విశాఖతో విడదీయలేని అనుబంధం

26 Sep, 2020 04:31 IST|Sakshi
ఏయూలో 2009లో అప్పటి గవర్నర్‌ తివారీ చేతుల మీదుగా గౌరవ డాక్టరేట్‌ అందుకుంటున్న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం

సింహాచలంలో ప్రేమ వివాహం

ఏయూ నుంచి గౌరవ డాక్టరేట్‌.. 

విశాఖ ఉత్సవ్‌లో స్వరకళా సామ్రాట్‌ బిరుదు 

సాక్షి, ప్రతినిధి, విశాఖపట్నం:  సింహాచలం శ్రీ వరాహ నరసింహస్వామి సన్నిధిలో ప్రేమ వివాహం చేసుకున్న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి, అప్పటినుండి విశాఖతో ఎనలేని అనుబంధం ఏర్పడింది.

► వివిధ సాంస్కృతిక కార్యక్రమాలకు బాలు హాజరై.. తన గళంతో విశాఖ ప్రజల హృదయాల్ని గెలుచుకున్నారు. 
► స్టీల్‌ప్లాంట్‌లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరైన బాలు.. ‘‘విశాఖ నగరమున వెలసిన ఉక్కు కర్మాగారం, ప్రపంచ పటమున మెరిసిన దేవాలయ శిఖరం’’ అనే పాటని ఆలపించారు.  
► 2016 జనవరి 2వ తేదీన సాగరతీరంలో నిర్వహించిన విశాఖ ఉత్సవ్‌ ముగింపు కార్యక్రమానికి బాలు హాజరై తన గానామృతంలో ప్రజల్ని ఓలలాడించారు. బాలు పాటకు 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆయనకు స్వరకళా సామ్రాట్‌ బిరుదుని ప్రదానం చేశారు.  
► చివరిసారిగా 2019లో ఏయూ కాన్వొకేషన్‌ హాల్‌లో నిర్వహించిన ‘సామవేదం పదార్చన–ఎస్పీ బాలు స్వరార్చన’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆనంద కైలాసం ఆడియో సీడీని ఆవిష్కరించి.. భక్తి పాటలు ఆలపించారు. 
► 2009 డిసెంబర్‌ 5న బాల సుబ్రహ్మణ్యానికి ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌ని ప్రదానం చేసింది.  
► వీలుదొరికినప్పుడల్లా బాలు భీమిలిలోని  ఆనందవనానికి వచ్చి.. సద్గురు కందుకూరి శివానందమూర్తి సన్నిధిలో గడిపేవారు.  
► 2009, 2010, 2014లో కొప్పరపు కవుల కళాపీఠం వార్షికోత్సవంలో పాల్గొన్నారు. 2009లో ప్రతిష్టాత్మక కొప్పరపు కవుల జాతీయ ప్రతిభా పురస్కారాన్ని బాలు అందుకున్నారు. 
► పాటకు ప్రాణం పోసిన ఎస్పీబీ మరణం.. సంగీతానికి తీరని లోటని పలువురు విశాఖ ప్రముఖులు, కళాకారులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 

మరిన్ని వార్తలు