శాసనసభ తల వంచదు

25 Mar, 2022 03:46 IST|Sakshi

చట్టాలు చేసే విషయంలో రాజీ పడదు

ఎవరికీ తన తల తాకట్టు పెట్టదు

రాజ్యాంగబద్ధ హక్కులను కాలరాయలేరు

స్పీకర్‌ తమ్మినేని సీతారాం స్పష్టీకరణ

సాక్షి, అమరావతి: చట్ట సభలకు రాజ్యాంగం ప్రసాదించిన సర్వ స్వాతంత్య్ర, సర్వసత్తాక సార్వభౌమాధికారాన్ని కచ్చితంగా కాపాడి తీరతామని శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం స్పష్టం చేశారు. ‘చట్టాలు చేసే విషయంలో శాసనసభ రాజీపడదు.. తన తలను ఎవరికీ తాకట్టు పెట్టదు.. ఎవరికీ తల వంచదు’ అని తేల్చి చెప్పారు. రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ అంశంపై హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పుపై శాసనసభలో గురువారం నిర్వహించిన చర్చ ముగింపు సందర్భంగా స్పీకర్‌ తన అభిప్రాయాన్ని విస్పష్టంగా ప్రకటించారు.

రాజ్యాంగ వ్యవస్థలోని శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలు తమతమ అధికార పరిధికి లోబడే పని చేయాలన్నారు. ఈ మూడు వ్యవస్థలు తమ అధికార పరిధుల మధ్య ఉన్న సన్నని విభజన రేఖను అతిక్రమించకుండా, ఒకదాని అధికారాల్లో మరొకటి జోక్యం చేసుకోకుండా రాజ్యాంగం తమకు నిర్దేశించిన బాధ్యతలను నిర్వర్తించాలని చెప్పారు. చట్టాలు చేసే అధికారం.. ప్రజా ప్రయోజనకర అంశాల్లో తీర్మానాలు చేసే అధికారం చట్ట సభలకు లేదంటే ఎలా? అని ప్రశ్నించారు. శాసన వ్యవస్థకు చట్టాలు, తీర్మానాలు చేసే అధికారాన్ని రాజ్యాంగమే ప్రసాదించిందని, ఆ హక్కును ఎవరూ కాలరాయలేరన్నారు.

న్యాయ వ్యవస్థపై తమకు గౌరవం ఉందని, అంతమాత్రాన చట్ట సభల ఆత్మగౌరవం, రాజ్యాంగ బద్ధమైన హక్కులకు భంగం కలిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ సమ్మతించే ప్రశ్నే లేదన్నారు. చట్ట సభ రాజ్యాంగ బద్ధమైన హక్కును, స్వాతంత్రతను కచ్చితంగా కాపాడి, భావి తరాలకు సరైన దిశానిర్దేశం చేయాల్సిన బాధ్యత సభలో సభ్యులందరిపైనా ఉందన్నారు. పరిపాలన వికేంద్రీకరణ, మూడు రాజధానుల అంశంపై చట్ట సభ ద్వారా సంక్రమించిన రాజ్యాంగబద్ధ అధికారాన్ని ఉపయోగించుకుని ప్రభుత్వం ముందుకు వెళ్లాలని ఆయన అభిప్రాయపడ్డారు.   

మరిన్ని వార్తలు