ఏపీ: కొల్లేరు, కృష్ణా డెల్టాపై ప్రత్యేక దృష్టి 

4 May, 2021 05:08 IST|Sakshi

వరదను ఒడిసి పట్టి రాష్ట్రాన్ని సుభిక్షం చేసేలా ప్రభుత్వం ప్రణాళిక

రూ.75,724 కోట్లతో కొత్తగా 51 సాగునీటి ప్రాజెక్టుల పనులకు గ్రీన్‌ సిగ్నల్‌

నిధుల కొరత లేకుండా సకాలంలో పూర్తి చేసేలా ఐదు ఎస్పీవీల ఏర్పాటు

తక్కువ వడ్డీకే రుణాలు, బడ్జెట్‌ కేటాయింపులతో వేగంగా పూర్తయ్యేలా చర్యలు

శ్రీశైలానికి వరద సమయంలో సీమ, నెల్లూరు ప్రాజెక్టులు నింపేలా పనులు

గోదావరి జలాలు, వరికపుడిశెల ఎత్తిపోతలతో పల్నాడు సాగు, తాగునీటి కష్టాలకు చెక్‌

గోదావరి వరద మళ్లింపు ద్వారా ఉత్తరాంధ్ర సమగ్రాభివృద్ధి

కొల్లేరు, కృష్ణా డెల్టా పరిరక్షణపై ప్రత్యేక దృష్టి 

సాక్షి, అమరావతి: కడలిపాలవుతోన్న వరద జలాలను గరిష్టంగా ఒడిసి పట్టి ఆయకట్టుకు మళ్లించడం ద్వారా రాష్ట్రాన్ని కరువు రహితంగా తీర్చిదిద్దేలా ఏపీ ప్రభుత్వం ప్రణాళిక రచించింది. ఇందులో భాగంగా రూ.75,724 కోట్ల వ్యయంతో కొత్తగా 51 ప్రాజెక్టుల పనులు చేపట్టేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. కొత్త ప్రాజెక్టుల పనులు ప్రణాళికాయుతంగా పూర్తి చేసేందుకు ఐదు స్పెషల్‌ పర్పస్‌ వెహికల్స్‌(ఎస్పీవీ)ను ఏర్పాటు చేసింది. ప్రాజెక్టుల పనుల వ్యయంలో 70 శాతాన్ని జాతీయ బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి తక్కువ వడ్డీకే రుణాల రూపంలో సమీకరిస్తుండగా మిగతా 30 శాతం నిధులను బడ్జెట్‌ ద్వారా కేటాయించి ప్రాధాన్యత క్రమంలో సకాలంలో పూర్తి చేయాలని నిర్ణయించింది. 

శ్రీశైలానికి వరద సమయంలోనే.. 
కృష్ణా పరీవాహక ప్రాంతం(బేసిన్‌)లో వర్షాభావ పరిస్థితులు, ఎగువన ప్రాజెక్టుల నిర్మాణాల వల్ల శ్రీశైలం జలాశయానికి వచ్చే వరద 35 నుంచి 40 రోజులకు తగ్గిపోయింది. అది కూడా ఒకేసారి గరిష్టంగా వస్తోంది. ఈ నేపథ్యంలో వరద వచ్చే రోజుల్లోనే రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో ప్రాజెక్టులను నింపేలా ఎత్తిపోతలు, కాలువల ప్రవాహ సామర్థ్యాన్ని పెంచే పనులను ప్రభుత్వం కొత్తగా చేపట్టింది. అవసరమైన చోట కొత్తగా ప్రాజెక్టుల పనులు చేపట్టింది. మొత్తమ్మీద 32 ప్రాజెక్టులను రూ.43,203 కోట్ల వ్యయంతో చేపట్టేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఇందుకోసం రాయలసీమ డ్రాట్‌ మిటిగేషన్‌ ప్రాజెక్ట్స్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌(ఆరీ్డఎంపీడీసీ)ను ఏర్పాటు చేసింది.

ఉత్తరాంధ్ర సమగ్రాభివృద్ధే లక్ష్యంగా..:
పోలవరం ఎడమ కాలువ నుంచి 63.2 టీఎంసీల గోదావరి జలాలను తరలించడం ద్వారా ఉత్తరాంధ్రలో కొత్తగా ఎనిమిది లక్షల ఎకరాలకు నీళ్లందించే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, తాండవ–ఏలేరు అనుసంధానం ద్వారా 57,065 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ పనులను చేపట్టేందుకు ఉత్తరాంధ్ర ఇరిగేషన్‌ ప్రాజెక్టŠస్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌(యూఏఐడీసీ) పేరుతో ఎస్పీవీ ఏర్పాటైంది. దీని ద్వారా రూ.8,554 కోట్ల వ్యయంతో మొత్తం నాలుగు ప్రాజెక్టులను ప్రభుత్వం చేపట్టింది. 

దుర్భిక్ష పల్నాడుకు దన్ను..:
గోదావరి, వరికపుడిశెలవాగు వరద జలాలను ఒడిసి పట్టి దుర్భిక్ష పల్నాడును సస్యశ్యామలం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వైఎస్సార్‌ పల్నాడు ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలు, వరికపుడిశెల ఎత్తిపోతల ద్వారా వాగు వరద నీటిని తరలించడం ద్వారా పల్నాడును సుభిక్షం చేసే పనులను చేపట్టేందుకు పల్నాడు ఏరియా డ్రాట్‌ మిటిగేషన్‌ ప్రాజెక్టŠస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(పీఏడీఎంసీ) పేరుతో ఎస్పీవీని ఏర్పాటు చేసింది. ఈ ఎస్పీవీ కింద ఆరు ప్రాజెక్టుల పనులు చేపట్టడానికి రూ.8,276 కోట్లతో అనుమతి ఇచ్చింది.

గోదావరి వరదతో రాష్ట్రానికి జలభద్రత..
గోదావరి వరద జలాలను గరిష్టంగా ఒడిసి పట్టడం ద్వారా రాష్ట్రానికి జలభద్రత చేకూర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా ప్రాథమికంగా పోలవరం కుడి కాలువ ప్రవాహ సామర్థ్యాన్ని పెంచడం ద్వారా గోదావరి జలాలను దుర్భిక్ష ప్రాంతాలకు తరలించే పనులను చేపట్టేందుకు కసరత్తు చేస్తోంది. ఈ పనులను మొత్తం మూడు విభాగాలుగా చేపట్టడానికి రూ.12,707 కోట్ల వ్యయం కానుందని అంచనా. వాటిని చేపట్టడానికి ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ వాటర్‌ సెక్యూరిటీ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టŠస్‌(ఏపీఎస్‌డబ్ల్యూఎస్డీపీ) పేరుతో ఎస్పీవీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

కృష్ణా డెల్టా, కొల్లేరు పరిరక్షణే ధ్యేయం..:
కృష్ణా డెల్టా, కొల్లేరు సరస్సులను ఉప్పు నీటి బారిన పడకుండా చేయడం ద్వారా వాటికి జీవం పోసే పనులను అత్యంత ప్రాధాన్యతగా ప్రభుత్వం చేపట్టింది. కృష్ణా నదిపై ప్రకాశం బ్యారేజీకి దిగువన రెండు బ్యారేజీలు, వైఎస్సార్‌ వేదాద్రి ఎత్తిపోతల, కొల్లేరు పరిరక్షణ పనులను చేపట్టేందుకు కృష్ణా–కొల్లేరు సెలైనిటి మిటిగేషన్‌ ప్రాజెక్టŠస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ పేరుతో ఎస్పీవీని ఏర్పాటు చేసింది. ఈ ఎస్పీవీ కింద రూ.2,989 కోట్లతో ఆరు ప్రాజెక్టులను చేపట్టనుంది. 

మరిన్ని వార్తలు