ఫోర్త్‌ వేవ్‌ వచ్చినా భయం లేదు: సౌమ్య స్వామినాథన్‌

7 Jan, 2023 06:53 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: భారత్‌లో కోవిడ్‌ ఫోర్త్‌ వేవ్‌ వచ్చినా భయం లేదని, అయితే అజాగ్రత్త, నిర్లక్ష్యం పనికి రాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) మాజీ చీఫ్‌ సైంటిస్ట్‌ సౌమ్య స్వామినాథన్‌ చెప్పారు. విశాఖలో ఏఏపీఐ గ్లోబల్‌ హెల్త్‌ సమ్మిట్‌లో పాల్గొనడానికి వచి్చన ఆమె శుక్రవారం మీడియాతో మాట్లాడారు.

ఇండియాలో వ్యాక్సినేషన్‌ సమర్థవంతంగా జరిగిందన్నారు. ప్రజలు మాస్కులు ధరించడం, పరిశుభ్రత పాటించడం తప్పనిసరన్నారు. ఇప్పటిదాకా రెండు డోసుల వ్యాక్సిన్‌ తీసుకోని వారు, 60 ఏళ్లు పైబడిన వారు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారు బూస్టర్‌ డోసు వేయించుకోవాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వైద్య ఆరోగ్య రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తుండటం అభినందించదగ్గ విషయమని చెప్పారు. భారత్‌లో మధుమేహం, రక్తపోటు, కిడ్నీ, హృద్రోగ సమస్యలు వంటి నాన్‌ కమ్యూనికేబుల్‌ డిసీజెస్‌ వల్ల 70 ఏళ్ల కంటే ముందుగానే చనిపోతున్నారని తెలిపారు. 

ఇందుకు జన్యు పరమైన కారణాలతో పాటు పర్యావరణ కాలుష్యం, వ్యక్తిగత నడవడిక, తీపి పదార్థాలు ఎక్కువగా తినడం కారణాలని చెప్పారు. ఇలాంటి వ్యాధులపై జనంలో అవగాహన పెంచడం ద్వారా ముందుగానే వీటి బారి నుంచి తప్పించుకోవచ్చన్నారు. దేశంలో కోవిడ్‌ సహా వివిధ వ్యాధుల నిర్ధారణకు మరిన్ని లేబరేటరీలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.   

మరిన్ని వార్తలు