Elderly Couple In Tirupati: ఎంగిలిపేట్లు కడిగాం.. ఆస్తులన్నీ రాసిచ్చాం.. బతకడానికి దారి చూపండయ్యా

22 May, 2022 09:56 IST|Sakshi
జీవనాధారం లేకుండా పోయిందని కన్నీటి పర్యంతమవుతున్న వృద్ధ దంపతులు

పదమూడేళ్లుగా జీవచ్ఛవాల్లా జీవిస్తున్నాం

భృతికి దారిచూపండి

వృద్ధ దంపతుల వేడుకోలు

ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం: ఎస్‌ఐ

గూడూరు (తిరుపతి జిల్లా): ఎంగిలిపేట్లు కడిగి ఆస్తులు సంపాదించాం. పిల్లలకు ఏ కష్టం తెలియకుండా పెంచి ప్రయోజకుల్ని చేశాం. ఆస్తులన్నీ రాసిచ్చాం. వృద్ధాప్యంలో ఆదుకుంటారనుకుంటే చిత్రహింసలు పెడుతున్నారు. పదమూడేళ్లుగా జీవచ్ఛవాళ్లా జీవిస్తున్నాం. బతకడానికి దారి చూపండయ్యా’ అంటూ వృద్ధ దంపతులు కన్నీటిపర్యంతమవుతున్నారు.
చదవండి: చంద్రుడిని చూశారుగా? ఎంత పెద్దగా కనిపిస్తున్నాడో.. ఎక్కడో తెలుసా!

బాధితుల కథనం మేరకు.. గూడూరు రెండో పట్టణంలోని జానకిరాంపేట ప్రాంతానికి చెందిన కోనేరు సుబ్బయ్య, సుబ్బమ్మ దంపతులకు ముగ్గురు సంతానం. కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. టిఫిన్‌ సెంటర్‌ నడుపుకుంటూ, పిల్లలను ప్రయోజకుల్ని చేశారు. కాయకష్టం చేసి ఆస్తులు కూడబెట్టారు. అందరికీ వివాహాలయ్యాయి. ఉన్న ఆస్తులన్నింటినీ పిల్లల పేర రాసిచ్చేశారు.

ఉన్న నగదుతోపాటు, బంగారం కూడా వారికే ఇచ్చేశారు. ఇంతచేసినా ఇంకా ఇవ్వాలంటూ తరచూ తల్లిదండ్రులను కొట్టడంతోపాటు, హింసించడం మొదలు పెట్టారు. ఈ మేరకు వృద్ధదంపతులు నాలుగేళ్ల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోర్టుకూడా అప్పట్లో తల్లిదండ్రులకే అనుకూలంగా తీర్పునిచ్చింది. కానీ పిల్లల్లో మార్పురాలేదు. ఈ నేపథ్యంలో మానసికంగా కుంగిపోతున్న సుబ్బయ్యకు పక్షవాతం వచ్చింది. ఇంట్లో నుంచి బయటకు వస్తే కొడుకులు కొడుతున్నారని వాపోతున్నారు. తమకు బతకడానికి దారి చూపాలని వేడుకుంటున్నారు. ఈ విషయమై స్థానిక ఎస్‌ఐ తిరుపతయ్యను వివరణ కోరగా దీనిపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని, ఎవరైనా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు.

మరిన్ని వార్తలు