కృష్ణా జిల్లా ఎస్పీకి జాతీయ స్థాయి అవార్డు 

7 Jan, 2022 10:54 IST|Sakshi
ఎస్పీ సిద్ధార్థ్‌ కౌశల్‌

సాక్షి, కోనేరు(విజయవాడ): కృష్ణా జిల్లా ఎస్పీ సిద్ధార్థ్‌ కౌశల్‌కు డీజీ.బీపీఆర్‌–డీ (డైరెక్టర్‌ జనరల్‌ బ్యూరో ఆఫ్‌ పోలీస్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌) డిస్క్‌ అవార్డు లభించింది. కోవిడ్‌ కంటే ముందే వీడియో కాన్ఫరెన్స్‌ విధానాన్ని అందరికీ పరిచయం చేసి, స్పందన కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యలను పరిష్కరించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆయనకు ఈ అవార్డును ప్రకటించింది.

నేషనల్‌ పోలీస్‌ మిషన్‌లో భాగంగా గతేడాది డిసెంబర్‌ 4వ తేదీన డీజీ, ఐజీలకు నిర్వహించిన కార్యక్రమానికి డిస్ట్రిక్ట్‌ లెవల్‌ బెస్ట్‌ ప్రాక్టీసెస్‌కు సంబంధించి దేశవ్యాప్తంగా నలుగురు ఎస్పీ స్థాయి అధికారులను ఎంపిక చేయగా, ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఎస్పీ సిద్ధార్థ్‌ కౌశల్‌ ఎంపికయ్యారు.

వీరు తమ ప్రాజెక్టులను ప్రధాని నరేంద్రమోదీ ముందు ప్రదర్శించగా, అందులో ఎస్పీ సిద్ధార్థ్‌ కౌశల్‌ ప్రదర్శించిన ‘వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి – స్పందన ప్రాజెక్టు’ మైక్రోమిషన్‌ కింద ఎంపికైంది.

వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రజలకు స్వయంగా అందుబాటులో ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి చేసిన కృషికి గానూ ఎస్పీ సిద్ధార్థ్‌ కౌశల్‌ను ప్రధాని నరేంద్రమోదీ ప్రత్యేకంగా అభినందించటంతో పాటు డిస్క్‌ అవార్డుకు ఎంపిక చేశారు. అవార్డుకు ఎంపికైన జిల్లా ఎస్పీని పలువురు అధికారులు అభినందించారు. జిల్లాలోని పోలీస్‌ సిబ్బంది ఆయనకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.  

మరిన్ని వార్తలు