AP: సమయానికి రాకపోతే ‘సెలవే’

26 Feb, 2022 11:16 IST|Sakshi

ఉదయం 10 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు విధుల్లో ఉండాలి

రాష్ట్ర సచివాలయ ఆర్థిక శాఖ అధికారులు, ఉద్యోగులకు ప్రత్యేక సీఎస్‌ ఆదేశాలు

సాక్షి, అమరావతి: రాష్ట్ర సచివాలయ ఆర్థిక శాఖ అధికారులు, ఉద్యోగులు నిర్ణీత సమ యంలోగా కార్యాలయానికి రావాలని ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌.ఎస్‌. రావత్‌ ఆదేశాలు జారీ చేశారు. కోవిడ్‌–19 తరువాత ఇప్పుడు సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని, అందువల్ల సచివాలయ ఆర్థిక శాఖలో పనిచేసే అధికారులు, ఉద్యోగులందరూ పని దినాల్లో ఉదయం 10 గంటలకల్లా కార్యాలయానికి రావాలని, సాయంత్రం 5.30 గంటల వరకు ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. నిర్ణీత సమయంలోగా రాని అధికారులకు, ఉద్యోగులకు ఆ రోజు సెలవుగా పరిగణిస్తామని తెలిపారు. ఆయన ఆదేశాలు ఇవీ..

చదవండి: విశాఖలో సీఎం జగన్‌ పర్యటన.. షెడ్యూల్‌ ఇదే..

ఉదయం 10 నుంచి 10.10 గంటల్లోపు తప్పనిసరిగా విధులకు హాజరవడం తోపాటు పనిచేయడం ప్రారంభించాలి
ఉదయం 10.10  నుంచి 11 గంటల్లోపు ఆలస్యంగా హాజరుకు నెలలో మూడు సార్లు మాత్రమే అనుమతి.
ఒక పూట హాజరును ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరిగణిస్తారు
ఉదయం 11 గంటల తరువాత వచ్చి మధ్యాహ్నం 1 గంటలోపే వెళ్లిపోయినా లేదా నిర్ణీత సమయంలోగా వచ్చి మధ్యా హ్నం 1 గంటకన్నా ముందే వెళ్లిపోయినా ఒక పూట సెలవుగా పరిగణిస్తారు
మధ్యాహ్నం 1 గంట తరువాత హాజరైతే ఆ రోజు సెలవుగా లేదా గైర్హాజరుగా పరిగణిస్తారు
ఉదయం 10 గంటలకు హాజరై సాయంత్రం 5.30 తరువాత కార్యాలయం నుంచి వెళ్తే పూర్తి రోజు హాజరైనట్లు
ఉద్యోగులు ముందుగా అనుమతి తీసుకోకుండా సెలవు పెట్టడంవల్ల పని వాతావరణం దెబ్బతింటోంది.  ఇక నుంచి సెలవుకు ముందుగా  అనుమతి తీసుకోవాల్సిందే. అనుమతి తీసుకోకుండా సెలవు పెడితే అనధికార గైర్హాజరుగా పరిగణిస్తారు. ఒక పూట సెలవు కోసం ముందస్తు సమాచారం ఇవ్వాలి. 
అధికారులు, ఉద్యోగులందరూ పనివేళ లను కచ్చితంగా పాటించాలి. క్రమశిక్షణను, పని వాతావరణాన్ని నెలకొల్పాలి. లేదంటే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని రావత్‌ స్పష్టం చేశారు.
కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు కూడా ఇది వర్తిస్తుందని ఆయన పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు