కరెంటు సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు చర్యలు

14 Oct, 2021 03:34 IST|Sakshi

రాష్ట్రంలో 2,300 నుంచి 2,500 మెగావాట్ల థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తి

సామర్థ్యంకంటే తక్కువ ఉత్పత్తి చేస్తున్న థర్మల్‌ కేంద్రాలు

ఆర్టీటీపీఎస్‌లో కొన్ని యూనిట్ల షట్‌డౌన్‌

సీఎం చొరవతో కొంత మెరుగుపడిన బొగ్గు కేటాయింపు

నిరంతరాయంగా కరెంటు సరఫరా కోసం యూనిట్‌ రూ.14 నుంచి రూ.20కి కొనుగోలు

ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూసేందుకు చర్యలు తీసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం

సాక్షి, అమరావతి: బొగ్గు కొరత నేపథ్యంలో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఇప్పటికే అనధికారిక కరెంటు కోతలు మొదలయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలో బ్లాక్‌ అవుట్‌ చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. మహారాష్ట్ర, పంజాబ్‌ వంటి రాష్ట్రాల్లో కొన్ని థర్మల్‌ విద్యుత్తు కేంద్రాలను షట్‌డౌన్‌ చేశారు. నేషనల్‌ ఎలక్ట్రిసిటీ అథారిటీ నివేదిక ప్రకారం.. దేశంలో 116 థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలకుగాను 18 కేంద్రాల్లో బొగ్గు లేదు. మిగతా వాటిలో బొగ్గు నిల్వలు ఒక రోజు నుంచి వారం రోజులకు మాత్రమే సరిపోతాయి. ఫలితంగా 15 రాష్ట్రాల్లో విద్యుత్‌ లోటు ఏర్పడింది. ఈ నేపథ్యంలో బొగ్గు సంక్షోభాన్ని అధిగమించి, వినియోగదారులకు అసౌకర్యం కలగకుండా కరెంటు సరఫరా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

బొగ్గు కొరత తీర్చే విషయంలో కేంద్రం జోక్యం చేసుకుని, విద్యుత్‌ ధరలు తగ్గించేలా చర్యలు తీసుకోవాలని దేశంలో అందరికంటే ముందు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాసిన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్రానికి బొగ్గు సరఫరా కొంత మెరుగైంది. ఏపీ జెన్‌కో థర్మల్‌ ప్లాంట్లకు సెప్టెంబర్‌లో సగటున రోజుకు 70 వేల టన్నుల బొగ్గు అవసరం కాగా 24 వేల టన్నుల వంతున సరఫరా అయింది. రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనతో ఇటీవల అది 40 వేల టన్నులకు పెరిగింది. రాష్ట్రంలోని థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలకు 20 బొగ్గు రేక్‌లను కేటాయించేలా బొగ్గు, రైల్వే శాఖలను కేంద్ర ప్రభుత్వం ఆదేశించడానికి అవసరమైన ప్రయత్నాలను రాష్ట్ర ప్రభుత్వం, విద్యుత్తు సంస్థలు చేస్తున్నాయి. అలాగే పవర్‌ పర్చేజ్‌ అగ్రిమెంట్‌ (పీపీఏ)లు, బొగ్గు అనుసంధానం లేకుండానే అత్యవసర ప్రాతిపదికన నిలిచిపోయిన, పనిచేయని పిట్‌ హెడ్‌ బొగ్గు గనులను పునరుద్ధరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలిచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తోంది. 

బాగా పెరిగిన విద్యుత్‌ డిమాండ్‌
దేశవ్యాప్తంగా బొగ్గు కొరతతో విద్యుత్‌ డిమాండ్, సరఫరాల మధ్య తేడా భారీగా పెరిగింది. రాష్ట్రంలో 5,010 మెగావాట్ల స్థాపిత సామర్థ్యం ఉన్న ఏపీ జెన్‌కో ప్రస్తుతం 2,300 నుంచి 2,500 మెగావాట్లు మాత్రమే ఉత్పత్తి చేస్తోంది. బొగ్గు కొరత కారణంగా ఆర్టీటీపీఎస్‌కి చెందిన కొన్ని యూనిట్లు షట్‌డౌన్‌ చేశారు. కృష్ణపట్నం, ఎన్టీటీపీఎస్‌ కూడా వాటి సామర్థ్యం కంటే తక్కువగానే విద్యుదుత్పత్తి చేస్తున్నాయి. ఇటీవల విద్యుత్‌ డిమాండ్‌ బాగా పెరిగింది. ఈ నెలలో రాష్ట్రంలో విద్యుత్తు డిమాండ్‌ రోజుకు 190 మిలియన్‌ యూనిట్లకు చేరింది. బుధవారం రాష్ట్రంలో విద్యుత్‌ డిమాండ్‌ 185 మిలియన్‌ యూనిట్లు ఉంది. గత ఏడాది అక్టోబర్‌తో పోలిస్తే ఈనెలలో రోజుకు సగటున 15 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ ఎక్కువ వినియోగం జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం బయట నుంచి యూనిట్‌కు రూ.14 నుంచి రూ.20 వరకు వెచ్చించి కొనుగోలు చేసి సరఫరా చేస్తోంది. సాధారణంగా యూనిట్‌ రూ.4 నుంచి రూ.5కు లభించే విద్యుత్‌ ధర భారీగా పెరిగినా ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది.  

మరిన్ని వార్తలు