ఈ–టెండర్‌ స్థానంలో ఈ–ఆక్షన్‌ 

8 Aug, 2022 03:20 IST|Sakshi

దక్షిణ మధ్య రైల్వేలో అమలుకు శ్రీకారం.. రాబడి కాంట్రాక్టులు అన్నింటికీ ఇక ఇదే విధానం 

ఇదే తరహాలో రాష్ట్రంలో ఇప్పటికే ‘రివర్స్‌ టెండరింగ్‌’   

రూ.వందల కోట్ల ప్రజాధనం ఆదా 

సాక్షి, అమరావతి: రాబడికి సంబంధించిన కాంట్రాక్టుల కేటాయింపుల కోసం దక్షిణ మధ్య రైల్వే కొత్తగా ఈ–ఆక్షన్‌ విధానాన్ని ప్రవేశ పెట్టింది. ఎన్నో ఏళ్లుగా అనుసరిస్తున్న ఈ–టెండర్ల విధానం స్థానంలో ప్రవేశపెట్టిన ఈ–ఆక్షన్‌ విధానానికి నెల రోజుల్లోనే సానుకూల స్పందన లభిస్తోంది. పూర్తి పారదర్శకతతో సత్వరం కాంట్రాక్టులు కేటాయించేందుకు వీలుగా ఈ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ–టెండర్ల విధానంలో ఎవరు ఎంతకు బిడ్‌ చేస్తున్నారనే విషయం అందరికీ తెలిసే అవకాశం లేదు.

దాంతో కొన్ని అవకతవకలకు ఆస్కారం ఉండేది. ఇక బిడ్లు తెరవడం, ఖరారు మొదలైన వాటికి ఎక్కువ సమయం పట్టేది. దీనికి పరిష్కారంగా ఈ–టెండర్ల స్థానంలో ఈ–ఆక్షన్‌ విధానానికి రైల్వే బోర్డు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వేలో తొలుత సికింద్రాబాద్‌ డివిజన్‌ ఈ–ఆక్షన్‌ విధానాన్ని ప్రవేశ పెట్టింది. ఇటీవల విజయవాడ డివిజన్‌లోనూ ఈ విధానాన్ని అమలులోకి తెచ్చింది. ఇందుకోసం ప్రత్యేక పోర్టల్‌ను అందుబాటులో ఉంచింది.  
 
ఎవరైనా పాల్గొనవచ్చు.. 
అన్ని రకాల రాబడికి సంబంధించిన కాంట్రాక్టులన్నీ ఈ–ఆక్షన్‌ ద్వారానే కేటాయిస్తారు. వాహనాల పార్కింగ్, పార్సిల్‌ సర్వీసులు, ఏటీఎంలు, ఏసీ వెయిటింగ్‌ రూమ్‌ సర్వీసు, క్లాక్‌ రూమ్‌ సర్వీసులు, రుసుము చెల్లింపు విధానంలో టాయిలెట్ల నిర్వహణ మొదలైన కాంట్రాక్టుల కేటాయింపునకు ఈ–ఆక్షన్‌ నిర్వహిస్తారు. దేశంలో ఏ ప్రాంతంలో ఉన్న వారైనా ఈ–ఆక్షన్‌లో పాల్గొనవచ్చు. అన్ని రకాల చెల్లింపులు ఆన్‌లైన్‌ విధానంలోనే నిర్వహిస్తారు. ఈ–ఆక్షన్‌ ప్రక్రియను గరిష్టంగా 72 గంటల్లోగా పూర్తి చేస్తారు.

ఈ–ఆక్షన్‌ ప్రక్రియకు బిడ్డర్ల నుంచి సానుకూల స్పందన వస్తోంది. నెల రోజుల్లోనే 220 మంది కాంట్రాక్టర్లు ఈ–ఆక్షన్‌ పోర్టల్‌లో నమోదు చేసుకున్నారు. దక్షిణ మధ్య రైల్వే ఇప్పటి వరకు రూ.77.51 కోట్ల విలువైన 54 కాంట్రాక్టులను ఈ–ఆక్షన్‌ ద్వారా కేటాయించింది.

ఇదిలా ఉండగా రాష్ట్రంలో కాంట్రాక్టుల కేటాయింపులో పారదర్శకత, ప్రజా ధనాన్ని పొదుపు చేయడంలో భాగంగా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఇదే తరహాలో ఇప్పటికే రివర్స్‌ టెండరింగ్‌ విధానాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. తద్వారా ఇప్పటికే వందల కోట్ల రూపాయల మేర ప్రజా ధనం ఆదా అయిన విషయమూ విదితమే. ఒక పనికి సంబంధించి జ్యుడీషియల్‌ ప్రివ్యూ అనంతరం.. కాంట్రాక్టర్ల మధ్య పోటీ పెంచి, తక్కువ ధరకే నాణ్యతతో పనులు అప్పగిస్తోంది.    

మరిన్ని వార్తలు