మూడంతస్తుల మేడలో.. పావురాలతో 'ప్రేమలో'..

16 Feb, 2022 05:09 IST|Sakshi

ఆ నిలయం పావురాలకు ప్రేమాలయం 

ప్రత్యేకంగా ఇల్లు కట్టి, అత్యంత శ్రద్ధతో వాటి పోషణ 

ఆహారం, వైద్యం, ఆహ్లాదానికి సంగీతం.. 

పిల్లులు, డేగలు చొరబడకుండా జాగ్రత్తలు, దోమ తెరలు.. 

ప్రేమకు, శాంతికి ప్రతిరూపమైన పావురాలే ఆయన ప్రపంచం 

పావురాల ప్రేమికుడు శ్రీనివాసరావుపై ప్రత్యేక కథనం

పావురం.. ప్రేమకు ప్రతిరూపం.. శాంతికి చిహ్నం. అటువంటి పావురాల పట్ల అపారమైన ప్రేమను పెంచుకున్న ఆయన వాటి కోసం ఏకంగా ఓ ప్రేమ మందిరాన్నే నిర్మించాడు. అందులో సకల సౌకర్యాలు ఏర్పాటు చేసి, కంటికి రెప్పలా వాటిని చూసుకుంటున్నాడు. కృష్ణా జిల్లా మానికొండ గ్రామంలో పావురాలకు ఇల్లు కట్టిన ప్రేమికుడు చెరుకువాడ శ్రీనివాసరావు గురించి మీ కోసం ఈ కథనం. 
– సాక్షి, అమరావతి

కంకిపాడు నుంచి గుడివాడ వెళ్లే మార్గం అది. అక్కడ మానికొండ వెంకటేశ్వరస్వామి ఆలయ సమీపంలో పచ్చని పొలాల నడుమ మూడంతస్తుల భవనం ఒకటి కనిసిస్తుంది. ఆ భవనాన్ని సమీపించే కొద్దీ ఓ వింతైన అనుభూతి కలుగుతుంది. ఎందుకంటే అది కేవలం ఇల్లు కాదు. అదో పావురాల ప్రపంచం. మూడంతస్తుల ఆ మేడలో ప్రతి అంతస్తులోను ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసిన అరలు.. వాటిల్లో వందల రకాల పావురాలు సందడి చేస్తుంటాయి.

పావురాల శత్రు ప్రాణులు కానీ, వాటి భక్షక ప్రాణులు కానీ ఆ భవనంలోకి ప్రవేశించలేవు. అంటే.. పిల్లి, డేగ వంటి జంతువులు బయటి నుంచి జొరబడకుండా ఇనుప కంచెతో కట్టుదిట్టమైన రక్షణ వలయం, ఆఖరికి దోమలు కూడా దూరకుండా దోమల మెష్‌ సైతం ఏర్పాటు చేసి ఉంటుంది. మన ఇళ్లలో ఉన్నట్లే వాటికి కూడా ప్రతి గదిలో ఫ్యాన్లు, లైట్లు ఉంటాయి. 20 రకాల గింజలతో పావురాలకు వేళకు బలమైన ఆహారం, వాటికి సుస్తీ చేస్తే మందులు వంటి ప్రత్యేక ఏర్పాట్లన్నీ ఉంటాయి. అంతేనా.. మ్యూజిక్‌ సిస్టం ఏర్పాటు చేసి ప్రతి ఉదయం తన ప్రేమ పక్షులకు ఆహ్లాదకరమైన సంగీతాన్ని కూడా వినిపిస్తున్నాడు పావురాల ప్రేమికుడు శ్రీనివాసరావు. 

అరుదైన జాతులు.. 1,150కి పైగా పావురాలు 
పావురాలకు మాత్రమే నిర్మించిన ఈ నిలయంలో అనేక జాతులకు చెందిన దాదాపు 1,150కి పైగా పావురాలు కనువిందు చేస్తాయి. దేశంలో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కనిపించే పావురాలతో పాటు యూరప్, అమెరికా, సింగపూర్, దుబాయ్, బంగ్లాదేశ్, బెల్జియం, చైనా, జర్మనీ తదితర దేశాలకు చెందిన వందకుపైగా అరుదైన జాతులను అనేక వ్యయ ప్రయాసలకోర్చి సేకరించారు శ్రీనివాసరావు. రూ.5 వేల నుంచి రూ.85 వేలు విలువ చేసే అరుదైన పావురాలను కొనుగోలు చేసి మరీ పెంచుతున్నారు.

జెయింట్‌ హంగేరియన్, అమెరికన్‌ పాంకెయిన్స్, జాకోబిన్స్, షీల్డ్, వార్‌లెస్‌ హ్యుమర్స్, ఓరియంటల్‌ ఫెరల్, యూరోపియన్‌ లాహోర్, అమెరికన్‌ నన్స్, మాల్టీస్, సాండీల్‌ ముకీస్, చైనీస్‌ ఓవెల్స్, పెంచ్‌ మొడెనా, కింగ్స్, షేక్‌ షెర్లీ, అమెరికన్‌ ఎలిమెంట్స్, కాప్చినో, జర్మన్‌ బ్యూటీ హ్యుమర్, వాల్‌గట్‌ పౌటర్, హెన్నా పౌటర్, మూన్‌ మార్క్‌ పౌటర్, బోటెడ్‌ ఎల్మెంట్, పెషర్‌ వంటి అనేక జాతులకు చెందిన పావురాలను మనం ఇక్కడ చూడొచ్చు. నెమలి వలే పురి విప్పి ఆడేవి, తల నిండా జూలుతో ఆకర్షణీయంగా ఉండేవి, బూట్లు మాదిరిగా కాళ్ల నిండా ఈకలతో విలక్షణమైనవి, రంగు రంగుల రెక్కలు తొడిగినవి.. ఇలా ఇక్కడి విలక్షణమైన పావురాలన్నింటినీ చూసేందుకు మన రెండు కళ్లూ చాలవు. 

పావురం.. ప్రేమకు ప్రతిరూపం 
ప్రపంచ వ్యాప్తంగా పావురాలను ప్రేమకు, శాంతికి ప్రతిరూపంగా భావిస్తారు. రెండు పావురాలు జత కడితే ఇక జీవితాంతం ఆ రెండే కలిసి జీవిస్తాయి. జంటలోని ఒక పావురం అనుకోకుండా చనిపోతే మిగిలిన పావురం కూడా బెంగతో చనిపోతుంది లేదా చనిపోయే వరకు ఒంటరిగానే జీవిస్తుంది. అంతే తప్ప వేరొక పావురంతో ఎట్టి పరిస్థితిలోనూ జత కట్టదు.

పావురం అంటే ప్రాణం 

ప్రేమంటే ఇద్దరు వ్యక్తులకు సంబంధించే కాదు. మన చుట్టూ ఉన్న ప్రకృతి, పక్షులు, జంతువులతోనూ మనకు ప్రేమానుబంధం ఉంటుంది. నాకు చిన్నప్పటి నుంచి పావురాలంటే ప్రాణం. తొలుత కొన్నింటిని ఇంటి వద్దే పెంచేవాడిని. 8 ఏళ్ల క్రితం ప్రత్యేకంగా వాటి కోసమే ఇల్లు నిర్మించాను. ఉదయాన్నే లేచి వాటిని చూడందే ఆ రోజు మొదలవ్వదు. వాటితో ఉంటే నా వ్యయప్రయాసలు, సమస్యలు అన్నీ మరిచిపోతుంటాను. అన్ని వందల పావురాల్లో ప్రతి పావురం నాకు ప్రత్యేకమే. ఏ ఒక్క పావురాన్ని వేరు చేసినా నేను గుర్తించగలను. నేను లేని సమయాల్లో నా భార్య పద్మావతి, కుమార్తె రవళి చాలా శ్రద్ధతో వాటిని సంరక్షిస్తారు. పావురాలతో నాకున్న అనుబంధాన్ని గౌరవించి నా కుటుంబసభ్యులు అందిస్తున్న సహకారం ఎనలేనిది. 
– చెరుకువాడ శ్రీనివాసరావు, మానికొండ, కృష్ణా జిల్లా 

మా నాన్నకు అవి కూడా పిల్లలే.. 
మేము పుట్టక ముందు నుంచే మా నాన్న పావురాలను పెంచుకుంటున్నారు. నేను, నా సోదరుడు సుధీర్‌ చదువుకుని స్థిరపడ్డాం. మాకు ఉండటానికి ఇల్లు కట్టినట్టే.. పావురాలకూ ప్రత్యేకంగా ఇల్లు కట్టిన మా నాన్నకు అవి అంటే ప్రాణం. అందుకే నేను వివాహమై అత్తగారింటికి వెళ్లినా, మా నాన్న పెంచుకుంటున్న పావురాలను భవిష్యత్‌లోనూ మేము సంరక్షించాలని నిర్ణయించుకున్నాం. ఇదే మా నాన్నకు మేమిచ్చే బహుమానం. 
– దాసరి రవళి, శ్రీనివాసరావు కుమార్తె 

మరిన్ని వార్తలు