌ కంపెనీగా ఎదిగింది. ఇప్పుడు ప్రపంచంలోని 40కి పైగా దేశాల్లో వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఈ  కంపెనీలో తయారయ్యే సెమీ కండక్టర్లను ప్రముఖ కంపెనీల ఎలక్ట్రానిక్‌ పరికరాల్లో వాడతారు. యాపిల్‌ ఫోన్లు, తోషిబా, శామ్‌సంగ్‌ కంపెనీల టీవీలు, సీసీ కెమెరాల్లో ఉపయోగిస్తారు. కొన్ని దేశాల రక్షణ రంగ సంస్థలకు హార్డ్‌వేర్‌ సరఫరా చేస్తున్నారు. 

ఇదీ లక్ష్యం..
ఏడాది లోపు నిర్మాణాలు పూర్తి చేస్తాం. తొమ్మిది అంతస్తుల్లో 1.60 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐటీ కంపెనీని ఏర్పాటు చేస్తాం. 3 వేల మందికి ఉపాధి కల్పించాలనేదే మా లక్ష్యం. దశల వారీగా ఉపాధి కల్పిస్తూ మూడేళ్లలో వంద శాతం లక్ష్యానికి చేరుకుంటాం. బీటెక్, ఎంసీఏ చేసిన వాళ్లకే కాకుండా డిగ్రీ చదువుకున్న వాళ్లకు కూడా ఉచితంగా శిక్షణ ఇస్తాం. 90 శాతం ఉద్యోగాలు స్థానికులకే కల్పిస్తాం...
    – దీపక్‌కుమార్‌ తల, ఛైర్మన్, స్మార్ట్‌ డీవీ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌

దూసుకెళ్లడానికి ‘టెక్‌ బుల్‌’ సిద్ధం
30 ఏళ్లపాటు దేశ విదేశాల్లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లుగా రాణించిన ఇద్దరు సోదరులు సొంత జిల్లాపై మమకారంతో కంపెనీకి శ్రీకారం చుట్టారు. ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం కరవది గ్రామానికి చెందిన నలమలపు బలరామిరెడ్డి, సుశీల దంపతుల కుమారులు అంజిరెడ్డి, విజయ భాస్కరరెడ్డి 1992లో ఇంజనీరింగ్‌ పూర్తిచేసి ఉద్యోగం కోసం దక్షిణాఫ్రికా వెళ్లారు. అక్కడ ఐటీ కంపెనీ నెలకొల్పి స్థిరపడ్డారు. ఐటీతో పాటు ఫార్మా, ప్రాపర్టీస్‌ (రియల్‌ ఎస్టేట్‌), ఎనర్జీ రంగాల్లో వందల కోట్ల టర్నోవర్‌తో వ్యాపార పరంగా, పారిశ్రామికంగా ముందుకు సాగుతున్నారు. 15 ఏళ్ల క్రితం హైదరాబాద్‌లోనూ ఐటీ కంపెనీని స్థాపించి ఉపాధి అవకాశాలను కల్పించారు.

ఇప్పటికి 7 దేశాల్లో తన వ్యాపార, పారిశ్రామిక కార్యకలాపాలను విస్తరించుకుంటూ వస్తున్నారు. 1,200 మంది ఐటీ నిపుణులతో ఇతర దేశాలకు చెందిన పెద్ద పెద్ద ప్రాజెక్టులను తమ వశం చేసుకున్నారు. తమ ప్రాంతంపై మమకారంతో గుళ్లాపల్లి గ్రోత్‌ సెంటర్‌ను ఎంచుకున్నారు. రూ.90 కోట్లతో ప్రాజెక్టు ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నదే తడవుగా కార్యరూపంలో పెట్టారు. మొదటి ఏడాది వెయ్యి మందికి, ఆ తర్వాత మూడు నుంచి ఐదు సంవత్సరాల్లో 3,000 పైచిలుకు ఉద్యోగాల మార్కు దాటాలని లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించారు. ఒంగోలు జాతి గిత్తల గొప్పతనాన్ని ప్రపంచానికి పరిచయం చేయటానికి ఐటీ కంపెనీకి ‘టెక్‌ బుల్‌’ అని నామకరణం చేశారు. 

100 కంపెనీల స్థాపనే లక్ష్యం
గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించటంతో పాటు యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దటమే ధ్యేయంగా టెక్‌ బుల్‌ కంపెనీని స్థాపించారు. నిరుద్యోగులకు సాంకేతిక, వ్యాపార, ఆర్థిక లావాదేవీలపై శిక్షణ ఇవ్వటంతో పాటు ఆర్థిక వనరులు అందించేందుకు సీడ్‌ క్యాపిటల్‌ కింద రూ.100 కోట్ల ఫండ్‌ కేటాయించారు. వారితో కంపెనీలు ఏర్పాటు చేయించి ఈక్విటీల రూపంలో ఒప్పందం కుదుర్చుకొని ప్రోత్సహించనున్నారు. తద్వారా 100 కంపెనీలను రూపొందించటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఒక్కో కంపెనీ 50 మంది చొప్పున కనీసం 5 వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించే దిశగా ప్రణాళికలు రూపొందించారు. సంస్థ త్వరలో ప్రారంభం కానుంది.

రైతు కుటుంబాలపై ప్రేమతో...
మా తల్లిదండ్రులు రైతులు. మమ్మల్ని కష్టపడి చదివించారు. వ్యవసాయంలో ఉన్న కష్టాలు మరే రంగంలో ఉండవు. అలాంటి రైతు కుటుంబాల నుంచి వచ్చిన వారికి నైపుణ్యం జోడించి మంచి భవిష్యత్తును ఇవ్వటమే ధ్యేయంగా ప్రణాళికలు రూపొందించాం. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వారికి ఆర్థికంగా ప్రోత్సాహాన్ని ఇవ్వటమే ప్రధాన ఎజెండాగా ముందుకు సాగుతున్నాం. 
    – నలమలపు విజయ భాస్కరరెడ్డి, టెక్‌ బుల్‌ ఐటీ కంపెనీ స్థాపకులు

మరిన్ని వార్తలు