పాఠశాలకు డుమ్మా కొట్టడం ఇకపై కుదరదు.. ఇంట్లో తెలిసిపోద్ది!

18 Sep, 2022 11:29 IST|Sakshi

విద్యార్థులకు యాప్‌తో అటెండెన్స్‌ 

పాఠశాలకు రాకుంటే తల్లిదండ్రులకు మెసేజ్‌

హాజరు శాతం పెంపునకు దోహదం

సాక్షి, భీమవరం: అమ్మా.. బడికి వెళుతున్నానని ఇంటిలో చెప్పి స్నేహితులతో కలిసి షికార్లు కొడుతూ పాఠశాలకు డుమ్మా కొట్టడం ఇకపై కుదరదు.. ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్‌లైన్‌లో స్టూడెంట్‌ అటెండెన్స్‌ యాప్‌ ద్వారా హాజరు నమోదు చేయడంతో విద్యార్థులు ఉదయం 9.30 గంటలలోపు పాఠశాలకు రాకుంటే తల్లిదండ్రులకు మెసేజ్‌ వెళ్లేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. దీంతో తల్లిదండ్రులు తమ పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ చూపించే అవకాశం ఏర్పడింది.  

ప్రత్యేక యాప్‌తో ప్రయోజనాలెన్నో.. 
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరుశాతం పెంచడానికి, మధ్యాహ్న భోజన పథకంలో అక్రమాలు జరగకుండా ప్రభుత్వం తీసుకువచ్చిన స్టూడెంట్‌ అటెండెన్స్‌ యాప్‌ దోహదపడుతోంది. ప్రభుత్వ పాఠశాల ఉదయం 9 గంటలకు ప్రారంభమైతే ఒకటి నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఆయా క్లాసుల్లో ఉదయం 9.15 గంటల నుంచి 9.30 గంటల వరకు హాజరు వేస్తారు. పాఠశాల ఉపాధ్యాయుడు తన తరగతికి వెళ్లిన వెంటనే సెల్‌ఫోన్‌లో  స్టూడెంట్‌ అటెండెన్స్‌ యాప్‌ లాగిన్‌ అయ్యి విద్యార్థుల హాజరు నమోదు చేస్తారు. సాయంత్రం పూట గతంలో మాదిరి హాజరు పట్టీలో మ్యాన్యువల్‌గా నమోదు చేస్తారు. ఉదయం యాప్‌లో విద్యార్థి హాజరు నమోదు కాకుంటే వెంటనే తల్లిదండ్రుల సెల్‌ఫోన్‌కు మెసేజ్‌ వెళుతుంది. దీంతో కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలు బడికి రాకపోవడానికి గల కారణాలను పాఠశాలలకు వెళ్లి ఉపాధ్యాయులకు తెలియజేస్తున్నారు.  

కార్పొరేట్‌ సవ్వడి 
రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేసేలా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారు. అమ్మఒడి, జగనన్న గోరుముద్ద, విద్యాకానుక, విద్యాదీవెన, వసతి దీవెన వంటి పథకాలను అమలుచేయడంతో పాటు ఇంగ్లిష్‌ మీడియం చదువులను ప్రవేశపెట్టారు. మన బడి నాడు–నేడులో భాగంగా పాఠశాలలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. కార్పొరేట్‌ పాఠశాలలకు దీటుగా తరగతి గదులు, ఫరి్నచర్, తాగునీరు, మరుగుదొడ్లు, ఆటస్థలాలు వంటి వసతులు కలి్పస్తున్నారు.  

అన్ని పాఠశాలల్లో.. 
జిల్లాలోని 1,391 ప్రభుత్వ, 472 ప్రైవేట్‌ పాఠశాలల్లో స్టూడెంట్‌ అటెండెన్స్‌ యాప్‌ అమలుచేస్తున్నాం. దీంతో విద్యార్థులు తప్పని సరిగా క్లాసులకు హాజరవుతున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా సమాచారం వెళుతుండటంతో వారి పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టే అవకాశం ఏర్పడింది. 
– ఆర్‌.వెంకటరమణ, జిల్లా విద్యాశాఖాధికారి, భీమవరం

హాజరు శాతం పెరిగింది 
స్టూడెంట్‌ అటెండెన్స్‌ యాప్‌ కారణంగా హాజరుశాతం పెరిగింది.  ప్రభుత్వం అమలుచేస్తున్న అమ్మఒడి పథకానికి హాజరు శాతం తప్పనిసరి కావడంతో విద్యార్థుల తల్లిదండ్రులకు తమ పిల్లలు హాజరు కాకుంటే వారికి నచ్చచెప్పి స్కూల్‌కు పంపిస్తున్నారు. దీని కారణంగా పాఠశాలల్లో విద్యార్థుల హాజరు పెరిగింది. 
– వి.రాధాకృష్ణ, ఉపాధ్యాయుడు, పీఎస్‌ఎం స్కూల్, భీమవరం

చాలా బాగుంది 
ప్రభుత్వం విద్యకు ఇస్తున్న ప్రాధాన్యం అభినందనీయం. విద్యార్థులు సక్రమంగా పాఠశాలకు వెళ్లేలా స్టూడెంట్‌ అటెండెన్స్‌ యాప్‌ చాలా బాగుంది. మా అమ్మాయి 7వ తరగతి చదువుతోంది. ఎప్పుడైనా బడికి వెళ్లకపోతే మెసేజ్‌ వస్తుంది. స్కూల్‌కు వెళ్లకపోవడానికి గల కారణాలను టీచర్స్‌కు వివరిస్తున్నాం. 
– ఎన్‌.వరలక్ష్మి, విద్యార్థిని తల్లి, దొంగపిండి   
 

మరిన్ని వార్తలు