ఎండే అండ! సోలార్‌ విద్యుత్‌ దిశగా అడుగులు

16 May, 2022 18:16 IST|Sakshi

శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): గొట్టా బ్యారేజీ వద్ద నిర్మించతలపెట్టిన ఎత్తిపోతల పథకానికి సోలార్‌ విద్యుత్‌ వినియోగించే దిశగా అడుగులు పడుతున్నాయి. రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు సూచనల మేరకు ఇక్కడ లిఫ్ట్‌ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీనికి ఇంజినీర్లు మరో అడుగు ముందుకేసి సోలార్‌ విద్యుత్‌ ఏర్పాటుచేసే దిశగా ఆలోచన చేస్తున్నారు. జిల్లాలో 2.50 లక్షల హెక్టార్లు ఖరీఫ్, రబీలో పచ్చని పైరుతో మెరవాలంటే హిరమండలం రిజర్వాయర్‌లో 19.05 టీఎంసీల నీటిని నింపాలి.

డెడ్‌స్టోరేజ్‌లో 2.5 టీఎంసీల నీరు ఉంది. ఫ్లడ్‌ఫ్లో కెనాల్, కొండ చరియలు నుంచి వచ్చే నీరంతా కలిపి 4టీఎంసీలు ఉంటుంది. మిగిలిన 12 టీఎంసీల నీటిని నింపాలంటే.. ఒకటి నేరడి బ్యారేజీ నిర్మాణం పూర్తి చేసి నదిలో నీటిని మళ్లించడం, లేక గొట్టాబ్యారేజీ వద్ద లిఫ్ట్‌ ఏర్పాటుచేయడమే మార్గం. అయితే దీనికి వంశధార ఇంజినీర్లు మరో ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.

వంశధార కుడి కాలువ ద్వారా 2800 క్యూసెక్కుల నీటిని మళ్లించేలా కాలువను ఆధునీకరించేందుకు డిజైన్లు చేశారు. పాత కాలువ సామర్థ్యం 1800 క్యూసెక్కులు ఉండగా దాన్ని మరో వెయ్యి క్యూసెక్కులు అదనంగా నీరు పారేలా కాలువను 10 మీటర్లు వెడల్పు పెంచేందుకు డిజైన్‌ చేస్తున్నారు. కాలువ సామర్థ్యం పెంచి దానిలోంచి ఎత్తిపోసిన నీటిని హిరమండలం రిజర్వాయర్‌లోకి పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.  

సోలార్‌ ఏర్పాటుకు ప్రణాళిక 
హిరమండలం రిజర్వాయర్‌లోకి 12 టీంఎంసీల నీటిని నింపేందుకు సాధారణంగా విద్యుత్‌ వినియోగం 45 మెగావాట్స్‌ అవ్వవచ్చని నిపుణులు అంచనా. అందుకు సుమారు రూ.25కోట్లు విద్యుత్‌ చార్జీలు అయ్యే అవకాశం ఉంది. అయితే నీటిని ఎత్తిపోయడమనేది వర్షాకాలంలో సుమారు 100 రోజుల్లో పూర్తిచేసే అవకాశం ఉంటుంది. ఎత్తిపోతల అవసరాలు పూర్తయ్యాక మిగిలిన 9 నెలల కాలంలో సోలార్‌ విద్యుత్‌ని ప్రజా అవసరాలకు పు ష్కలంగా అందించవచ్చు. దాని వల్ల వచ్చే ఆదా యంతో సోలార్‌ప్లాంట్‌ నిర్మాణ ఖర్చులు, లిఫ్ట్‌కి అయ్యే విద్యుత్‌ చార్జీలను రాబట్టుకోవచ్చనే ఓ అంచనా వేస్తున్నారు.  

సోలార్‌ సిస్టమ్‌ని ఏర్పాటు చేయాలంటే చాలా పెద్ద స్థలం అవసరం. హిరమండలం రిజర్వాయర్‌ ఫోర్‌షోర్, రిజర్వాయర్‌ గట్టు ప్రాంతంలో ఖాళీగా ఉన్న స్థలంలో ఏర్పాటు చేయవచ్చు. 45 మెగావాట్స్‌ విద్యుత్‌ తయారు చేసేందుకు కావాల్సిన సోలార్‌ ప్లాంట్‌ ఏర్పాటుకి సుమారు రూ.300కోట్లు ఖర్చు ఉండవచ్చని అంచనా. అయితే ఏటా ఎత్తిపోతలకు అవసరమైన విద్యుత్‌ వినియోగించగా మిగిలిన రోజుల్లో వచ్చే విద్యుత్‌ ద్వారా ప్రభుత్వానికి రూ.40కోట్లు ఆదాయం వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్లాంట్‌ నిర్మాణ ఖర్చు 8 ఏళ్లలో వచ్చేస్తుంది. ప్లాంట్‌ నిర్మాణం కంటే రైతులకు ఏటా పండించే పంట అంతకు రెట్టింపుగా ఉంటుంది.  

సోలార్‌తో ప్రయోజనం  
అవసరమైన విద్యుత్‌ని సోలార్‌ నుంచి తీసుకోవడం వల్ల విద్యుత్‌ లోటు తగ్గుతుంది. లిఫ్ట్‌ అవసరాలు తీరగా ప్రజా అవసరాలను తీర్చేందుకు అవ కాశం ఉంటుంది. గతంలో భీమవరంలో ఎస్‌ఈగా పనిచేసిన సమయంలో లోసరి కెనాల్‌పైన సోలార్‌ సిస్టమ్‌ని ఏర్పాటుచేశాం. ఇప్పటికీ విజయవంతంగానే పనిచేస్తోంది. హిరమండలం రిజర్వాయర్‌లో ఉన్న ఫోర్‌షోర్‌ ఏరియాలో సోలార్‌ సిస్టమ్‌ అమర్చవచ్చు. 
– డోల తిరుమలరావు, ఎస్‌ఈ, బీఆర్‌ఆర్‌ వంశధార ప్రాజెక్టు, శ్రీకాకుళం

మరిన్ని వార్తలు