Software Engineer: మధ్యాహ్నం భోజనానికి ఇంటికొస్తానమ్మా అని చెప్పి​..

13 Apr, 2022 10:42 IST|Sakshi
మహేంద్రరెడ్డి(ఫైల్‌)  

సాక్షి, కర్నూలు(కొలిమిగుండ్ల): యువ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ నాపరాతి గని గుంతలో నీట మునిగి మృతిచెందాడు.  ఈ విషాదకర ఘటన మంగళవారం కొలిమిగుండ్లలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గాలి మల్లిఖార్జునరెడ్డి, నాగలక్ష్మి దంపతులకు కుమారుడు మహేంద్రరెడ్డి(23), కూతురు కల్పన సంతానం. బీటెక్‌ పూర్తి చేసిన మహేంద్రకు కొద్ది రోజుల క్రితం చెన్నైలోని సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. వర్క్‌ఫ్రం హోంలో భాగంగా ఇంటి వద్దే విధులు నిర్వహిస్తున్నాడు.

తండ్రికి బైక్‌ యాక్సిడెంట్‌ కావడంతో ఉద్యోగ బాధ్యతలతో పాటు  నాపరాతి గని పనులు, ట్రాక్టర్ల నిర్వహణ బాధ్యతలను భుజాన వేసుకున్నాడు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం  మీర్జాపురం సమీపంలోని గనుల వద్దకు వెళ్లాడు. గనిలో వర్షపు నీళ్లు కొద్ది రోజుల నుంచి నిల్వ ఉండటంతో  వాటిని బయటకు  తోడేందుకు కూలీల సాయంతో  విద్యుత్‌ మోటర్‌ను సిద్ధం చేశాడు. తర్వాత దూరంగా ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ వద్ద ఫీజులు వేసేందుకు ట్రాక్టర్‌లో వెళ్లారు. తిరిగి విద్యుత్‌ మోటర్‌ వద్దకు వచ్చేటప్పుడు అదే ట్రాక్టర్‌లో రాకుండా నీటిలో ఈదుకుంటూ వస్తానని కూలీలకు చెప్పి గనిలో దిగాడు.

చదవండి: (మూడు ముళ్లకు వేళాయె!.. నేటి నుంచి జూన్‌ 23 వరకు శుభ దినాలే)

సుమారు 40 మీటర్ల మేర గనిలో నీళ్లు ఫుల్‌గా ఉన్నాయి. అందులో ఈదుకుంటు వచ్చే సమయంలో నీటిలోనే మునిగిపోయాడు. గమనించిన కార్మికులు  నీళ్లలోకి దిగి మృతదేహాన్ని బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నించినా కుదరలేదు. మూడు గంటల తర్వాత చెర్లోపల్లె, ఇటిక్యాల, కొలిమిగుండ్లకు చెందిన ముగ్గురు యువకులు అతి కష్టం మీద మృతదేహాన్ని వెలికితీశారు. కుమారుడి మృతదేహం చూసిన తల్లి నాగలక్ష్మి మధ్యాహ్నం భోజన సమయానికి ఇంటికొస్తానమ్మా అని చెప్పి తిరిగిరానిలోకాలకు వెళ్లావా నాయనా అంటూ బోరున విలపించారు.  

మరిన్ని వార్తలు