నదుల అనుసంధానమే అజెండా

2 Jan, 2022 05:05 IST|Sakshi

19న ఎన్‌డబ్ల్యూడీఏ పాలకమండలి సమావేశం

డీపీఆర్‌లు, పనుల ప్రగతిపై సమీక్ష.. 

గోదావరి–పెన్నా అనుసంధానంపై ప్రత్యేక చర్చ

సాక్షి, అమరావతి: దేశంలో నదుల అనుసంధానమే అజెండాగా ఈ నెల 19న జాతీయ జల వనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) పాలకమండలి సమావేశమవుతోంది. కేంద్ర జల్‌ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్‌ అధ్యక్షతన వర్చువల్‌ విధానంలో జరిగే ఈ సమావేశంలో ఎన్‌డబ్ల్యూడీఏ డైరెక్టర్‌ జనరల్‌ భోపాల్‌సింగ్, సీడబ్ల్యూసీ (కేంద్ర జల సంఘం) చైర్మన్‌ ఆర్కే సిన్హాతోపాటూ అన్ని రాష్ట్రాల జల వనరుల శాఖ ఉన్నతాధికారులు పాల్గొంటారు.

రాష్ట్రం తరఫున జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డి, ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి హాజరవుతారు. సముద్రం పాలవుతున్న నదీ జలాలను ఒడిసిపట్టి.. లభ్యత ఎక్కువగా ఉన్న నది నుంచి తక్కువ లభ్యత ఉన్న నదికి మళ్లించడం ద్వారా దేశాన్ని సస్యశ్యామలం చేసేందుకు నదుల అనుసంధానాన్ని చేపట్టడం కోసం ఎన్‌డబ్ల్యూడీఏను కేంద్రం ఏర్పాటు చేసింది. హిమాలయ నదులను అనుసంధానం చేయడానికి 14, ద్వీపకల్ప నదులను అనుసంధానం చేయడానికి 16 ప్రణాళికలను ఎన్‌డబ్ల్యూడీఏ ఇప్పటికే సిద్ధం చేసింది.

వాటిని ప్రాధాన్యత క్రమంలో చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది. తొలుత కెన్‌–బెట్వా, గోదావరి–కృష్ణా–పెన్నా–కావేరి, దామన్‌గంగ–పింజాల్, పార్‌–తాపి–నర్మద నదులను అనసంధానించేందుకు నడుం బిగించింది. కెన్‌–బెట్వా అనుసంధాన పనులు చేపట్టడానికి రూ.44,605 కోట్లకు కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. ఆ పనులు చేపట్టడానికి వీలుగా కెన్‌–బెట్వా లింక్‌ ప్రాజెక్ట్‌ అథారిటీ (కేబీఎల్‌పీఏ) పేరుతో ఎస్పీవీని ఎన్‌డబ్ల్యూడీఏ ఏర్పాటు చేసింది.

ఈ పనులకు నిధుల సమీకరణ, టెండర్లపై సమావేశంలో చర్చించనున్నారు. గోదావరి నుంచి కృష్ణా, పెన్నా, కావేరి బేసిన్‌లకు 216 టీఎంసీలను తరలించే అనుసంధానం పనులపై ఇప్పటికే ఆ బేసిన్‌ల పరిధిలోని రాష్ట్రాలతో ఎన్‌డబ్ల్యూడీఏ చర్చించింది. అనుసంధానాన్ని ఎలా చేయాలనే అంశంపై ఈ సమావేశంలో చర్చిస్తారు.  

మరిన్ని వార్తలు