సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్.. 'ఫాం'లోకి వచ్చాడు

10 Jan, 2021 11:40 IST|Sakshi

నాటు కోళ్లు, కౌజు పిట్టలు, మేకపోతులు పెంచుతున్న సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ 

సొంతూరిలో పలువురికి ఉపాధి కల్పిస్తున్న వేటపాలెం యువకుడు 

సోషల్‌ మీడియా సాయంతో వ్యాపారాభివృద్ధి  

తన ఫాంలోనే కేజీల వంతున ఆర్గానిక్‌ మాంసం విక్రయం  

చికెన్‌ తిందామంటే భయం.. మటన్‌ రుచి చూద్దామంటే సంకోచం చేపలు ట్రై చేద్దామంటే అనుమానం టైగర్‌ రొయ్యలు.. పీతలు సరేసరి ఆరోగ్యంపై కాస్త శ్రద్ధ ఉన్నవారు ఆలోచిస్తున్నారు.. అన్ని రకాల  పెంపుడు జంతువులను స్టెరాయిడ్స్‌.. పలు రకాల రసాయనాలతో పెంచుతున్నారు... అందుకే ఇప్పడు అందరి చూపు ఆర్గానిక్‌ ఉత్పత్తలపై పడింది.. చివరకు నాటు కోళ్లు.. మేకలకే జై కొడుతున్నారు ఇలాంటి జీవులను ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ పెంచి వాటి మాంసాన్నీ విక్రయిస్తున్నాడు..  

సాక్షి, వేటపాలెం: ప్రతి ఒక్కరికీ వృత్తితో పాటు ప్రవృత్తీ ఉంటుంది. అలాగే వేటపాలెంకు చెందిన షేక్‌ గఫార్‌ బాషా ఉన్నత చదువులు చదివి.. పదేళ్లుగా హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. అయితే ఇతనికి జన్మభూమిపై మమకారం పోలేదు.. పైగా వ్యవయసాయం అంటే మక్కువ. అందుకే తన సంపాదనతో పొలం కొన్నాడు. అయితే ఆయన ప్లాన్‌ మారింది.. సాగు కాకుండా దానికి అనుబంధ పరిశ్రమలైన నాటుకోళ్లు, కౌజు పిట్టలు, మేకపోతుల కోసం పౌల్ట్రీ స్థాపించి సొంతూరిలోనే పలువురికి ఉపాధి కల్పిస్తూ లాభాలు అందుకుంటున్నాడు. మాంసాహారం అంతా విషమయం అవుతు న్న నేపథ్యంలో సహజంగా జీవులను పెంచుతూ ఆర్గానిక్‌ మాంసాన్ని అమ్ముతున్న అతన్ని అంతా అభినందిస్తున్నారు.  చదవండి: (కోడిపిల్లలు ఫ్రీ.. పరుగులు తీసిన జనం)


మేకపోతులు

బాషా పేద కుటుంబానికి చెందిన వ్యక్తి అయినా.. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఎంకామ్, ఎంబీఏ పూర్తి చేశాడు. కష్టపడి ఓ ప్రైవేట్‌ సంస్థలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం సంపాదించాడు. కఠారివారిపాలెం గ్రామ శివారులో కొంత భూమి కోనుగోలు చేశాడు. అయితే ముందుగా తనకిష్టమైన వ్యవసాయం చేయాలనుకున్నాడు. దీనిపై పెద్దల సలహాలు తీసుకుని.. నేటి పరిస్థితుల మధ్య వ్యవసాయ చేయడం అంత మంచిది కాదని నిర్ధారించుకున్నాడు. అందుకే ముందుగా నాటు కోళ్ల పెంపకంపై దృష్టి సారించాడు. బ్యాంకులో పర్సనల్‌ లోన్‌ తీసుకొని సొంత భూమిలో రేకుల షెడ్లు నిర్మించాడు. నాటు కోళ్ల ఫాంను బాషా ఏర్పాటు చేసి మూడేళ్లయింది. అయితే నాటు కోళ్ల పెంపకంతో సరైన ఆదాయం రాకపోవడంతో వెంటనే కౌజు పిట్టలు, పొట్టేళ్లను కూడా పెంచడం ప్రారంభించాడు. ఇలా లాభాలు పట్టి తోటి యువకులకు ఆదర్శగా నిలబడ్డాడు.  చదవండి: (ముక్కలేనిదే ముద్ద దిగడం లేదు..)


ఫాంలో ఉన్న కౌజు పిట్టలు

అధునిక పద్ధతుల్లో మార్కెటింగ్‌
కేవలం జీవాలను అమ్మడమే కాకుండా.. తన ఫాం నుంచి నాటుకోళ్ల మాంసం, నాటు కోడి గుడ్లు, కౌజు పిట్టల మాంసం, పోటేళ్ల మాంసం విక్రయిస్తున్నాడు. సోషల్‌ మీడియాను బాగా వినియోగించుకుంటున్నాడు. యూట్యూబ్, వాట్సాప్‌ గ్రూపులు ద్వారా లోకల్‌ మార్కెట్‌ల ద్వారా తన ఉత్పత్తులను విక్రయించుకుంటున్నాడు. నాటు కోడి (లైవ్‌) కేజీ రూ.250, నాటు కోడి గుడ్డు ఒకటి రూ.10, కౌజు పిట్ట ఒకటి రూ.50, మేకపోతు మాంసం కిలో రూ.550 చొప్పున విక్రయిస్తున్నాడు.  

చిన్నతనం కోరిక నెరవేర్చుకొన్నా
నాకు చిన్నప్పటి నుంచి వ్యవసాయం చేయాలనే కోరిక ఉంది. అయితే చదువుకున్న తర్వాత హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తూ ప్రతి వారం ఇక్కడకు వచ్చి ఫాం పరిస్థితులు చూసుకొనేవాడిని.. ప్రస్తుతం కోవిడ్‌ కారణంగా ఇంటి నుంచే ఉద్యోగం చేసే అవకాశం రావడంతో ఫాం పనులు బాగా చూసుకుంటున్నా. మూడేళ్లుగా ఈ పరిశ్రమ నిర్వహిస్తున్నప్పటికీ పశుసంర్థక శాఖ అధికారులు ఎటువంటి సహకారం అందిచడం లేదు. కోళ్లకు ఏవైనా తెగుళ్లు వస్తే గూగుల్‌లోనే వెతికి మందులు వాడుతున్నాం. కొంతమంది మెడికల్‌ షాపుల వారి సలహాలు కూడా తీసుకుంటున్నా. – షేక్‌ బాషా

మరిన్ని వార్తలు