వైఎస్సార్‌ బాటలోనే వైఎస్‌ జగన్‌

7 Jul, 2022 23:15 IST|Sakshi

వ్యవసాయ, అనుబంధ రంగాలకు పెద్దపీట

విత్తు నుంచి మార్కెట్‌ వరకు రైతుకు బాసట

ఆర్బీకేల ద్వారా సర్టిఫై చేసిన నాణ్యమైన విత్తనాలు

గ్రామాల్లోనే వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు 

మూడేళ్లలో రైతులకు నేరుగా రూ.1.28 లక్షల కోట్ల లబ్ధి

సాక్షి, అమరావతి: తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి అడుగుజాడల్లో ఆయన కన్న కలలను సాకారం చేసే దిశగా సీఎం వైఎస్‌ జగన్‌ జనరంజకపాలన సాగిస్తున్నారు. సీఎంగా పగ్గాలు చేపట్టింది మొదలు రైతన్నల సంక్షేమమే లక్ష్యంగా అడుగులేస్తున్నారు. విత్తు నుంచి విక్రయం వరకు వెన్నుదన్నుగా నిలుస్తూ.. వారిని చేయిపట్టి నడిపిస్తున్నారు.

మూడేళ్లలో వివిధ పథకాల ద్వారా అన్నదాతలకు రూ.1.28 లక్షల కోట్ల లబ్ధిని చేకూర్చడమే ఇందుకు నిదర్శనం. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు వంటి సాగు ఉత్పాదకాలను గ్రామస్థాయిలో రైతుల ముంగిటకు తీసుకెళ్లే లక్ష్యంతో ఏర్పాటు చేసిన వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకేలు) రైతులకు అందిస్తు‍న్న సేవలు వివిధ రాష్ట్రాలకు సైతం ఆదర్శంగా నిలుస్తున్నాయి. వీటికి అనుబంధంగా రూ.16 వేల కోట్లతో గోదాములతోపాటు పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. ధ్రువీకరించిన నాణ్యమైన విత్తనాలను అందించేందుకు నియోజకవర్గ స్థాయిలో వైఎస్సార్‌ ఇంటిగ్రేటెడ్‌ అగ్రి టెస్టింగ్‌ ల్యాబ్‌లు తెచ్చారు. 

గత ప్రభుత్వం బకాయిలు రూ.19,709.20 కోట్లకుపైగా చెల్లింపు..
గత ప్రభుత్వం చెల్లించకుండా ఎగ్గొట్టిన రూ.19,709.20 కోట్లకు పైగా బకాయిలను చెల్లించి సీఎం వైఎస్‌ జగన్‌ తన చిత్తశుద్ధిని చాటుకున్నారు. వీటిలో ప్రధానంగా రూ.8,845 కోట్ల వ్యవసాయ విద్యుత్‌ సబ్సిడీ, రూ.688.25 కోట్ల పావలా వడ్డీ, రూ.384 కోట్ల విత్తన, రూ.716 కోట్ల పంటల బీమా, రూ.437.95 కోట్ల వ్యవసాయ యాంత్రీకరణ, రూ.960 కోట్ల ధాన్యం కొనుగోలు బకాయిలతోపాటు మరణించిన రైతు కుటుంబాలకు చెల్లించాల్సిన రూ.23.45 కోట్ల ఎక్స్‌గ్రేషియా బకాయిలను కూడా చెల్లించారు.

మూడేళ్లలో రూ.23,875.29 కోట్ల పెట్టుబడి సాయం
ఎన్నికల్లో ఏటా రూ.12,500 చొప్పున రూ.50 వేలు ఇస్తామని ఇచ్చిన హామీకి మిన్నగా ఏటా రైతులకు రూ.13,500 చొప్పున ఐదేళ్లకు రూ.67,500 పెట్టుబడి సాయమందిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కౌలు రైతులకు, దేవదాయ అటవీ భూములు సాగుచేసుకుంటున్న రైతులకు కూడా దీన్ని వర్తింపజేశారు. 2019–20లో 46.69 లక్షల మంది రైతులకు రూ.6,173 కోట్లు, 2020–21లో 51.59 లక్షల మంది రైతులకు రూ.6,928 కోట్లు అందించారు. అలాగే 2021–22లో 52.38 లక్షల మందికి రూ.7,016.59 కోట్లు అందించగా, 2022–23లో తొలి విడతగా ఇటీవలే 50.10 లక్షల రైతు కుటుంబాలకు రూ.3,757.70 కోట్లు జమ చేశారు. ఇలా గత మూడేళ్లలో ఇప్పటివరకు 23,875.29 కోట్ల పెట్టుబడి సాయం అందించారు. 

రైతులపై పైసా భారం పడకుండా ఉచిత బీమా..
రైతులపై పైసా భారం పడకుండా రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేస్తోంది. దీని కింద గత ప్రభుత్వం 6.19 లక్షల మంది రైతులకు చెల్లించాల్సిన రూ.715.84 కోట్లతో కలిపి గత మూడేళ్లలో 44.28 లక్షల మందికి రూ.6,684.84 కోట్ల బీమా సాయమందించారు. రూ.లక్ష లోపు పంట రుణాలు తీసుకొని సకాలంలో చెల్లించిన రైతులకు సీజన్‌ ముగియకుండానే వడ్డీ రాయితీని అందిస్తున్నారు. గత ప్రభుత్వం 46.81 లక్షల మంది రైతులకు చెల్లించాల్సిన రూ.784.73 కోట్ల వడ్డీ రాయితీ బకాయిలతో కలిపి మూడేళ్లలో 65.65 లక్షల మంది రైతులకు రూ.1,282.11 కోట్లు చెల్లించారు. విపత్తుల వల్ల పంటలు నష్టపోయిన రైతులను ఆదుకునే లక్ష్యంతో రూ.2 కోట్లతో ప్రకృతి విపత్తుల సహాయ నిధిని ఏర్పాటు చేశారు. సీజన్‌ ముగియకుండానే పెట్టుబడి రాయితీ అందిస్తు‍న్నారు. గత మూడేళ్లలో ప్రకృతి వైపరీత్యాలతో దెబ్బతిన్న 19.94 లక్షల ఎకరాలకు సంబంధించి 17.61 లక్షల మంది రైతులకు రూ.1,612.80 కోట్ల పెట్టుబడి రాయితీ (ఇన్‌పుట్‌ సబ్సిడీ)ని అందించారు.

ఆర్బీకేల ద్వారా కోటి మందికి సేవలు
విత్తనం నుంచి పంట అమ్మకం ద్వారా రైతన్నకు అండగా నిలిచేందుకు గ్రామ స్థాయిలో 10,778 ఆర్బీకేలను ఏర్పాటు చేశారు. వన్‌స్టాప్‌ వన్‌షాపు సెంటర్స్‌గా తీర్చిదిద్దిన వీటి ద్వారా దశాబ్దాలుగా రైతులు పడుతున్న వెతలకు చెక్‌ పడింది. గత మూడేళ్లలో 34.64 లక్షల మంది రైతులకు రూ.564.50 కోట్ల విలువైన 19.22 లక్షల క్వింటాళ్ల విత్తనాలు, 13.62 లక్షల మంది రైతులకు రూ.529.24 కోట్ల విలువైన 5.16 లక్షల టన్నుల ఎరువులు, 1.51 లక్షల మంది రైతులకు రూ.14.01 కోట్ల విలువైన 1.36 లక్షల లీటర్ల పురుగుల మందులను పంపిణీ చేశారు. మూడేళ్లలో ఆర్బీకేల ద్వారా కోటి మందికి సేవలందించారు. 

అందుబాటులోకి 70 ల్యాబ్‌ల సేవలు 
సర్టిఫై చేసిన నాణ్యమైన ఇన్‌పుట్స్‌ అందించే లక్ష్యంతో రూ.213 కోట్ల అంచనాతో నియోజకవర్గ స్థాయిలో 147, జిల్లా స్థాయిలో 13 వైఎస్సార్‌ అగ్రి టెస్టింగ్‌ ల్యాబ్స్‌తోపాటు రీజనల్‌ స్థాయిలో 4 కోడింగ్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో ఇప్పటికే 70 ల్యాబ్‌ల సేవలు అందుబాటులోకి వచ్చాయి. గ్రామ స్థాయిలో అద్దె ప్రాతిపదికన సాగు యంత్రాలను అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో ఆర్బీకే స్థాయిల్లో రూ.587.64 కోట్లతో 6,781 కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్లు, రూ.161.50 కోట్లతో 391 క్లస్టర్‌ స్థాయి సీహెచ్‌సీలు ఏర్పాటు చేశారు. వీటికి అదనంగా ఇటీవలే ఆర్బీకే స్థాయిలో 3,800 ట్రాక్టర్లను, 320 హార్వెస్టర్లను అందుబాటులోకి తెచ్చారు. వైఎస్సార్‌ జలకళతో రైతులకు ఉచితంగా బోర్లు వేస్తున్నారు. సన్న, చిన్నకారు రైతులకు ఉచితంగా మోటార్లు అందిస్తున్నారు. కనీసం 5 లక్షల ఎకరాలను సాగులోకి తీసుకురావాలన్న సంకల్పంతో 2 లక్షల బోరుబావులు తవ్వడానికి రూ.5,715 కోట్లు ఖర్చు చేయనున్నారు. 

పగటి పూట 9 గంటల పాటు నాణ్యమైన విద్యుత్‌..
వ్యవసాయానికి పగటి పూట 9 గంటల పాటు నాణ్యమైన నిరంతర ఉచిత విద్యుత్‌ సరఫరా చేస్తున్నారు. ఇందుకోసం మూడేళ్లలో రూ.25,561 కోట్లు ఖర్చు చేశారు. రూ.1,700 కోట్లతో ఫీడర్ల ఏర్పాటుతోపాటు మౌలిక సదుపాయాలు కల్పించారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ఇచ్చే పరిహారాన్ని రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షలకు పెంచారు. అంతేకాకుండా 2014–19 మధ్య 463 మంది రైతు కుటుంబాలకు గత ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.23.45 కోట్ల బకాయిలతో కలిపి ఇప్పటివరకు 694 మందికి రూ.72.03 కోట్లు చెల్లించారు. రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశారు. అంతేకాకుండా గతంలో కనీస గిట్టుబాటు ధర లేని మిరప, పసుపు, ఉల్లి, చిరుధాన్యాలకు పంట వేసే సమయంలోనే కనీస గిట్టుబాటు ధరలు ప్రకటిస్తున్నారు. ఇలా మూడేళ్లలో రూ.44,844.31 కోట్ల విలువైన ధాన్యంతో పాటు రూ.6,903 కోట్ల విలువైన ఇతర పంటలను కొనుగోలు చేశారు.

మరిన్ని వార్తలు