ఆప్షన్‌–3 ఇళ్ల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి 

4 Aug, 2022 04:58 IST|Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకంలో భాగంగా నిర్మిస్తున్న ఆప్షన్‌–3 ఇళ్ల నిర్మాణానికి అవసరమైన పనులను వారంలోగా పూర్తి చేయాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌ జైన్‌ ఆ శాఖ అధికారులను ఆదేశించారు. గృహ నిర్మాణ శాఖ అధికారులతో ఆయన బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆప్షన్‌–3 ఎంచుకున్న లబ్ధిదారులను కాంట్రాక్టర్లకు మ్యాపింగ్‌ చేయడం, అవగాహన ఒప్పందాలు, బ్యాంక్‌ ఖాతాలను ప్రారంభించడం తదితర పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని చెప్పారు.

విశాఖపట్నంలో సుమారు 1.24 లక్షల ఇళ్లు నిర్మిస్తున్నందున.. లబ్ధిదారులకు బ్యాంక్‌ ఖాతాలు ప్రారంభించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. కాంట్రాక్టర్లు సకాలంలో నిర్మాణాలు పూర్తి చేయడానికి చర్యలు చేపట్టాలని,  ఇందుకోసం ప్రతి లేఅవుట్‌లో ఇటుకల తయారీ యూనిట్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గృహ నిర్మాణ సంస్థ ఎండీ డాక్టర్‌ నారాయణ భరత్‌ గుప్తా మాట్లాడుతూ.. నిర్మాణాలకు సకాలంలో సామగ్రి సరఫరాతో పాటు బిల్లులు చెల్లిస్తామన్నారు.   

మరిన్ని వార్తలు