-

విధ్వంసం ఘటనలపై ‘సిట్‌’ విచారణ

9 Jan, 2021 04:07 IST|Sakshi

ఏసీబీ అదనపు డీజీ అశోక్‌కుమార్‌ నేతృత్వం

16 మందితో ప్రత్యేక దర్యాప్తు బృందం

సెప్టెంబర్‌ నుంచి దేవాలయాల్లో జరిగిన దుశ్చర్యలపై పూర్తి స్థాయిలో దర్యాప్తు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఆలయాలపై దాడుల ఘటనలపై విచారణ జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌)ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఏసీబీ అదనపు డైరెక్టర్‌గా ఉన్న ఐపీఎస్‌ అధికారి జీవీజీ అశోక్‌కుమార్‌ సిట్‌ చీఫ్‌గా వ్యవహరిస్తారు. సిట్‌ బృందంలో మరో 15 మంది సభ్యులుంటారు. గతేడాది సెప్టెంబర్‌ నుంచి ఆలయాల్లో జరిగిన అన్ని ఘటనలపై సిట్‌ దర్యాప్తు చేయనుంది. ఫోరెన్సిక్‌ డైరెక్టర్‌ (ఎఫ్‌ఎస్‌ఎల్‌), సీఐడీ, ఇంటెలిజెన్స్‌ విభాగాలు దర్యాప్తులో సిట్‌కు సహకరిస్తాయి. ఎస్పీలు, స్థానిక పోలీసుల నుంచి సిట్‌ వివరాలు సేకరిస్తుంది. విజయవాడ, విశాఖలోని సీఐడీ సైబర్‌ క్రైమ్‌ టీమ్‌లు సిట్‌కు సహాయం అందిస్తాయి. ఆలయాల్లో ఘటనలపై సిట్‌ దర్యాప్తు చేసేందుకు అదనపు సిబ్బంది, సహాయ సహకారాల కోసం డీజీపీని కోరవచ్చు. దర్యాప్తు పురోగతిని శాంతిభద్రతల అదనపు డీజీకి తెలియచేస్తారు.

సిట్‌ బృందం వీరే: జీవీజీ అశోక్‌కుమార్‌ (ఏసీబీ అదనపు డైరెక్టర్, సిట్‌ చీఫ్‌), ఎం.రవీంద్రనాథ్‌బాబు (కృష్ణా జిల్లా ఎస్పీ), ఎస్‌.శ్రీధర్‌ (ఎస్‌ఐబీ అదనపు ఎస్పీ), ఎల్వీ శ్రీనివాసరావు (సీఐడీ అదనపు ఎస్పీ), సి.నరేంద్రనాథ్‌రెడ్డి (డీఎస్పీ), మేడపాటి వీరారెడ్డి (డీఎస్పీ), కె.హనుమంతరావు (విజయవాడ ఏసీపీ), ఆర్‌వీఎన్‌ మూర్తి (విశాఖ ఏసీపీ), ఎం.శ్రీనివాసరావు (విజయవాడ కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ సీఐ), పీపీ నాయుడు (విశాఖపట్నం రూరల్‌ పాడేరు సీఐ), వి.శ్రీరామ్‌ (ప్రకాశం జిల్లా పొదిలి సీఐ), ఎన్‌.నాగమల్లేశ్వరరావు (వెంకటగిరి సీఐ), సతీష్‌కుమార్‌ (ఏసీబీ ఎస్‌ఐ), జీఏవీ రమణ (విజయనగరం ఇంటెలిజెన్స్‌ ఎస్‌ఐ), పి.రామకృష్ణ (విజయనగరం దిశ ఎస్‌ఐ), కె.వెంకటరమణ (నెల్లూరు జిల్లా కోవూరు ఎస్‌ఐ). 

మరిన్ని వార్తలు