కృష్ణపట్నం పోర్టు నుంచి సరుకు రవాణాకు సహకరిస్తాం 

22 May, 2022 05:48 IST|Sakshi
ఒంగోలు రైల్వేస్టేషన్‌లో ఆటోమేటిక్‌ టికెట్‌ వెండింగ్‌ పరికరాన్ని పరిశీలిస్తున్న జీఎం అరుణ్‌కుమార్‌ జైన్‌

దక్షిణ మధ్య రైల్వే జీఎం వెల్లడి 

పోర్టు అధికారులతో చర్చలు 

సాక్షి, అమరావతి/ఒంగోలు సబర్బన్‌: కృష్ణపట్నం పోర్టు నుంచి సరుకు లోడింగ్, ప్రధానమైన సరుకులను నిరాటంకంగా రవాణా చేయడానికి రైల్వే శాఖ సహాయ సహకారాలు అందిస్తుందని దక్షిణ మధ్య రైల్వే ఇన్‌చార్జి జనరల్‌ మేనేజర్‌ (జీఎం) అరుణ్‌కుమార్‌ జైన్‌ వెల్లడించారు. మెస్సర్స్‌ అదానీ కృష్ణపట్నం పోర్టు యాజమాన్య నిర్వాహకులతో సరుకు లోడింగ్‌ అభివృద్ధి అవకాశాలపై రైల్వే జీఎం శనివారం చర్చించారు. పోర్టు కార్యకలాపాలు, భవిష్యత్తు ప్రణాళికలు తదితర ముఖ్యాంశాలను రైల్వే జీఎంకు పోర్టు అధికారులు వివరించారు.

పోర్టు వద్ద కోస్టల్‌ ఇన్‌స్టాలేషన్‌ ప్రాజెక్టును సందర్శించిన సందర్భంగా రైల్వే జీఎం అక్కడ మొక్కలను నాటారు. అనంతరం కృష్ణపట్నం స్టేషన్‌ – విజయవాడ సెక్షన్‌ మధ్య ప్రత్యేక రైలులో ప్రయాణించి పలు రైల్వే స్టేషన్లను తనిఖీ చేశారు. గూడూరు–విజయవాడ సెక్షన్‌ మధ్య నిర్మాణంలో ఉన్న 3వ రైల్వే లైను పనుల పురోగతిని పరిశీలించారు. 

టెక్నాలజీని సద్వినియోగం చేసుకోవటం లేదు 
రైల్వే అధికారులు టెక్నాలజీని సక్రమంగా సద్వినియోగం చేసుకోవటం లేదని, దానికితోడు క్రమశిక్షణతో కూడిన విధులు లేవని దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్‌ జైన్‌ అసహనం వ్యక్తం చేశారు. జీఎం తన పర్యటనలో భాగంగా ఒంగోలు రైల్వేస్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్లాట్‌ఫారంపై ఉన్న ఆహారం, పండ్ల రసం స్టాల్స్‌ను తనిఖీ చేసి అక్కడి విక్రయదారులతో మాట్లాడారు.

విక్రయించిన వస్తువులకు బిల్లులు ఇస్తున్నారా లేదా అని జీఎం అడిగిన ప్రశ్నకు ఓ కూల్‌డ్రింక్‌ షాపు యజమాని సమాధానం చెప్పలేక నోరెళ్లబెట్టడంతో.. బిల్లులు ఇవ్వకుండా విక్రయాలు చేయిస్తుంటే ఏమి చేస్తున్నారని కమర్షియల్‌ రైల్వే విభాగం అధికారులను జీఎం నిలదీశారు.

రైల్వే ఆస్పత్రిలో ఇంటర్నెట్‌ సరిగా పనిచేయకపోవడం, రైల్వేస్టేషన్‌లోని ఆటోమేటిక్‌ టికెట్‌ వెండింగ్‌ మెషిన్‌లోనూ సాంకేతిక సమస్యలు ఉండటం గుర్తించిన జీఎం.. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉన్నప్పటికీ సక్రమంగా సద్వినియోగం చేసుకోవటంలో విఫలం అవుతున్నారని, వెంటనే లోపాలను సరిచేసుకోవాలని అధికారులకు సూచించారు. రైల్వే జీఎం పర్యటనలో విజయవాడ డివిజినల్‌ రైల్వే మేనేజర్‌ శివేంద్రమోహన్, ఇతర సీనియర్‌ అధికారులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు