Southwest Monsoon: 'నైరుతి' పలకరింపు

5 Jun, 2021 03:21 IST|Sakshi
అనంతపురం జిల్లా కంబదూరు సమీపంలో పొంగిపొర్లుతున్న చెక్‌డ్యాం

ఏపీలో ప్రవేశించిన రుతుపవనాలు.. విస్తృతంగా వర్షాలు

అనంతపురంలో 12 సెంటీమీటర్ల వర్షపాతం

చిత్తూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో నేడు భారీవర్షాలు

సాక్షి, అమరావతి/విశాఖపట్నం: నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ప్రవేశించాయి. రాయలసీమలోని పలు ప్రాంతాలను రుతుపవనాలు శుక్రవారం తాకాయి. గురువారం కేరళలో ప్రవేశించిన రుతుపవనాలు శుక్రవారం దక్షిణ అరేబియా సముద్రం, నైరుతి బంగాళాఖాతం, లక్షద్వీప్, కేరళ మొత్తం వ్యాపించాయి. ఏపీతో పాటు, కర్ణాటక, తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లోను ఇవి వ్యాపించినట్లు అమరావతి, విశాఖ వాతావరణ కేంద్రాలు తెలిపాయి. ఈ నెల 7, 8 తేదీల్లో కోస్తాలోని కృష్ణాజిల్లా వరకు, అనంతరం నెమ్మదిగా పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలకు, 11వ తేదీన ఉత్తరాంధ్ర అంతటా రుతుపవనాలు ప్రవేశించనున్నాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. రుతుపవనాల ప్రభావం, వాతావరణ మార్పుల నేపథ్యంలో మూడురోజులు రాష్ట్ర వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు.

కర్ణాటక నుంచి భారీ మేఘాలు రాయలసీమ వైపుగా విస్తరిస్తుండటంతో శనివారం అనంతపురం, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో భారీవర్షాలు పడే అవకాశాలున్నాయని తెలిపారు. మరోవైపు శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం చల్లబడి అనేకచోట్ల వర్షాలు పడ్డాయి. రుతుపవనాల ప్రభావంతో రాయలసీమలోని ఎక్కువచోట్ల భారీ వర్షాలు కురిశాయి. అనంతపురం జిల్లాలో 55 మండలాలకుగాను 47 మండలాల్లో గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు వర్షం కురిసింది.

అనంతపురంలో 12 సెంటీమీటర్లు, నంబులిపులికుంటలో 10, రాప్తాడులో 9, రాయచోటి, సింగనమలల్లో 8, లక్కిరెడ్డిపల్లె, సెత్తూరు, అమరపురాల్లో 7, ధర్మవరంలో 6, కంబదూరు, మదనపల్లె, ఓక్‌లలో 5, నెల్లిమర్ల, అరకు, కైకలూరు, బ్రహ్మసముద్రం, ఊటుకూరు, గుర్రంకొండ, కూనుర్పి, తాడిమర్రి, కనెకల్లు, తాడిపత్రి, సంబపల్లె, కల్యాణదుర్గంలలో 4 సెంటీమీటర్ల మేర వర్షాలు కురిశాయి.
.
పిడుగులుపడి ఇద్దరి మృతి
గుడుపల్లె/మదనపల్లె టౌన్‌: చిత్తూరు జిల్లాలోని గుడుపల్లె, మదనపల్లె మండలాల్లో శుక్రవారం పిడుగులు పడి ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. గుడుపల్లె మండలం తిమ్మనాయనపల్లెలో పిడుగుపాటుకు మునెప్ప (50) ప్రాణాలు కోల్పోయాడు. మదనపల్లె మండలం ఈశ్వరమ్మకాలనీకి చెందిన వారు మైదానంలో క్రికెట్‌ ఆడుకుంటుండగా పిడుగుపడింది. ఆడుకుంటున్న 8 మంది గాయపడ్డారు. వీరిలో ఆటోనడుపుకొంటూ జీవనం సాగించే ఎస్‌.రోషన్‌ (25) అక్కడికక్కడే మృతిచెందాడు. తీవ్రంగా గాయపడి స్పృహ కోల్పోయిన ఆరీఫ్‌ (25)ను తిరుపతి ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది.

మరిన్ని వార్తలు