సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాన్ని వదులుకుని.. సొంతూరిలో గాడిదల ఫారం.. ఆదాయం ఎంతో తెలుసా?

21 Aug, 2022 16:44 IST|Sakshi

రాజానగరం(తూర్పుగోదావరి): ‘గంగిగోవు పాలు గరిటెడైనను చాలు.. కడవడైననేమి ఖరము పాలు.. అన్నాడు వేమన. ఆయన ఇప్పటి కాలంలో ఉంటే గాడిద పాలకు ఉన్న డిమాండ్‌ చూసి తన పద్యాన్ని సవరించుకునేవాడేమో.. నిజమే మరి..! ఆవు పాలు, గేదె పాలకు కూడా లేనంతగా గాడిద పాల ధర లీటరుకు రూ.7,500 వరకూ పలుకుతోంది. ఈ డిమాండ్‌ను తనకు ఉపాధిగా మలచుకున్నారాయన. విదేశాల్లో లక్షల రూపాయల జీతాన్ని.. సాప్ట్‌వేర్‌ ఉద్యోగాన్ని వదులుకుని సొంతూరిలో డాంకీ ఫారం పెట్టాడు రాజమహేంద్రవరానికి చెందిన నరాల వీర వెంకట కిరణ్‌కుమార్‌. ఇందుకు దారి తీసిన పరిస్థితులను ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం.
చదవండి: నాటుకోడికి ఫుల్‌ గిరాకీ.. ఆ రుచే వేరబ్బా.. ఎంత ఆరోగ్యమో తెలుసా..? 

‘‘మాది రాజమహేంద్రవరం. ఎమ్మెస్సీ చదువుకున్నాను. యూఎస్‌ఏలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నప్పుడు ఓ కంపెనీ మారాను. బెంగళూరు రావాల్సి వచ్చింది. ఆ సమయంలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉండేది. రోగ నిరోధక శక్తి కోసం అందరూ నానారకాలుగా తాపత్రయ పడేవారు. ఇందుకు గాడిద పాలు బాగా ఉపయోగపడతాయని చెప్పేవారు. కొందరు ఇంటింటికీ గాడిదలను తిప్పుతూ చిన్నపాటి గ్లాసులతో పాలు అమ్మేవారు. మా అబ్బాయి ఆస్త్మా ఉండేది. గాడిద పాల వల్ల ఇది తగ్గుతుందని తెలుసుకున్నాను. ప్రయోజనం కనిపించింది.

గాడిద పాలకు ఉన్న డిమాండును సద్వినియోగం చేసుకోవాలనుకున్నాను. డాంకీ ఫారం ఏర్పాటు చేస్తే బాగుంటుందనుకున్నాను. వెంటనే కాతేరులోని మా ఫ్రెండ్‌ జీవీ రాజుతో నా ఆలోచన షేర్‌ చేసుకున్నాను. ఉద్యోగాన్ని వదులుకున్నాను. గాడిడల పెంపకంపై శిక్షణ తీసుకున్నాం. రాజానగరం మండలం మల్లంపూడిలో 30 ఎకరాలు లీజుకు తీసుకున్నాం. అక్షయ డాంకీ ఫారం గత నెలలో ఏర్పాటు చేశాం. ప్రస్తుతం ఇందులో నా స్నేహితుడి కుమార్తె నవ్య కూడా పార్టనర్‌గా చేరారు. ఆమె ఢిల్లీ ఐఐటీలో ఫస్టియర్‌ చదువుతున్నారు. చదువుకు ఆటంకం కలగకుండా చదువు కొనసాగిస్తున్నారు.

ప్రస్తుత ఫారం ఇలా..
అక్షయ డాంకీ ఫారంలో ప్రస్తుతం 120 గాడిదలు ఉన్నాయి. టోక్యో దేశానికి చెందిన యుథోపియన్‌ బ్రీడ్‌ అచ్చు గుర్రంలా ఉంటుంది. దీని ఖరీదు రూ.5 లక్షలు. ఇది రోజుకు లీటరున్నర పాలు ఇస్తుంది. రాజస్తాన్‌కు చెందిన హాలారీ రకం రోజు 750 మిల్లీలీటర్ల పాలు ఇస్తుంది. దీని ఖరీదు రూ.80 వేలు పైనే. మా ఫారంలో రోజుకు 30 లీటర్ల పాల ఉత్పత్తి జరుగుతుంది.

ప్రతి శనివారం 300 లీటర్లు హైదరాబాద్‌ పంపిస్తున్నాం. రోజు విడిచి రోజు కాకినాడ మీదుగా 20 లీటర్ల పాలను కాస్మెటిక్‌ కంపెనీలకు రవాణా చేస్తున్నాం. పెంచుకోవాలనే ఆసక్తి ఉన్నవారికి గాడిద పిల్లలను కూడా విక్రయిస్తున్నాం. పాల పొడి, పనీరు కూడా అమ్ముతున్నాం. మద్య వ్యసనం నుంచి విముక్తి కల్పించే ఔషధంలో గాడిద మూత్రం ఉపయోగపడుతుంది. ఇందుకోసం సూరత్, మహారాష్ట్రలకు వారం వారం గాడిద మూత్రం పంపిస్తున్నాం.

ఎన్నో రకాల విటమిన్లు
గాడిద పాలలో విటమిన్‌ ఎ, బి, సి, డితో పాటు కాల్షియం ఉంటుంది. కొవ్వు శాతం తక్కువ. ఎక్కువ కేలరీలు లాక్టోస్‌ రూపంలో ఉండే కార్బోహైడ్రేట్ల నుంచి లభిస్తాయి. రోజుకు పది మిల్లీలీటర్ల గాడిద పాలు తాగితే ఎన్నో ఫలితాలుంటాయి. ఆవు, గేదెల పాల కంటే గాడిద పాలు కాస్త పలుచగా ఉంటాయి. రుచిలో కొబ్బరి పాలను తలపిస్తాయి. విదేశాల్లో గిరాకీ ఎక్కువగానే ఉంది.

యూరప్‌ దేశాల్లో ఆహార పదార్థాలు, పానీయాల తయారీ, కాస్మెటిక్స్‌ తయారీలో వాడుతుంటారు. గాడిదలకు నిరంతరం డాక్టర్‌ అరుణ వైద్య సేవలు అందిస్తున్నారు. గాడిదలు ఉదయం, సాయంత్రం స్వేచ్ఛగా తిరిగేందుకు 20 ఎకరాలు లీజుకు తీసుకున్నాం. రోజుకు 25 కిలోల పచ్చగడ్డి అవసరమవుతోంది. సొంత ప్రాంతంపై మమకారంతో ఇక్కడ ఇలా డాంకీ ఫారం పెట్టాను’’ అని కిరణ్‌కుమార్‌ వివరించారు. 

మరిన్ని వార్తలు