కంటైనర్ల తయారీకి ప్రత్యేక ప్రోత్సాహకాలు

14 Mar, 2021 04:43 IST|Sakshi

నూతన లాజిస్టిక్‌ పాలసీ రూపకల్పనకు సలహాలివ్వండి 

షిప్పింగ్, లాజిస్టిక్‌ కంపెనీలను కోరిన మంత్రి గౌతమ్‌రెడ్డి  

సాక్షి, అమరావతి: సముద్ర ఆధారిత వాణిజ్యంపై ప్రత్యేక దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం అందుకు తగ్గట్టు మౌలిక వసతుల కల్పనకు ప్రణాళికను సిద్ధం చేస్తోంది. రాష్ట్రంలో కొత్తగా నాలుగు ఓడరేవుల నిర్మాణ పనులు మొదలవుతుండటంతో దీనికి అనుగుణంగా కంటైనర్లు, గిడ్డంగులతోపాటు రవాణాకు అవసరమైన మౌలిక వసతులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి తెలిపారు. కోస్తా తీరంలో పారిశ్రామిక పార్కులు, భారీ పెట్టుబడులు రానుండటంతో వారి అవసరాలను తీర్చే విధంగా పూర్తిస్థాయి ప్రణాళికను సిద్ధం చేస్తున్నామన్నారు.

ప్రస్తుతం దేశంలో కంటైనర్ల కొరత తీవ్రంగా ఉండటంతో రాష్ట్రంలో కంటైనర్ల తయారీకి ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. దీంతోపాటు గిడ్డంగులు, లాజిస్టిక్‌ పార్కులు ఏర్పాటు చేసే వారిని ప్రోత్సహించేలా నూతన పాలసీని తయారు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో షిప్పింగ్, లాజిస్టిక్‌ కంపెనీలు తమ అవసరాలను APLogisticsServices@gmail.com ద్వారా తెలియజేయాల్సిందిగా మంత్రి గౌతమ్‌రెడ్డి ట్వీట్‌లో కోరారు.  

>
మరిన్ని వార్తలు