ఆంధ్రప్రదేశ్‌: పంట నష్టం అంచనాలకు ప్రత్యేక ఫీచర్‌

4 Oct, 2021 03:49 IST|Sakshi
శ్రీకాకుళం జిల్లా దూసి గ్రామంలో పంట నష్టం అంచనా వేస్తున్న అధికారుల బృందం

సాక్షి, అమరావతి: ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయే ప్రతీ రైతన్నను ఆదుకోవాలన్న సంకల్పంతో పంట నష్టం అంచనాలను పక్కాగా తేల్చేందుకు ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. ఈ– క్రాప్‌తో సహా ఇతర సేవల కోసం ఇటీవల వినియోగంలోకి తెచ్చిన వైఎస్సార్‌ రైతు భరోసా యూనిఫైడ్‌ డిజిటల్‌ ప్లాట్‌ఫాం (ఆర్‌బీ– యూడీపీ) యాప్‌లో అదనంగా విపత్తు నిర్వహణ సేవ(డిజాస్టర్‌) పేరిట ప్రత్యేక ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఈ – క్రాప్‌తో  అనుసంధానించిన ఈ యాప్‌ ద్వారా పంట నష్టం అంచనాలు రూపొందించడం ద్వారా పరిహారం చెల్లింపుల్లో మరింత పారదర్శకత రానుంది.

జాప్యం లేకుండా శరవేగంగా 
‘గులాబ్‌’ తుపాన్‌ ప్రభావంతో ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో 1,62,721 లక్షల ఎకరాల్లో వ్యవసాయ, 8,637 ఎకరాల్లో ఉద్యాన పంటలు ముంపునకు గురైనట్లు ప్రాథమికంగా గుర్తించారు. సాధ్యమైనంత త్వరగా తుది అంచనాలను లెక్క తేల్చి సీజన్‌ ముగిసేలోగా పంటలు దెబ్బతిన్న ప్రతీ రైతుకు పరిహారం చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు పంట నష్టం అంచనాలను మదింపు చేస్తున్నాయి. గతంలో నిర్దేశిత ఫార్మాట్‌లో పంట నష్టం వివరాలను నమోదు చేసి ఫొటోలు తీసుకునే వారు.

ఆ వివరాలను మదింపు చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించే వారు. అయితే ఈ విధానం వల్ల పంటనష్టం అంచనాలు రూపొందించడం, పరిహారం చెల్లింపుల్లో పెద్ద ఎత్తున అవకతవకలు చోటుచేసుకునేవి. ఈ పరిస్థితికి చెక్‌ పెడుతూ ఆర్‌బీ యూడీపీ యాప్‌లో ప్రత్యేకంగా తెచ్చిన డిజాస్టర్‌ ఫీచర్‌ ద్వారా జియో కోఆర్డినేట్స్‌తో సహా పంట నష్టం అంచనాలు పక్కాగా లెక్కతేల్చే అవకాశం ఏర్పడింది.

జియో కో ఆర్డినేట్స్‌తో సహా వివరాలు నమోదు
ఆర్‌బీ యూడీపీ యాప్‌లో డిజాస్టర్‌ ఐకాన్‌ను క్లిక్‌ చేసి పంట దెబ్బతిన్న రైతు ఆధార్‌ నంబర్‌ నమోదు చేస్తే చాలు. ఈ – క్రాప్‌తో అనుసంధానించడం వల్ల రైతు ఎన్ని ఎకరాల్లో ఏ పంట వేశారు? ఎంత దిగుబడి వస్తుందని అంచనా వేశారు? తదితర వివరాలన్నీ చూడవచ్చు. అవన్నీ సరైనవిగా నిర్ధారించుకున్న తర్వాత డిజాస్టర్‌ బాక్స్‌లో పంట నష్టం తీవ్రతను బట్టి పూర్తిగా లేదా పాక్షికం అని పేర్కొనాలి. దెబ్బతిన్న పంట విస్తీర్ణం వివరాలతో పాటు ఎలాంటి వైపరీత్యం (వరద/ కరువు/ భూమికోత) వల్ల జరిగిందో నమోదు చేయాలి. ఆ తర్వాత నష్ట తీవ్రతను బట్టి ముంపు/నేలకొరగడం/ఇసుక మేటలు వేయడం లాంటి వివరాలను పొందుపర్చిన తర్వాత ఫోటోలు, వీడియోలు అప్‌లోడ్‌ చేయగానే జియో కో ఆర్డినేట్స్‌తో సహా పంట నష్టం వివరాలను ఆటోమేటిక్‌గా నమోదు చేస్తుంది.

సీజన్‌ ముగిసేలోగా పరిహారం
‘వైపరీత్యాల వల్ల దెబ్బతిన్న రైతులకు పరిహారం చెల్లింపులో మరింత పారదర్శకత తెచ్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు యాప్‌లో ప్రత్యేక ఫీచర్లు అందుబాటులోకి తెచ్చాం. ఆర్‌బీ యూడీపీ యాప్‌లో కొత్తగా తీసుకొచ్చిన విపత్తు నిర్వహణ సేవ (డిజాస్టర్‌) ఫీచర్‌ ద్వారా గులాబ్‌ తుపాన్‌ వల్ల జరిగిన పంట నష్టం తుది అంచనాలను  ప్రత్యేక బృందాలు రూపొందిస్తున్నాయి. సీజన్‌ ముగిసేలోగా నష్టపోయిన ప్రతీ రైతుకు పరిహారం అందేలా చర్యలు తీసుకుంటాం’
– కురసాల కన్నబాబు, వ్యవసాయశాఖ మంత్రి

బోగస్, బినామీలకు ఆస్కారం లేని రీతిలో..
చివరగా నష్టపోయిన రైతుతో పాటు పరిశీలనలో గుర్తించిన అంశాలపై ఆర్‌బీకేలో పనిచేస్తున్న గ్రామ వ్యవసాయ సహాయకులు (వీఏఏ) తమ అభిప్రాయాలను ఆడియో రికార్డ్‌ ద్వారా అప్‌లోడ్‌ చేసి సబ్మిట్‌ చేస్తారు. పంట వేయగానే పంట వివరాలను ఆర్‌బీ యూడీపీ యాప్‌ ద్వారా ఈ క్రాప్‌తో నమోదు చేస్తున్న విషయం తెలిసిందే. డిజాస్టర్‌ ఫీచర్‌తో వివరాలను అనుసంధానించడం వల్ల బోగస్‌ లేదా బినామీ పేర్లు నమోదు చేసే అవకాశం ఉండదు. అంతేకాదు దెబ్బతిన్న పంటల ఫొటోలు, వీడియోలు జియో కో ఆర్డినేట్స్‌తో సహా నమోదు చేస్తుండడం ద్వారా ఇష్టమొచ్చినట్లు నష్ట తీవ్రత నమోదు చేసే అవకాశం  ఉండదు. యాప్‌ ద్వారా పంట నష్టం వివరాలను నమోదు చేస్తుండడం వల్ల భవిష్యత్‌లో తుపాన్‌లు, వరదలు లాంటి వైపరీత్యాల వేళ పంట కోల్పోయే వాస్తవ సాగుదార్లకు మాత్రమే పెట్టుబడి రాయితీ అందే అవకాశం ఉంటుందని వ్యవసాయ శాఖ కమిషనర్‌ అరుణ్‌కుమార్‌ తెలిపారు. గులాబ్‌ తుపాన్‌ వల్ల జరిగిన పంట నష్టం అంచనాలు అక్టోబర్‌ 15 కల్లా కొలిక్కి వస్తాయని, ఆ వెంటనే ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని చెప్పారు. 

మరిన్ని వార్తలు