వెయ్యి లీటర్ల నీరు రూ. 1.21 పైసలే 

10 Dec, 2020 04:53 IST|Sakshi

రాష్ట్రంలో పరిశ్రమలకు కారుచౌకగా నీరు 

తమిళనాడులో అత్యధికంగా రూ.80 వసూలు 

గుజరాత్, మహారాష్ట్రల్లో రూ.20  

24 గంటలు నీటి సరఫరాకు ప్రత్యేక ఏర్పాట్లు 

సాక్షి, అమరావతి: ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రం అత్యంత కారుచౌకగా పరిశ్రమలకు నీరు అందిస్తోంది. దేశంలోనే అత్యంత చౌకగా పరిశ్రమలకు కిలోలీటరు (వెయ్యి లీటర్లు) నీటిని రూ.1.21 పైసలకే ఇస్తోంది. పొరుగు రాష్ట్రం తమిళనాడులో అత్యధికంగా కిలోలీటరుకు రూ.80 వసూలు చేస్తున్నారు. రాజస్థాన్‌ రూ.52, కేరళ రూ.40 చొప్పున వసూలు చేస్తున్నాయి. పారిశ్రామికంగా బాగా అభివృద్ధి చెందిన మహారాష్ట్ర కిలోలీటరుకు రూ.20, గుజరాత్‌ రూ.19.5 తీసుకుంటున్నాయి.

రాష్ట్రంలో ఏర్పాటు చేసే పరిశ్రమలకు అవసరమైన నీటితో పాటు పూర్తిస్థాయి మౌలిక వసతులు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించడంతో పరిశ్రమలకు నీటి వనరులను ఏర్పాటుచేసే దిశగా జల వనరుల శాఖతో కలిసి పరిశ్రమల శాఖ కార్యాచరణ  సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 169 పరిశ్రమలు ఏటా 50 టీఎంసీల నీటిని వినియోగించుకుంటున్నాయి. ప్రస్తుత ధర ప్రకారం పరిశ్రమల నుంచి జల వనరుల శాఖకు ఏటా రూ.171 కోట్ల ఆదాయం వస్తోంది. రాష్ట్రంలో ఏర్పాటయ్యే పరిశ్రమలకు 24 గంటలు నీటిసరఫరా ఉండే విధంగా మౌలిక వసతులు కల్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఇదే సమయంలో నామమాత్రపు ధరకు ఇస్తున్న నీటి చార్జీలను సవరించే దిశగా కసరత్తు చేస్తోంది.  

మరిన్ని వార్తలు