సీఎం జగన్‌కు అండగా ఉంటాం

11 Feb, 2021 04:44 IST|Sakshi
విజయవాడ వన్‌టౌన్‌లో సీఎం జగన్‌కు మద్దతు ప్రకటిస్తున్న వలంటీర్లు

వార్డు వలంటీర్ల ప్రతిన సీఎం లేఖకు స్పందనగా సంఘీభావ ర్యాలీ 

వన్‌టౌన్‌ (విజయవాడ పశ్చిమ)/అనంతపురం సెంట్రల్‌: గ్రామ సచివాలయ వ్యవస్థ సృష్టికర్త, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి తామంతా అండగా ఉంటామని గ్రామ, వార్డు వలంటీర్లు ప్రతినబూనారు. వలంటీర్లను ఉద్దేశించి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మంగళవారం లేఖ రాసిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా వలంటీర్లు బుధవారం వివిధ రూపాల్లో ఆయనకు సంఘీభావం ప్రకటించారు. పలుచోట్ల సంఘీభావ ర్యాలీలు నిర్వహించగా.. పలుచోట్ల ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందించటంలో తామంతా వారధులుగా పని చేస్తామంటూ ప్రతినబూనారు. వివిధ ప్రాంతాల్లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకాలు నిర్వహించి సీఎంకు మద్దతుగా నిలుస్తామంటూ నినాదాలు చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని గ్రామ వలంటీర్లంతా నగరంలోని వన్‌టౌన్‌కు చేరుకుని ర్యాలీ నిర్వహించారు.

ప్రజల నుంచి అత్యంత గౌరవాభిమానాలు పొందేలా, సమాజంలో తమకంటూ ఓ గుర్తింపు పొందే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రికి తామంతా రుణపడి ఉంటామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. స్థానిక నెహ్రూ బొమ్మ సెంటర్‌ నుంచి పంజా సెంటర్‌ వరకూ ర్యాలీ కొనసాగింది. వలంటీర్ల సంఘ నాయకులు మాట్లాడుతూ.. ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వారికి న్యాయం చేసే అవకాశం కల్పించిన సీఎంకు తామెప్పుడూ విధేయులుగా ఉంటామన్నారు. ప్రభుత్వం అమలు చేసే ప్రతి పథకంలో తాము భాగస్వాములు కావడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీల నేతలు కొందరు తమ వలంటీర్లను తప్పుదోవ పట్టించి ప్రభుత్వాన్ని విమర్శించే దిశగా ప్రోత్సహించారన్నారు.   

ఇది మా అదృష్టం 
‘ప్రజా సంక్షేమమే ధ్యేయంగా నిరంతరం శ్రమిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమ పథకాల అమలులో మమ్మల్ని భాగస్వాములను చేయడం అదృష్టంగా భావిస్తున్నాం. మేమంతా సేవా దృక్పథంతోనే పని చేస్తాం. జగనన్న వెంట నడుస్తాం’ అంటూ అనంతపురంలో వలంటీర్లు ర్యాలీ నిర్వహించారు. అనంతరం సీఎం వైఎస్‌ జగన్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. పలువురు మాట్లాడుతూ వలంటీర్ల వ్యవస్థ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్న ఆదరణను జీర్ణించుకోలేని కొందరు నాయకులు వలంటీర్లను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. ప్రజా సేవ చేసేందుకు అవకాశం కల్పించిన సీఎంకి రుణపడి ఉంటామన్నారు.  

మరిన్ని వార్తలు