‘అది అదృష్టంగా భావిస్తున్నా’

25 Sep, 2020 14:02 IST|Sakshi

బాలు మరణంపై మంత్రి మేకపాటి భావోద్వేగం

సాక్షి, అమరావతి: గానగంధర్వులు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రమణ్యం (ఎస్పీ బాలు) అకాల మరణంపై పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి స్పందించారు. ప్రపంచం గర్వించే అరుదైన గాయకులు ఇలా దూరమవడం తనను తీవ్రంగా కలచివేసిందని భావోద్వేగానికి గురయ్యారు. ‘పాటే తపమని..పాటే జపమని.. పాటే వరమని.. పాటకోసమే పుట్టిన మహానుభావులు ఎస్పీ బాలుగారి లోటు మరే గాయకులు పూడ్చలేనిది’ అని మంత్రి గద్గద స్వరంతో పేర్కొన్నారు.

ఈ సందర్భంగా బాలచందర్ గారి దర్శకత్వంలో కోకిలమ్మ చిత్రంలోని బాలు పాడిన ‘నేనున్నది మీలోనే.. ఆ నేను మీరేలే.. నాదన్నది ఏమున్నది నాలో’ పాటను మంత్రి గుర్తు చేసుకున్నారు. ‘ఊహ తెలిసినప్పుడు.. ఊహల్లో తేలినపుడు.. ఊయలూగినపుడు.. ఊగిసలాడినపుడు బాలుగారి పాటలే వినిపించేంతటి అమరగాయకులు శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో పుట్టడం ఆ జిల్లాకు చెందినవాడిగా అదృష్టంగా భావిస్తున్నట్టు మంత్రి గౌతమ్‌ రెడ్డి పేర్కొన్నారు. 'సింహపురి'లో జన్మించిన గాయకులు..ప్రపంచం గర్వించదగ్గ గాన గంధర్వులు’ అని మంత్రి వ్యాఖ్యానించారు. 
(చదవండి: ఎస్పీ బాలు కన్నుమూత)

చివరి శ్వాస వరకూ తను పాటిన ప్రతిపాటకు ప్రాణం పోశారని మంత్రి పేర్కొన్నారు. ఏడ్చినా..నవ్వినా..నీరసపడినా..ఉత్సాహం నిండినా..స్ఫూర్తి పొందినా..ప్రశ్నించినా ప్రతి ఒక్క సందర్భానికీ ఆయన పాట ఒకటుంటుందన్నారు. ప్రతీ నాయకుడికి, ప్రతినాయకుడికి, కథానాయకుడికి ఆయన వినూత్నరీతిలో..సరికొత్త ప్రయోగాలతో స్వరాన్ని అందించడం..నటించినవారే పాడినట్లుగా పాడడం మరెవరికీ సాధ్యం కాదని మంత్రి గౌతమ్ రెడ్డి అభిప్రాయపడ్డారు. మాటాడినా.. పాటాడినా తెలుగు భాషే సంతోషపడేలా తెలుగుజాతి సగర్వంగా చెప్పుకునేలా చేసిన, 16 భాషల్లో 40వేలకు పైగా పాటలు పాడిన బాలసుబ్రమణ్యంగారు భౌతికంగా దూరమైనా 'పాట'లో మనతో మనలోనే శాశ్వతంగా ఉంటారని మంత్రి మేకపాటి తెలిపారు.
 

మరిన్ని వార్తలు