ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు ప్రమాణం

11 Aug, 2020 10:44 IST|Sakshi

సాక్షి, విజయవాడ: ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రమాణ స్వీకారోత్సవం నిరాడంబరంగా జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్, బీజేపీ రాష్ట్ర సహాయ ఇంచార్జ్ సునీల్ డియోదర్, మధుకర్ జీ, పురంధేశ్వరి, కన్నా లక్ష్మీనారాయణ, పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. మాజీ మంత్రి మాణిక్యాలరావు, స్వర్ణపాలెస్ ప్రమాద మృతులకు బీజేపీ నేతలు రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు. (3 రాజధానులు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం)

బాధ్యతలు స్వీకరించిన అనంతరం సోము వీర్రాజు మాట్లాడుతూ రాష్ట్ర, దేశాభివృద్ధి బీజేపీ లక్ష్యమని పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. సబ్‌కా సాథ్‌, సబ్‌కా వికాస్ అంటే అందరి జీవితాల్లో వెలుగులు నింపడమేనని ఆయన పేర్కొన్నారు. ప్రతి పేదవాడికి ప్రభుత్వ ఫలాలను అందించాలన్నారు. ‘‘జన్‌ధన్ ఖాతా ద్వారా పేదల జీవితాల్లో వెలుగులు నింపాం. రాజకీయాలు ఎన్నికల సమయంలోనే చేయాలి. ఏపీ అభివృద్ధికి బీజేపీ కృషి చేస్తుందని’’ ఆయన తెలిపారు.

సంస్థాగత మార్పులలో భాగంగా..
సంస్థాగత మార్పులలో భాగంగా సోము వీర్రాజు ఏపీ అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించారని దగ్గుబాటి పురంధరేశ్వరి తెలిపారు. కరోనా లాక్ డౌన్ నిబంధనలు అమల్లో ఉన్నందున కొంత మంది సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు. యూట్యూబ్ లింక్ ద్వారా లక్షల మంది అభిమానులు వీక్షించే ఏర్పాట్లు చేశామని ఆమె పేర్కొన్నారు.

సోము వీర్రాజుకు సహకరిస్తా..
బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ 2018 మే 13న బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా తనను నియమించారని, పది మాసాలే గడువు ఉన్నా కమిటీలు వేసుకుని ఎన్నికలకు వెళ్లామని తెలిపారు. మళ్లీ సంస్థాగత ఎన్నికలు రావడంతో.. బూత్ కమిటీలు ఏర్పాటు చేశామన్నారు. ఇప్పుడు కొత్త అధ్యక్షులుగా సోము వీర్రాజు బాధ్యత తీసుకున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ బలోపేతం చేసేందుకు తన వంతు కృషి చేశానని తెలిపారు.  తన చర్యల వల్ల కొంతమంది కి కష్టం, నష్టం కలిగించినా... అది ఉద్దేశపూర్వకంగా చేసింది కాదని వివరించారు. పార్టీ కోసం పని చేసే క్రమంలో బీజేపీని ప్రజల్లోకి తీసుకుని వెళ్లేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. కొత్త అధ్యక్షులు సోము వీర్రాజుకు తన సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని ఆయన తెలిపారు.

>
మరిన్ని వార్తలు