‘సోలార్‌’.. మేమే ఇస్తాం

16 Sep, 2021 02:35 IST|Sakshi

రాష్ట్ర ప్రభుత్వ పథకానికి సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ప్రశంస

వ్యవసాయానికి సోలార్‌ ఉచిత విద్యుత్‌ సరఫరాకు ముందుకొచ్చిన కేంద్ర సంస్థ

తక్కువ ధరకే 9 వేల మెగావాట్ల విద్యుత్‌ అందించేందుకు సంసిద్ధత 

‘ఆత్మనిర్భర్‌ భారత్‌ అభియాన్‌’లో భాగంగా కేంద్ర రాయితీలు ఇచ్చేందుకు సుముఖత

రాష్ట్ర ప్రభుత్వ పథకానికి జాతీయ స్థాయిలో లభించిన భారీ గుర్తింపు

సాక్షి, అమరావతి: వ్యవసాయ విద్యుత్తుకు ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన భారీ సౌర విద్యుత్తు ప్రాజెక్టుకు జాతీయ స్థాయిలో కీలక గుర్తింపు లభించింది. అంతే కాదు ఆత్మనిర్భర్‌ భారత్‌ ప్రాజెక్టు కింద ఆంధ్రప్రదేశ్‌కు 9 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ ప్రాజెక్టును తామే అందించేందుకు కేంద్రం సంసిద్ధత వ్యక్తం చేసింది. ఏటా 3 వేల మెగావాట్ల చొప్పున మూడేళ్లలో మొత్తం 9 వేల మెగావాట్ల ప్రాజెక్టును అందిస్తామని తెలిపింది. కిలోవాట్‌ అవర్‌కు రూ.2.49 చొప్పున సౌర విద్యుత్తు అందిస్తామని ప్రతిపాదించింది. రాష్ట్ర ప్రభుత్వం 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్తు ప్రాజెక్టు ఏర్పాటుకు టెండర్లు పిలిచిన విషయం కేంద్రం దృష్టికి రావడంతో ఆ ప్రాజెక్టుకు బదులుగా దీన్ని చేపట్టే అంశాన్ని పరిశీలించాలని పేర్కొంది. ఈ మేరకు ‘ఎస్‌ఈసీఐ’ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ పంపినట్లు ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్‌ బుధవారం తెలిపారు. తమ ప్రతిపాదనపై రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కోసం నిరీక్షిస్తున్నట్లు ఎస్‌ఈసీఐ లేఖలో పేర్కొంది.

వినూత్న విధానాలకు ప్రశంసలు..
నాణ్యమైన ఉచిత విద్యుత్తుతో రైతాంగానికి చీకు చింతా లేకుండా ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన 10 వేల మెగావాట్ల సోలార్‌ పవర్‌ ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వాన్ని బాగా ఆకర్షించింది. ఈ మహాయజ్ఞంలో తామూ పాలుపంచుకుంటామంటూ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఎస్‌ఈసీఐ) ముందుకు వచ్చింది. తక్కువ వ్యయంతో పునరుత్పాదక శక్తి వనరుల వినియోగంలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సరికొత్త విధానాలను ఎస్‌ఈసీఐ ప్రశంసించింది. 25 ఏళ్ల పాటు వ్యవసాయానికి పగటిపూట 9 గంటలు ఉచితంగా విద్యుత్‌ అందించేందుకు 9 వేల మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ను సరఫరా చేస్తామంటూ ప్రతిపాదించింది. ‘ఆత్మనిర్భర్‌ భారత్‌ అభియాన్‌’ పధకం ద్వారా సబ్సిడీలు కూడా అందిస్తామని తెలిపింది.

ట్రాన్స్‌మిషన్‌ చార్జీల మాఫీ కూడా..
రాష్ట్ర ప్రభుత్వం 6,400 మెగావాట్ల సోలార్‌ పవర్‌ ప్రాజెక్టుకు టెండర్లు పిలవగా కొందరు కాంట్రాక్టర్లు కిలోవాట్‌ అవర్‌(కేడబ్ల్యూహెచ్‌)కు రూ.2.49 చొప్పున టారిఫ్‌ ప్రతిపాదించినట్లు తమ దృష్టికి వచ్చిందని, అయితే అదే టారిఫ్‌కు తాము 9 వేల మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ను అందిస్తామని ఎస్‌ఈసీఐ తెలిపింది. 9 వేల మెగావాట్లను మూడేళ్లలో అంటే 2024, 2025, 2026లో మూడు వేల మెగావాట్ల చొప్పున అందుబాటులోకి తెస్తామని ప్రతిపాదించింది. దీనివల్ల డిస్కంలకు కూడా విద్యుత్‌ కొనుగోలు, సరఫరాపై అంచనాకు అవకాశం ఏర్పడుతుందని పేర్కొంది. తమ ప్రతిపాదనకు ఏపీ అంగీకరిస్తే సోలార్‌ విద్యుత్‌ ప్రాజెక్టు నెలకొల్పేందుకు వెచ్చించే వ్యయం రాష్ట్రానికి మిగులుతుందని, అది ఇతర అవసరాలకు వినియోగించుకోవచ్చని సూచించింది. తాము ఇప్పటికే టెండర్లు పిలిచి సోలార్‌ పవర్‌ ప్రాజెక్టులకు కాంట్రాక్టు ఇచ్చినందున దాని నుంచి ఏపీకి సరఫరా చేస్తామని తెలిపింది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఇంటర్‌ స్టేట్‌ ట్రాన్స్‌మిషన్‌ సిస్టం (ఐఎస్‌టీఎస్‌) చార్జీల మాఫీ కూడా ఏపీకి వర్తింపజేస్తామని పేర్కొంది.    

మరిన్ని వార్తలు