సంక్రాంతికి తగ్గేదేలే.. స్పెషల్‌ డైట్‌తో తర్ఫీదు.. పుంజు ధర ఎంతో తెలుసా?

18 Nov, 2022 07:13 IST|Sakshi

సంక్రాంతి పండగ అంటే గోదావరి జిల్లాల్లో గుర్తొచ్చేది కోడిపందేలే. ఏటా ఎంతో సందడిగా జరిగే ఈ పందేలను తిలకించేందుకు ఇతర రాష్ట్రాల నుంచి సైతం ఇక్కడకు వస్తుంటారు. పందేలలో రూ.కోట్లు చేతులు మారుతుంటాయి. అయితే సంక్రాంతి పండగకు ఇంకా రెండు నెలల సమయం ఉండగా అప్పుడే కోడిపుంజులను పందేలకు సిద్ధం చేస్తున్నారు. బరిలో బలంగా ఢీకొట్టేలా జాతి కోళ్లను జిల్లాలోని కొన్ని శిబిరాల్లో పెంచుతుండగా, వీటి ఖరీదు రూ.వేల నుంచి లక్షల్లో పలుకుతుండటం విశేషం. 

భీమవరం (ప్రకాశం చౌక్‌): సంక్రాంతి బరిలో దించే పుంజులపై పందెం రాయుళ్లు, అలాగే పుంజుల పెంపకందారులు భారీగా పెట్టుబడులు పెడతారు. పందేనికి పుంజును సిద్ధం చేయడం కోసం పెంపకందారులు చాలా శ్రమిస్తారు. పుంజును సుమారు ఏడాది పాటు పెంచుతారు. వీటి ఆహారం నుంచి ఆరోగ్యంగా, బలంగా ఉండేవరకు ఒక్కోక్క పుంజుపై సుమారు రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు ఖర్చు చేస్తారు. కొందరు  ప్రత్యేకంగా కోసం స్థలం లీజుకు తీసుకుని మరీ 20 నుంచి 200 పుంజుల వరకు పెంచుతారు. పుంజుల సంఖ్య బట్టి ఏడాదికి సుమారు రూ.5 లక్షల నుంచి రూ.కోటి వరకు ఖర్చు చేస్తారు. మరి కొందరు అయితే తమ ఇంటి వద్ద ఉండే చిన్న పాటి ఖాళీ స్థలంలోనే పందెం పుంజులను పెంచుతూ పండగ సమయంలో వాటిని విక్రయించి ఉపాధి పొందుతారు. 

ఖరీదైనా దాణా.. నిత్యం వ్యాయామం 
పందెం పుంజుకు బలవర్థమైన ఆహారం పెడతారు. మటన్‌ కైమా, జీడిపప్పు, బాదం పప్పు, కోడిగుడ్డు, గంటులు, చోళ్లు, తదితర వాటిని ప్రతిరోజు వాటికి ఆహారంగా పెడతారు. తరచూ పుశువైద్యులకు చూపించి వారి సలహాలు మేరకు విటమిన్‌ మాత్రలు, అనారోగ్యానికి గురికాకుండా వైద్యం అందించడం చేస్తారు. పందెం బరిలో త్వరగా అలసిపోకుండా ఎక్కువ సేపు పోరాడేలా ప్రతి రోజు వ్యాయామం చేయిస్తారు. నీటిలో ఈత కొట్టిస్తారు. పుంజు ఎలా పోరాడుతుంతో తెలుసుకోవడానికి తరచూ ఇతర కోళ్లతో పందేలు వేసి గమనిస్తుంటారు.  

రూ.10 కోట్ల వ్యాపారంపైనే.. 
జిల్లాలో పందెం పుంజుల పెంపకం కలిగిన ప్రాంతాల చూస్తే ముఖ్యంగా భీమవరం, పాలకొల్లు, ఉండి, ఆకివీడు, కాళ్ల, వీరవాసరం, నర్సాపురం, ఆచంట,  తణుకు, పాలకోడేరు, తాడేపల్లిగూడెం, తదితర ప్రాంతాల్లో భారీగా పుంజులను పెంచుతుంటారు. మొత్తం జిల్లాలో ఏటా సంక్రాంతి పండగకు పందెం పుంజుల కొనుగోలు కోసం పందెంరాయుళ్లు సుమారు రూ.10 కోట్ల వరకు ఖర్చు చేస్తుంటారని అంచనా. 

పుంజు ధర, రకాలు 
పందెం పుంజుల ధర విషయానికి వస్తే జాతి, రంగు, దెబ్బలాడే విధానాన్ని బట్టి ధర నిర్ణయిస్తారు. వీటి ధర సుమారుగా రూ.15 వేల నుంచి రూ.లక్ష వరకు పలుకుతాయి. వీటిలో నెమలి, కాకీ నెమలి, పచ్చ కాకి, సేతువా, పర్ల, డేగ, నెమలి డేగ, రసంగీ, మైలా, ఫింగలా, పెట్టమర్రు, తదితర రకాల పుంజులు ఉంటాయి. 

ఆన్‌లైన్‌లోనూ విక్రయాలు 
పందెం పుంజులను పెంపకందారులు పలు రకాలుగా విక్రయిస్తున్నారు. పుంజు  కావాల్సిన వారు ముందుగా కొంత అడ్వాన్సు ఇచ్చి బుక్‌ చేసుకుని పందెం రోజు పూర్తి మొత్తం ఇచ్చి తీసుకువెళుతుంటారు. మరి కొందరు నేరుగా మకాం వద్దకు వెళ్లి వారికి కావాల్సిన పుంజులను ఎంచుకుని కొనుగోలు చేస్తుంటారు. ఇప్పుడు అయితే పెంపకందారులు పుంజులను ఆన్‌లైన్‌లో కూడా విక్రయిస్తున్నారు. సంక్రాంతి పండగ సమయంలో పందేలు జరిగే ప్రాంతాలకు తీసుకువెళ్లి అక్కడ నేరుగా కూడా విక్రయిస్తుంటారు. జిల్లాలోని భీమవరం, పాలకొల్లు, నర్సాపురం, వీరవాసరం, కాళ్ల, ఉండి, ఆకివీడు, తాడేపల్లిగూడెం, అత్తిలి, తణుకు తదితర మండలాల్లో కోడి పుంజులను విక్రయాలు ఎక్కువగా విక్రయిస్తుంటారు. 

మరిన్ని వార్తలు