ఫుడ్‌ ప్రాసెసింగ్‌కు చేయూత ఇవ్వండి 

3 Dec, 2021 05:10 IST|Sakshi

నాబార్డును కోరిన స్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్య

సానుకూలంగా స్పందించిన నాబార్డు సీజీఎం  

సాక్షి, అమరావతి: రైతులకు అదనపు లబ్ధి చేకూర్చే లక్ష్యంతో పార్లమెంట్‌ నియోజకవర్గస్థాయిలో ఏర్పాటు చేస్తున్న 26 సెకండరీ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లకు ఆర్థిక చేయూతనివ్వాలని నాబార్డుకు వ్యవసాయ శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ పూనం మాలకొండయ్య విజ్ఞప్తి చేశారు. ముంబైలోని నాబార్డు ప్రధాన కార్యాలయంలో సీజీఎం బి.రఘునాథ్‌తో గురువారం ఆమె సమావేశమయ్యారు. స్థానికంగా సాగు అయ్యే పంటల ఆధారంగా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేయబోతున్నట్టు చెప్పారు. ప్రభుత్వమే వీటిని ఏర్పాటు చేసి ఆసక్తి కలిగిన జాతీయ, అంతర్జాతీయ బహుళజాతి సంస్థలకు నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తుందని వివరించారు.

వీరికి కావాల్సిన ముడిసరుకు(పంట)ను.. ప్రభుత్వం నిర్దేశించిన ధరకు కొనుగోలు చేయాలని నిబంధన విధించినట్లు తెలిపారు. వాటికొచ్చే లాభాల్లో కూడా రైతులకు కొంత భాగం ఇచ్చేలా విధివిధానాలు రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. వీటి ఏర్పాటు కోసం ప్రభుత్వం ఏపీ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సొసైటీ పర్యవేక్షణలో స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌ ఏర్పాటు చేసిందన్నారు. స్థలాలను గుర్తించే ప్రక్రియ జరుగుతోందని, అవసరమైన ఆర్థిక చేయూతనందించాలని కోరారు.

నాబార్డు సీజీఎం రఘునాథ్‌ మాట్లాడుతూ.. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లకు అవసరమైన ఆర్థిక చేయూతనిచ్చేందుకు సానుకూలంగా ఉన్నామని చెప్పారు. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పాలసీపై అధ్యయనం చేసేందుకు త్వరలోనే నాబార్డు బృందం ఏపీలో పర్యటిస్తుందన్నారు. సమావేశంలో ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ జి.శేఖర్‌బాబు తదితరులు పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు