దేశంలో నైరుతి నిష్క్రమణ మొదలు

29 Sep, 2020 05:53 IST|Sakshi

ఇప్పటికే పశ్చిమ రాజస్థాన్, పంజాబ్‌ పరిసర ప్రాంతాల నుంచి నిష్క్రమణ

అక్టోబర్‌ మొదటి వారంలో తెలుగు రాష్ట్రాల నుంచి..

రెండో వారంలో ఈశాన్య రుతుపవనాల రాక

సాక్షి, విశాఖపట్నం: వాయవ్య భారతం (పశ్చిమ రాజస్థాన్, పంజాబ్‌ పరిసర ప్రాంతాల నుంచి) నైరుతి రుతుపవనాలు నిష్క్రమిస్తున్నాయని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. సాధారణంగా ఈ నెల 20 నాటికి రాష్ట్రం నుంచి నైరుతి రుతుపవనాలు నిష్క్రమించేవి. కానీ.. ఈ ఏడాది రుతుపవనాల రాక కాస్త ఆలస్యం కావడంతో తెలుగు రాష్ట్రాల నుంచి అక్టోబర్‌ మొదటి వారం నుంచి వీటి నిష్క్రమణ ఉంటుందని అధికారులు తెలిపారు. నైరుతి నిష్క్రమణం ప్రారంభం కావడంతో.. ఈశాన్య రుతుపవనాల కాలం మొదలైందని చెప్పారు. అక్టోబర్‌ రెండో వారంలో ఇవి రాష్ట్రంలోకి ప్రవేశించే సూచనలు కనిపిస్తున్నాయన్నారు. 

ఈశాన్య రుతుపవనాలతో సీమ, దక్షిణ కోస్తాలో విస్తారంగా వర్షాలు
► ఈశాన్య రుతుపవనాల కారణంగా రాయలసీమ, దక్షిణ కోస్తాలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ అధికారులు చెబుతున్నారు. 
► రానున్నది తుపాన్ల కాలమనీ.. నవంబర్, డిసెంబర్, జనవరి నెలల్లో తుపానులు ఏర్పడే సూచనలున్నాయని అంటున్నారు. 
► రాష్ట్రంలో ఈ నైరుతి కాలంలో ఇప్పటివరకు సాధారణం కంటే 43 శాతం అధిక వర్షపాతం నమోదైందని తెలిపారు.

నేడు రాయలసీమకు భారీ వర్ష సూచన
► ఏపీ తీరానికి దగ్గరలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఒడిశా మీదుగా ఉపరితల ద్రోణి 3.1 కిమీ ఎత్తు వరకూ కొనసాగుతోంది. 
► అదేవిధంగా దక్షిణ ఆంధ్రప్రదేశ్, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం 4.5 నుంచి 5.8 కి.మీ ఎత్తులో ఉంది. 
► దీని ప్రభావంతో వచ్చే మూడు రోజులు కోస్తా, రాయలసీమల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. మంగళవారం సీమలో అక్కడక్కడా భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని పేర్కొంది.  

మరిన్ని వార్తలు