సీఎంను కలిసిన సోమేశ్‌కుమార్‌

13 Jan, 2023 05:10 IST|Sakshi
సీఎం జగన్‌కు పుష్పగుచ్చం ఇస్తున్న సోమేశ్‌కుమార్‌

హైకోర్టు తీర్పు, డీఓపీటీ ఆదేశాల మేరకు ఏపీ కేడర్‌కు వచ్చిన తెలంగాణ సీఎస్‌

సాక్షి, అమరావతి/ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ)/గన్నవరం: హైకోర్టు తీర్పుతోపాటు డీఓపీటీ ఆదేశాలతో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి రిలీవ్‌ అయిన సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి సోమేశ్‌కుమార్‌ గురువారం సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఏపీ కేడర్‌కు చెందిన సోమేశ్‌కుమార్‌ తెలంగాణలో పనిచేయడం కుదరదని తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే.

ఈ తీర్పు నేపథ్యంలో డీఓపీటీ కూడా సోమేశ్‌కుమార్‌ వెంటనే ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లాల్సిందిగా ఆదేశాలు జారీచేసింది. దీంతో ఆయన గురువారం ఉదయం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కేఎస్‌ జవహర్‌రెడ్డిని విజయవాడలోని సీఎస్‌ క్యాంపు కార్యాలయంలో కలిసి రిపోర్ట్‌ చేశారు. అనంతరం ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డిని కలిశారు. సోమేశ్‌కుమార్‌కు రాష్ట్ర ప్రభుత్వం పోస్టింగ్‌ ఇవ్వాల్సి ఉంది. అనంతరం.. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను ఆయన దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందచేయగా, ఆలయ ఈఓ భ్రమరాంబ అమ్మవారి ప్రసాదాలు, శేషవస్త్రాలను అందచేశారు.

ఏ బాధ్యతలిచ్చినా ఓకే..
ఇక ఏపీ ప్రభుత్వం ఎటువంటి బాధ్యతలు అప్పగించినా స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలంగాణ మాజీ సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ గన్నవరం విమానాశ్రయంలో మీడియాకు తెలిపారు.   

మరిన్ని వార్తలు