నాద నిలయంలో వేదం పలకాలని..

26 Sep, 2020 04:03 IST|Sakshi

నెల్లూరులో ఇల్లు కంచికామకోటి పీఠానికి

సాక్షి ప్రతినిధి, నెల్లూరు/నెల్లూరు(బృందావనం): నెల్లూరు నగరంలోని తిప్పరాజు వారి వీధిలో ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం తల్లిదండ్రుల స్వార్జితంతో నిర్మించుకుని నివసించిన ఇంటిని ఈ ఏడాది ఫిబ్రవరిలో కంచి కామకోటి పీఠాధిపతి శ్రీవిజయేంద్రసరస్వతి స్వామికి అప్పగించారు. ఆ ఇంట్లో వేదం పలకాలన్న ఆకాంక్షతో రూ. కోట్లు విలువైన తన తల్లిదండ్రుల జ్ఞాపికను ఆ పీఠానికి అప్పగిస్తున్నట్లుగా అప్పట్లో బాలు వివరించారు. తాను తరచూ నెల్లూరుకు వచ్చి వేదనిలయం అభివృద్ధికి సహకారాన్ని అందిస్తానని కూడా చెప్పారు. ఈ ఇల్లు అంటే బాలు తల్లి శకుంతలమ్మకు మమకారం. తాను చనిపోయేంత వరకు ఇక్కడే ఉన్నారు. బాలు ప్రతి నెలా వచ్చి తల్లితో గడిపి వెళ్తుండేవాడు. నాద నిలయంగా ఉన్న ఇల్లు వేద నిలయంగా కూడా మారాలనే తల్లి కోరికతో ఆ ఇంటిని కంచి పీఠానికి అప్పగించారు. 

తండ్రి తొలిగురువు..
2015 అక్టోబర్‌ 3న సాంబమూర్తి విగ్రహావిష్కరణ నెల్లూరులోని శ్రీకస్తూర్బా కళాక్షేత్రంలో  ఘనంగా జరిగింది. ఈ సందర్భంలో బాలు తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. తండ్రి తన తొలిగురువని, ఆయన తనను నాటక రంగానికి పరిచయం చేయడంతో పాటు నేపథ్య గాయకుడిగా మారడానికి ప్రోత్సాహించారని చెప్పారు. జీవితంలో సర్వస్వం అయిన నాన్నకు విగ్రహం పెట్టి జన్మ ధన్యం చేసుకున్నానని తెలిపారు. 

తొలిమెట్టు గూడూరులో..
గూడూరు: ఎస్పీ బాలు గాన ప్రస్థానానికి తొలిమెట్టు శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరులోని శ్రీకాళిదాస కళానికేతన్‌. సంగీత పోటీలు నిర్వహించడానికి షేక్‌ గౌస్‌బాషా, ప్రభాకర్‌రావు తమ మిత్ర బృందంతో కలిసి ఈ సంస్థను స్థాపించారు. 1962లో శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో నిర్వహించిన పోటీల్లో పాల్గొన్న బాలుకు మొదటి బహుమతి లభించింది. 1963లో జరిగిన పోటీలకు న్యాయనిర్ణేతగా గానకోకిల జానకి వచ్చారు. ఈ పోటీల్లో బాలుకు 2వ బహుమతి వచ్చింది. సంస్థ ఆనవాయితీ ప్రకారం ప్రథమ, ద్వితీయ బహుమతులు పొందినవారితో పాటలు పాడించేవారు.

ఈ క్రమంలో బాలు పాడిన పాట ఆహూతులను మంత్రముగ్దుల్ని చేసింది. ‘‘నీలాంటి వారు సినిమాల్లో పాడాలి’’ అంటూ జానకి బాలును ప్రోత్సహించారు. 1964లో భానుమతిని కలసిన సందర్భంలో బాలు పాడిన పాట ఆమెను ఎంతగానో ఆకట్టుకుంది. దేశం గర్వించదగ్గ గాయకుడిగా ఎదుగుతావంటూ ఆమె బాలును దీవించారు. నిగర్వి అయిన బాలు వంటి మహానుభావుని పోగొట్టుకోవడం ఎంతో బాధాకరమని శ్రీకాళిదాస కళానికేతన్‌ వ్యవస్థాపకులు, సీనియర్‌ జర్నలిస్ట్‌ షేక్‌ గౌస్‌బాషా కన్నీటి పర్యంతమయ్యారు.  

మరిన్ని వార్తలు