మగదూడ పుడితే రూ.500 వెనక్కి ఇస్తారు!

12 Jul, 2022 14:42 IST|Sakshi

అందుబాటులోకి లింగనిర్ధారణ వీర్యం

ఎద సమయంలో సూది వేయిస్తే చాలు

ఒక డోసు విలువ రూ.700, ప్రభుత్వ సబ్సిడీ రూ.450

మగదూడలు పుడితే చెల్లించిన అమౌంటు వాపసు

ఈ ఏడాది ఐదు వేల పశువులకు కృత్రిమ గర్భధారణ లక్ష్యం

ఆవులు, గేదెల్లో ఏ దూడలు కావాలని కోరుకుంటారు... సహజంగా ఎవరైనా పెయ్య దూడలు (ఆడ) కావాలని ఆకాంక్షిస్తారు. కృత్రిమ గర్భధారణ సూదులు వేస్తున్నా.. పుట్టేది ఆడదూడా.. మగదూడా అనేది తెలియని పరిస్థితి. ఇక నుంచి పాడి అభివృద్ధికి ఆడదూడలే పుట్టించుకునే సదుపాయం అందుబాటులోకి వచ్చింది. లింగ నిర్ధారణ వీర్యం (సార్టెడ్‌ సెక్స్‌ సెమన్‌) ద్వారా 95 శాతం పెయ్య దూడలను అభివృద్ధి చేసుకునే అవకాశం వచ్చింది.

కర్నూలు (అగ్రికల్చర్‌): పెయ్య దూడల జననం ద్వారా పాల దిగుబడిని, రైతు ఆదాయాన్ని పెంపొందించుకోవచ్చు. లింగనిర్ధారణ వీర్యం సాంకేతికతను కృత్రిమ గర్భధారణ ద్వారా రైతులకు అందుబాటులో ఉంచడం, పాడి పరిశ్రమను మరింత అభివృద్ది చేసేందుకు దోహదపడుతోంది. నేడు విద్యావంతులైన నిరుద్యోగులు పాడి పరిశ్రమపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. అటువంటి వారికి ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ ఏడాది జిల్లాలో 5,000 పశువులకు లింగనిర్ధారణ వీర్యంతో కృత్రిమ గర్భధారణ సూది వేసి పెయ్య దూడలు అభివృద్ధి చేయాలని పశుసంవర్ధక శాఖ అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనిని రైతుల్లోకి తీసుకెళ్లి సద్వినియోగం చేసుకునే విధంగా అవగాహన కల్పిస్తున్నారు.

సబ్సిడీపై కృత్రిమ గర్భధారణ వీర్యం 
లింగనిర్ధారణ వీర్యాన్ని పూణే, అహమ్మదాబాద్‌ల్లోని వెటర్నరీ రీసెర్చ్‌ కేంద్రాల్లో అధిక పాలసార ఉన్న ఆంబోతుల నుంచి సేకరించారు. ఆడదూడలే పుట్టే విధంగా లింగనిర్ధారణ వీర్యాన్ని వృద్ధి చేశారు. రెండేళ్ల క్రితం జెర్సీ, హెచ్‌ఎఫ్‌ ఆవుల్లో ఈ ప్రయోగం చేశారు. 200 ఆవులకు ఇటువంటి వీర్యంతో కృత్రిమ గర్భధారణ సూదులు వేయగా 52 దూడలు పుట్టాయి. ఇందులో 47  పెయ్యదూడలు ఉండటం విశేషం. తాజాగా మరింత సాంకేతికతతో అభివృద్ధి చేసిన లింగనిర్ధారణ వీర్యంతో ముర్రా గేదెలతో పాటు జెర్సీ, ఆవు జాతులైన గిర్, సాహివాల్, హెచ్‌ఎఫ్‌ ఆవులకు కృత్రిమ గర్భధారణ సూదులు వేస్తారు. ఒక డోసు పూర్తి ధర రూ.700 ఉండగా... కేంద్రం రూ.450 సబ్సిడీ ఇస్తుంది. రైతు రూ.250 చెల్లించాల్సి ఉంది. ఈ ఏడాది ఉమ్మడి కర్నూలు జిల్లాలో 5,000 పశువులకు సార్టెడ్‌ సెక్స్‌ సెమన్‌ ద్వారా సూదులు వేసే విధంగా లక్ష్యాన్ని నిర్ణయించుకున్నారు.

95 శాతం ఆడదూడలే పుట్టే అవకాశం 
లింగనిర్ధారణ వీర్యం ద్వారా 95 శాతంపైగా పెయ్యదూడలే పుట్టే అవకాశం ఉంది. ఒక ఆవు లేదా గేదెకు మూడు డోసుల వరకు ఇచ్చే అవకాశం ఉంది.  ఆవులు, గేదెలు ఎదకు రావడాన్ని గుర్తించి ఈ వీర్యంతో  కృత్రిమ గర్భధారణ సూదులు వేయించాలి. ఎదకు వచ్చిన 12 గంటల నుంచి 24 గంటలలోపు సూదులు వేయించాల్సి ఉంది. మొదటి డోసు వేసినపుడు చూడికట్టకపోతే రెండవసారి వేయంచవచ్చు. అపుడు కూడా చూడికట్టకపోతే మూడవ డోసు వేయించవచ్చు.

ప్రతి డోసుకు రైతు సబ్సిడీ పోను రూ.250 చెల్లించాల్సి ఉంది. మూడు డోసులు వేసినా చూడికట్టకపోతే రూ.500 రైతుకు వెనక్కి ఇస్తారు. మూడు డోసుల సార్టెడ్‌ సెక్స్‌ సెమన్‌తో కృత్రిమ గర్భధారణ చేసినా మగదూడ పుడితే రూ.500 వెనక్కి ఇస్తారు. ఈ సెమన్‌ ప్రధాన లక్ష్యం పెయ్యదూడల అభివృద్ధి. ఈ కార్యక్రమాన్ని గోపాలమిత్రలు అమలు చేస్తారు. సార్టెడ్‌ సెక్స్‌ సెమన్‌తో సూది వేస్తే రూ.100 ప్రోత్సాహకం ఇస్తారు. మొదటి డోసుతోనే చూడి కడితే రూ.150, రెండవ డోసుతో చూడి కడితే రూ.100 ప్రోత్సాహక బహుమతి ఇస్తారు. 

పెద్ద ఎత్తున అమలు చేస్తున్నాం 
లింగనిర్ధారణ వీర్యంతో ఒంగోలు జాతి మినహా మిగిలిన అన్ని ఆవు, గేదె జాతి పశువులకు కృత్రిమ గర్భధారణ చేయవచ్చు. దీని ద్వారా 90 నుంచి 95 శాతం వరకు ఆడదూడలే పుట్టే అవకాశం ఉంది. పాడి పరిశ్రమను మరింత అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ కార్యక్రమం చేస్తోంది.  
– రాజశేఖర్, కార్యనిర్వహణాధికారి, జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ, కర్నూలు 

మరిన్ని వార్తలు