ప్రభుత్వోద్యోగులకు ఏపీ సర్కార్‌ మరో తీపికబురు

9 Mar, 2022 04:22 IST|Sakshi

పిల్లల దత్తత, పిల్లల సంరక్షణ కోసం సర్కారు నిర్ణయం 

వికలాంగులకు స్పెషల్‌ క్యాజువల్‌ సెలవులు, ఎక్స్‌గ్రేషియా కూడా ప్రకటన 

11వ పీఆర్సీ సిఫార్సులతో ప్రభుత్వం ఆదేశాలు

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు సర్కారు మరో తీపికబురు చెప్పింది. 11వ పే రివిజన్‌ కమిషన్‌ (పీఆర్‌సీ) సిఫార్సుల ఆధారంగా పిల్లల దత్తత, పిల్లల సంరక్షణ, వికలాంగులకు స్పెషల్‌ క్యాజువల్‌ సెలవులు, పలు వ్యాధులకు ఎక్స్‌గ్రేషియా ప్రకటిస్తూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి షమీర్‌ సింగ్‌ రావత్‌ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. 

ఈ జీఓ ప్రకారం ఉద్యోగులకు లభించే ప్రయోజనాలివీ.. 
► పిల్లలను దత్తత తీసుకున్న ఉద్యోగి 180 రోజుల వరకూ సెలవు తీసుకోవచ్చు. సెలవు రోజులకు కూడా పూర్తి జీతం పొందొచ్చు. అలాగే, ఈ సెలవులను ఇతర సెలవులతో కలిపి కూడా ఉపయోగించుకునే అవకాశం కల్పించారు. దత్తత శిశువు వయసు నెలరోజుల్లోపు ఉంటే ఏడాది వరకూ కూడా సెలవు ఇస్తారు. బిడ్డ వయసు ఆరు నెలల నుంచి ఏడు నెలలలోపు ఉంటే ఆరు నెలలు సెలవు తీసుకోవచ్చు. తొమ్మిది నెలలు, ఆ పైన వయస్సుంటే మూడు నెలలు సెలవు దొరుకుతుంది. ఇవన్నీ ఇతర సెలవులకు అదనంగా వస్తాయి. అయితే, దత్తత తీసుకునే వారికి అప్పటికే ఇద్దరు పిల్లలుంటే ఇవేవీ వర్తించవు. 
► పిల్లల సంరక్షణ సెలవులను 60 రోజుల నుంచి 180 రోజులకు పెంచుతూ పీఆర్సీ సిఫార్సుల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఉద్యోగి తన సర్వీసు కాలంలో ఎప్పుడైనా ఈ సెలవులను వినియోగించుకోవచ్చు. ఈ అవకాశం ఒంటరి (అవివాహితుడు, విడాకులు పొందిన వారు, భార్య చనిపోయిన వారు) పురుషులకూ వర్తిస్తుంది. 
► వికలాంగులైన ఉద్యోగులు తమ కృత్రిమ అవయవాలను మార్చుకునేందుకు ఏటా ఏడు రోజుల పాటు స్పెషల్‌ క్యాజువల్‌ సెలవులను పొందవచ్చు. హైరిస్క్‌ వార్డుల్లో పనిచేసే నర్సింగ్‌ ఉద్యోగులు కూడా ఈ సెలవులు తీసుకోవచ్చు. 
► ఇక ప్రాణాంతక వ్యాధులకు చికిత్స పొందుతున్న ఉద్యోగులకు ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. బేసిక్‌ పే లిమిట్‌ రూ.35,570గా ఉన్న నాన్‌ గెజిటెడ్‌ ఉద్యోగులు రూ.11,560 నుంచి, రూ.17,780 వరకూ, లాస్ట్‌ గ్రేడ్‌ ఎంప్లాయిస్‌ రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకూ ప్రతినెలా పొందవచ్చు. అలాగే, ఆర్జిత సెలవులు, సగం జీతం సెలవులు ముగిసిన తరువాత కూడా ఎక్స్‌ట్రా ఆర్డినరీ సెలవులు తీసుకోవచ్చు.   

మరిన్ని వార్తలు