వ్యవసాయ క్షేత్రంలో బాలు స్మారక మందిరం

28 Sep, 2020 03:50 IST|Sakshi
బాలు సమాధి

వారం రోజుల్లో వివరాలు తెలుపుతాం

బాలు కుమారుడు చరణ్‌ వెల్లడి

సాక్షి, చెన్నై/కొత్తపేట: తన తండ్రి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పార్థివదేహానికి అంత్యక్రియలు నిర్వహించిన వ్యవసాయక్షేత్రంలో స్మారక మందిరం నిర్మిస్తామని ఎస్పీ చరణ్‌ వెల్లడించారు. గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పార్థివదేహాన్ని చెన్నై సమీపంలోని తామరైపాక్కంలో ఉన్న ఆయన సొంత వ్యవసాయ క్షేత్రంలో శనివారం ఖననం చేసిన విషయం తెలిసిందే. సమాధి వద్ద ఆదివారం సంప్రదాయ కార్యక్రమం ముగిసిన తర్వాత చరణ్‌ మీడియాతో మాట్లాడారు. గూగుల్‌లో సెర్చ్‌ చేసినా స్పష్టంగా కనబడే రీతిలో స్మారక మందిరం నిర్మిస్తామని, ఇందుకు సంబంధించిన వివరాలు వారం రోజుల్లో విడుదల చేస్తామని తెలిపారు. దేశ వ్యాప్తంగా తన తండ్రిపై ప్రజానీకం చూపిన అభిమానం మరువలేనిదన్నారు. ఎస్పీబీ ప్రజలందరి ఆస్తి అని వ్యాఖ్యానించారు. ప్రజలు వారి కుటుంబంలో ఒకరిని కోల్పోయినంతగా ఉద్వేగానికి లోనయ్యారన్నారని చెప్పారు. కాగా, బాలుకు నివాళులర్పించేందుకు అభిమానులు ఆదివారం వ్యవసాయక్షేత్రానికి తరలి వచ్చారు.   

‘భారతరత్న’కు ప్రయత్నిస్తాం
బాలుకు భారతరత్న తప్పనిసరిగా వస్తుందని ఆ అవార్డు ఎంపిక కమిటీలో సభ్యుడిగా ఉన్న, ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజా సోదరుడు గంగై అమరన్‌ తంజావూరులో మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. భారతరత్నకు ఎస్పీబీ అర్హుడు అని, అవార్డు ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తానని తెలిపారు. కాగా, ఎస్పీబీ ముందుగానే తన విగ్రహం రూపకల్పనకు శిల్పి రాజ్‌కుమార్‌ను సంప్రదించడం, ఆయన రూపొందించిన విగ్రహం ఫొటో విస్తృతంగా ప్రచారం అవుతోంది.

బాలు కోరికపైనే విగ్రహం
బాలు విగ్రహానికి మెరుగులు దిద్దుతున్న రాజ్‌కుమార్‌ 

జీవించి ఉండగానే తనను విగ్రహంలో చూసుకోవాలని బాలు అనుకున్నారని తూర్పు గోదావరి జిల్లా కొత్తపేటకు చెందిన ప్రముఖ శిల్పి డి.రాజ్‌కుమార్‌ వుడయార్‌ తెలిపారు. ఆ వివరాలు ఆయన ‘సాక్షి’కి వెల్లడించారు. ‘నెల్లూరులోని తన తండ్రి పాత విగ్రహం స్థానంలో నేను తయారు చేసిన విగ్రహాన్ని బాలు నెలకొల్పారు. ఆ విగ్రహం నమూనా పరిశీలన కోసం 2018 నవంబర్‌ 19న నా శిల్పశాలకు వచ్చారు. ఆ సందర్భంలో బాలుతో వచ్చిన వారు విగ్రహం చేయించుకోమని ఆయన్ని పట్టుబట్టారు. దీనికి ఆయన అంగీకరించి ఫొటోలు ఇచ్చారు. వాటి ఆధారంగా నమూనా విగ్రహం తయారు చేశాను. తదనంతరం ఆయన తల్లి విగ్రహం కూడా తయారు చేయమని నాకు చెప్పారు. ఆ విగ్రహం తయారీపై గతేడాది ఆగస్టులో ఫోన్‌లో వాకబు చేశారు’ అని రాజ్‌కుమార్‌ తెలిపారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు