బాబు పెద్దయ్యాక నాన్న ఎక్కడని అడిగితే ఏం చెప్పాలి..?

18 May, 2022 10:33 IST|Sakshi
తబ్సూమ్, సాదిక్‌వలి పెళ్లినాటి చిత్రం (ఫైల్‌)  

అనంతపురం క్రైం:  మొదటి భార్య నుంచి విడిపోయానంటూ నమ్మించి తనను రెండో పెళ్లి చేసుకుని బిడ్డ పుట్టిన తర్వాత నట్టేట ముంచిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి నుంచి న్యాయం చేయాలంటూ ఓ మహిళ వేడుకుంది. బాధితురాలు తెలిపిన మేరకు... అనంతపురం నగరంలోని ఐదో రోడ్డుకు  చెందిన సాదిక్‌ వలి మహల్దార్‌...  హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి వివాహమై, పిల్లలు కూడా ఉన్నారు.

అయితే ఈ విషయాన్ని దాచిపెట్టి మొదటి భార్యతో విడాకులు తీసుకున్నానని, రెండో వివాహం కోసం ఎదురు చూస్తున్నట్లు ఓ మ్యాట్రీమోని వెబ్‌సైట్‌లో 2018 అక్టోబర్‌లో నమోదు చేసుకున్నాడు. దీనిని గమనించిన కుటుంబసభ్యులు సూచన మేరకు వైఎస్సార్‌ జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన తబ్సూమ్‌ అదే ఏడాది నవంబర్‌ 23న హైదరాబాద్‌లో రెండో వివాహం చేసుకున్నారు. కొన్ని నెలల పాటు వీరి కాపురం సజావుగా సాగింది. తర్వాత సాదిక్‌ అనంతపురానికి మకాం మార్చి హైదరాబాద్‌లో ఉన్న తబ్సూమ్‌ వద్దకు 15 రోజులకో సారి వెళ్లేవాడు. ఈ క్రమంలోనే కరోనా లాక్‌డౌన్‌ పడడంతో ఐదు నెలల పాటు హైదరాబాద్‌ వైపు కన్నెత్తి చూడలేదు.

చదవండి: (SPSR Nellore District: నీరు చెట్టు.. కనిపిస్తే ఒట్టు)

అప్పటికే గర్భం దాల్చిన తబ్సూమ్‌.. హైదరాబాద్‌లోనే ఉంటూ 2020లో మగబిడ్డకు జన్మనిచ్చారు. అంతకు ముందే తాను వ్యాపారం చేసేందుకు రూ.20 లక్షలు కావాలని తబ్సూమ్‌ను సాదిక్‌ వలి డిమాండ్‌ చేశాడు. కోవిడ్‌ సమయంలో వ్యాపారం మొదలు పెడితే నష్టపోవాల్సి వస్తుందని, ఒకవేళ వ్యాపారమంటూ చేయదలిస్తే హైదరాబాద్‌లోనే చేద్దామంటూ భర్తకు ఆమె సూచించారు. ఇంట్లో పెద్దలు ఒప్పుకోవడం లేదని, 2021 మే నుంచి తబ్సూమ్‌ను పూర్తిగా దూరం చేశాడు. ఈ క్రమంలోనే ఈ ఏడాది జనవరిలో తబ్సూమ్‌కు సాదిక్‌ వలి మొదటి భార్య భాను ఫోన్‌చేసి తమకు ఇద్దరు పిల్లలు ఉన్నారని, తాము కలిసే ఉంటున్నామని తెలిపింది.

తనకు తెలియకుండా రెండో పెళ్లి ఎలా చేసుకున్నారంటూ నిలదీసింది. దీంతో తాను మోసపోయినట్లు గుర్తించిన ఆమె అదే నెల 22వ తేదీ అనంతపురానికి వచ్చి సాదిక్‌ కుటుంబసభ్యులను నిలదీశారు. అనంతరం దిశ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దిశ పోలీసుల సూచన మేరకు సనత్‌నగర్‌ పోలీసులకు మరో ఫిర్యాదు అందజేయడంతో విచారణ అనంతరం సాదిక్‌ వలిపై 420, 498ఏ, 3, 4 డీపీఏ సెక్షన్ల కింద సైబరాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. తన రెండేళ్ల బాబు పెద్దయ్యాక నాన్న ఎవరని అడిగితే తానేమి సమాధానమివ్వాలో అర్థం కావడం లేదని కన్నీటి పర్యంతమయ్యారు.  తనలా మరో అమ్మాయి మోసపోకుండా సాదిక్‌ను కఠినంగా శిక్షించాలని వేడుకున్నారు.  

చదవండి: (లైంగిక దాడికి యత్నించిన యువకునికి 3 ఏళ్ల జైలు)  

మరిన్ని వార్తలు