రుతుపవనాల మందగమనం

8 Jun, 2022 04:18 IST|Sakshi

4 రోజులు ముందుగానే కేరళకు

4, 5 రోజుల్లో ఏపీని తాకాల్సి ఉన్నా ఆలస్యం

ఉపరితల ఆవర్తనం, పశ్చిమ గాలుల ప్రభావంతో కదలికలకు అవరోధం

కర్ణాటకలోనే 4 రోజులుగా స్థిరంగా ఉన్న వైనం

ఒకట్రెండు రోజుల్లో అనుకూల పరిస్థితి

అప్పటి వరకు కొనసాగనున్న ఎండల తీవ్రత

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజలంతా ఎదురు చూస్తున్న నైరుతి రుతుపవనాలు ముందుకు కదలడంలేదు. ఈ నెల 4వ తేదీనే రాయలసీమను తాకాల్సి ఉన్నా కర్ణాటకలోనే కదలకుండా స్థిరంగా ఉండిపోయాయి. సాధారణంగా నైరుతి రుతుపవనాలు ప్రతి సంవత్సరం జూన్‌ ఒకటో తేదీన కేరళను తాకి 5వ తేదీకల్లా ఏపీకి విస్తరిస్తాయి. అంటే కేరళను తాకిన నాలుగైదు రోజుల్లో ఏపీలోకి ప్రవేశిస్తాయి.

ఈ సంవత్సరం నాలుగు రోజుల ముందుగానే మే 28వ తేదీన రుతుపవనాలు కేరళను తాకాయి. అక్కడి నుంచి వేగంగా కదిలి 31వ తేదీకి కర్ణాటక, ఏపీ సరిహద్దు వరకు వచ్చాయి. అప్పటి నుంచి బెంగళూరు, ధర్మపురి ప్రాంతంలోనే కదలకుండా ఉండిపోయాయి. మధ్యప్రదేశ్, విదర్భ, తెలంగాణ మీదుగా రాయలసీమ వరకు విస్తరించి ఉన్న ఉపరితల ఆవర్తనం, పశ్చిమ గాలుల ప్రభావంతో రుతుపవనాలు మన రాష్ట్రం వైపు కదలడంలేదని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితులను బట్టి ఒకటి, రెండు రోజుల్లో రుతుపవనాలు రాయలసీమను తాకే అవకాశం ఉందని భావిస్తున్నారు. అవి ఒకసారి కదిలితే వేగంగా విస్తరిస్తాయని చెబుతున్నారు. అప్పటివరకు కోస్తా ప్రాంతంలో ఉష్ణోగ్రతలు కొనసాగవచ్చని తెలిపారు. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో పలుచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. 

మరిన్ని వార్తలు