అత్తతో అసభ్యంగా ప్రవర్తించిన అల్లుడికి ఐదేళ్ల శిక్ష

7 Sep, 2022 13:16 IST|Sakshi

ఒంగోలు: అత్త పట్ల అసభ్యంగా ప్రవర్తించిన అల్లుడికి ఐదేళ్ల జైలుశిక్ష విధిస్తూ రెండో అదనపు జిల్లా జడ్జి ఎంఏ సోమశేఖర్‌ మంగళవారం తీర్పునిచ్చారు. ప్రాసిక్యూషన్‌ కథనం ప్రకారం..చీరాలకు చెందిన ఓ మహిళ తన భర్తతో కలిసి చెప్పుల దుకాణం నిర్వహించేది. ఆమె కుమార్తెను చిత్తూరు జిల్లాకు చెందిన కోలా జాన్‌కు ఇచ్చి వివాహం చేశారు. వారికి ఇద్దరు సంతానం. ఈ క్రమంలో అదనపు కట్నం కావాలంటూ భార్యను నిత్యం జాన్‌ వేధించేవాడు. దీంతో ఆమె పుట్టింటికి వచ్చేసింది.

ఈ క్రమంలో జాన్‌..భార్య తల్లికి ఫోన్‌ చేసి అసభ్యంగా మాట్లాడుతూ వేధించేవాడు. చివరకు ఇంట్లో ఎవ్వరు లేని సమయంలో చీరాలకు వచ్చి ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించబోగా ఆమె కేకలు వేస్తూ బయటకు వచ్చింది. అనంతరం భర్తతో కలిసి చీరాల పోలీసులకు ఫిర్యాదుచేయగా అప్పటి సీఐ వి.సూర్యనారాయణ దర్యాప్తుచేసి కోర్టులో చార్జీషీటు దాఖలు చేశారు.

నేరం నిరూపణ అయినట్లుగా న్యాయమూర్తి పేర్కొంటూ నిందితుడు జాన్‌కు ఐదేళ్ల జైలుశిక్ష, రూ.10 వేల జరిమానా విధించారు. జరిమానా చెల్లించని పక్షంలో మరో ఆరు నెలలు జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. కేసును అదనపు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ యత్తపు కొండారెడ్డి వాదించగా, కోర్టు లయన్‌ ఆఫీసర్‌గా లక్ష్మీనారాయణ వ్యవహరించారు. 

చదవండి: (తప్పుడు ఆరోపణలు చేస్తే.. మీరే ఫూల్స్‌ అవుతారు: ఆర్కే రోజా)

మరిన్ని వార్తలు