మహిళల భద్రతకు పెద్దపీట 

31 May, 2022 05:32 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

వాసిరెడ్డి పద్మను కలిసిన దక్షిణ మధ్య రైల్వే డీఐజీ 

సాక్షి, అమరావతి: రైల్వేస్టేషన్లు, వాటి పరిసర ప్రాంతాల్లో మహిళలు, బాలికల భద్రతకు పటిష్ట చర్యలు చేపట్టినట్లు ఏపీ మహిళా కమిషన్‌కు దక్షిణ మధ్య రైల్వే పోలీసు శాఖ నివేదించింది. మంగళగిరిలోని ఏపీ మహిళా కమిషన్‌ రాష్ట్ర  కార్యాలయంలో చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మను దక్షిణ మధ్య రైల్వే డీఐజీ రమేష్‌ చంద్ర, గుంటూరు రైల్వే డివిజన్‌ ఏడీఆర్‌ఎం ఆర్‌.శ్రీనివాసులు, డివిజనల్‌ సెక్యూరిటీ కమిషనర్‌ కె.హరప్రసాద్‌ సోమవారం కలిశారు.

ఇటీవల పల్నాడు, బాపట్ల జిల్లాల్లో  గురజాల, రేపల్లె రైల్వేస్టేషన్లలో చోటుచేసుకున్న అత్యాచార ఘటనలపై ఏపీ మహిళా కమిషన్‌ తీవ్రంగా స్పందించిన సంగతి తెల్సిందే. రైల్వే స్టేషన్లలో మహిళా భద్రతపై ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో స్వయంగా వచ్చి నివేదించాలంటూ రైల్వే పోలీసులకు ఏపీ మహిళా కమిషన్‌ ఇటీవల నోటీసులు పంపింది. ఈ నేపథ్యంలోనే కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మకు రైల్వే పోలీసు ఉన్నతాధికారులు నివేదిక అందజేశారు.

గురజాల రైల్వే హాల్టు, రేపల్లె ఘటనలపై వారు వివరణ ఇచ్చారు. లోకల్‌ పోలీసు, జీఆర్‌పీ, రైల్వే పోలీసులు సమన్వయం చేసుకుంటూ రాత్రి, పగలు గస్తీ మరింత పటిష్టంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని పద్మ వారికి సూచించారు.  నేరాలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. ప్రయాణికుల రద్దీని బట్టి ఆయా రైల్వేస్టేషన్లలో  అవసరమైన సిబ్బందిని కేటాయించాలని సూచించారు. పాత నేరస్తులపై ప్రత్యేక నిఘా పెట్టి నేరాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు.  

మరిన్ని వార్తలు