పేగు బంధాన్ని కలిపిన ఫేస్‌బుక్‌

24 Nov, 2020 04:20 IST|Sakshi
రాజమండ్రిలో తల్లి పద్మావతితో వుట్టి నాగశయనం

32 ఏళ్ల తర్వాత తల్లిని కలుసుకున్న తనయుడు 

రాజమహేంద్రవరంలో ఘటన 

రాజమహేంద్రవరం క్రైమ్‌/ప్రొద్దుటూరు క్రైమ్‌: ఫేస్‌బుక్‌ ద్వారా 32 ఏళ్ల తర్వాత తన తల్లిని కలుసుకున్నాడా తనయుడు. దీంతో అతడి ఆనందానికి అవధుల్లేవు. రాజమహేంద్రవరంలో చోటు చేసుకున్న ఘటన వివరాలిలా ఉన్నాయి.. వైఎస్సా‌ర్‌ జిల్లా ప్రొద్దుటూరులోని దేవాంగ సంక్షేమ సంఘం అధ్యక్షుడు వుట్టి నాగశయనం తల్లి పద్మావతి తన భర్త ఆంజనేయులతో గొడవపడి 32 ఏళ్ల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయింది. రాజమహేంద్రవరం చేరుకున్న ఆమె లాలాచెరువులో ఉంటూ షాపుల వద్ద పనిచేస్తూ జీవిస్తోంది. నాటి నుంచి నాగశయనం తన తల్లి ఆచూకీ కోసం చేయని ప్రయత్నం లేదు. పలు ప్రాంతాల్లో వెతికించినా ఫలితం దక్కలేదు. కాగా, రాజమహేంద్రవరం త్రీటౌన్‌ పోలీస్‌ కానిస్టేబుల్‌ జి.సూర్యనారాయణ  ఒక కేసు దర్యాప్తు నిమిత్తం లాలాచెరువులో విచారణ చేస్తుండగా 70 ఏళ్ల పద్మావతి కనిపించింది.

ఆమె దీనస్థితి చూసి వివరాలు అడగ్గా తనకు ఎవరూ లేరని.. భర్తతో గొడవ పడి ఇక్కడకు వచ్చినట్టు తెలిపింది. దీంతో ఆయన పద్మావతి వివరాలను ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. అయితే దానిపై ఎవరూ స్పందించలేదు. పోస్టు చేసి ఏడాది గడవడంతో దాని రిమైండర్‌ ఫేస్‌బుక్‌లో రావడంతో ఈ నెల 21న సూర్యనారాయణ మళ్లీ పోస్టు చేశారు. కడపకు చెందిన రమేశ్‌ దాన్ని చూసి లోకల్‌ గ్రూప్‌లో అప్‌లోడ్‌ చేశారు. ఆ పోస్టును పద్మావతి కుమారుడు నాగశయనం చూసి సోమవారం భార్య శారదతో రాజమహేంద్రవరం వచ్చి తన తల్లిని కలిశాడు.

32 ఏళ్ల తర్వాత కలుసుకున్న తల్లీతనయుడు ఒకరినొకరు చూసుకుని కన్నీటిపర్యంతమయ్యారు. అనంతరం త్రీటౌన్‌ పోలీస్‌స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ దుర్గాప్రసాద్‌.. పద్మావతిని ఆమె కుమారుడు నాగశయనంకు అప్పగించారు. కాగా.. పద్మావతి ఇల్లు వదిలి వచ్చేసరికి నాగశయనం వయసు 15 ఏళ్లు. ఆమెకు ముగ్గురు కుమార్తెలు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా నాగశయనం సాక్షితో మాట్లాడుతూ.. తన తల్లి రాజమండ్రిలో ఉంటుందని ఊహించలేదని చెప్పారు. ఇంతకాలం తర్వాత కనిపించడం చాలా సంతోషంగా ఉందన్నారు.  

మరిన్ని వార్తలు